జ‌గ‌న్ చేతిలో మంత్రుల నివేదిక‌… వీళ్లకు క్లాస్ త‌ప్పదా ?

జగన్ కేబినెట్ మంత్రుల‌కు సంబంధించి చిత్రమైన వాద‌న కొన్నాళ్లుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదే స‌మ‌యంలో మంత్రుల‌ను చూస్తే.. కూడా ఇది నిజ‌మే క‌దా..! అని అనిపిస్తోంది. కొంద‌రు [more]

;

Update: 2021-07-08 13:30 GMT

జగన్ కేబినెట్ మంత్రుల‌కు సంబంధించి చిత్రమైన వాద‌న కొన్నాళ్లుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదే స‌మ‌యంలో మంత్రుల‌ను చూస్తే.. కూడా ఇది నిజ‌మే క‌దా..! అని అనిపిస్తోంది. కొంద‌రు మంత్రులు విప‌రీతంగా క‌ష్టప‌డుతున్నారు. మ‌రికొంద‌రు కొంత వ‌ర‌కు క‌ష్టప‌డుతున్నారు. ఇంకొంద‌రు చాలా ఉదాశీనంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇలా మూడు కేట‌గిరీలుగా మంత్రులు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో వారిపై చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి అన్ని శాఖ‌ల్లోనూ ప‌నులు ఉంటాయి. చివ‌రికి ఎలాంటి ప‌నీ ఉండ‌ద‌ని.. భావించే ప‌శుసంవ‌ర్థక శాఖ‌లోనూ ప‌ని ఇబ్బడి ముబ్బడిగా ఉంటోంది.

కొందరు కాలక్షేపం…

సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాల‌తో అన్ని శాఖ‌ల్లోనూ మంత్రుల‌కు ప‌నులు ఉంటున్నాయి. అయితే.. కొంద‌రు మాత్రమే ప‌నిచేస్తున్నార‌ని.. ఇంకొంద‌రు కాల‌క్షేపం చేస్తున్నార‌ని.. పార్టీలోనే చ‌ర్చ సాగుతోంది. అదే స‌మ‌యంలో మీడియా ముందుకు కొంద‌రు మాత్రమే వ‌స్తున్నారు. స‌రే! ఇది అచ్చంగా సీఎం నిర్ణయ‌మే క‌నుక .. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టడం లేదు. కానీ, ప‌నిచేసే విష‌యంలోనే కొంద‌రు ఉదాసీనంగా ఉంటూ.. మ‌రికొంద‌రు దూకుడుగా ఉండడం చ‌ర్చనీయాంశం అయింది. గ‌తంలో చంద్రబాబు హ‌యాంలో ప్రతిశాఖ‌పైనా ఆయ‌న నిరంత‌రం ప‌ర్యవేక్షించేవారు. దీంతో అంద‌రు మంత్రులూ యాక్టివ్‌గా ఉండేవారు.

సలహాదారుల జోక్యం…..

కానీ, జ‌గ‌న్ హ‌యాంలో వ‌చ్చే స‌రికి.. కొంద‌రు మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారు. దీనికి ప్రధానంగా రెండు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒకటి.. కీల‌క స‌ల‌హాదారు.. జోక్యం. రెండు రెండున్నరేళ్లపాటు.. త‌మ ప‌ద‌వులకు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. స‌ద‌రు మంత్రులు భావించ‌డమే. చాలా శాఖ‌ల్లో మంత్రుల‌ను ప‌క్కన పెట్టి.. కీల‌క స‌ల‌హాదారు ఒక‌రు జోక్యం చేసుకుంటున్నారు. దీంతో ఆయా శాఖ‌లు చూస్తున్న మంత్రులు, ఆయ‌న‌తో విభేదించ‌లేక పోతున్నారు. ఫ‌లితంగా మౌన‌మే మంచిద‌ని భావిస్తున్నారు. అస‌లు త‌మ శాఖాధిప‌తులు కూడా త‌మ ఫోన్లు లిఫ్ట్ చేయ‌డం లేద‌ని వాపోతున్న మంత్రులు కూడా ఉన్నారు. వారు కూడా మంత్రుల‌ను ప‌క్క‌న పెట్టేసి స‌ల‌హాదారులు చెప్పిన‌ట్టే చేస్తున్నార‌ట‌.

కొన్ని శాఖలు మాత్రమే…..

ఇంకొంద‌రు.. త‌మ‌కు రెండున్నరేళ్ల వ‌ర‌కు ప‌దవుల విష‌యంలో ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు క‌నుక‌.. ఎలా చేసినా. ఫ‌ర్వాలేదు.. సీఎం జ‌గ‌న్ అడిగిన‌ప్పుడు చూద్దాంలే.. అని స‌ర్దుకు పోతున్నారు. దీంతో కొంద‌రు మాత్రమే.. అంటే.. సీఎం జ‌గ‌న్ నిరంత‌రం ప‌ర్యవేక్షించే శాఖ‌ల‌కు చెందిన మంత్రులు మాత్రమే యాక్టివ్‌గా ఉండ‌గా.. ఇత‌రులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఫ‌లితంగా వాటిలో ప‌నితీరు స‌రిగాలేదని నివేదిక‌లు అందాయి. వీటిపై జ‌గ‌న్ రేపో మాపో.. స‌మీక్ష చేసి.. మంత్రుల‌కు క్లాస్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News