జగన్ కి మహా భయమా… ?

వైఎస్ జగన్ ది పుష్కర కాలం రాజకీయ అనుభవం. జగన్ గురించి అందరికీ తెలుసు. ఆయన తక్కువగా మాట్లాడుతారు, పాదయాత్రలో వేలాది మందితో బహిరంగ సభలు జరిగితే [more]

;

Update: 2021-07-09 14:30 GMT

వైఎస్ జగన్ ది పుష్కర కాలం రాజకీయ అనుభవం. జగన్ గురించి అందరికీ తెలుసు. ఆయన తక్కువగా మాట్లాడుతారు, పాదయాత్రలో వేలాది మందితో బహిరంగ సభలు జరిగితే జగన్ తాను చెప్పదలచుకున్నది క్లుప్తంగా చెప్పేసి ముగించేసేవారు. అదే చంద్రబాబు అయితే ఎక్కువ మంది జనం వస్తే పూనకం వచ్చినట్లుగా మాట్లాడుతారు అన్న మాటా ఉంది. ఇక జగన్ మీడియాతో ఎక్కువగా మాట్లాడింది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా లేదు. ఆయన ఇపుడు సీఎం కాబట్టి మీడియా ఫోకస్ బాగా ఉంటుంది. దాంతో ఆయనకు మీడియా ముందుకు ఎందుకు రారు అన్న దాని మీద ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉంటారు.

అలా దూరంగానే…..

జగన్ సీఎం అయ్యాక ఒకటి రెండు సందర్భాలలో తప్ప మీడియాను ఫేస్ చేయలేదు. ఇక జగన్ చెప్పాలనుకున్నది చెప్పేందుకు బోలెడు మంది ఉన్నారు. అయినా సరే సీఎం మాట్లాడాలని అంతా భావించేవారు ఉన్నారు. ఇక విపక్షాలు అయితే ఆయన మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు అంటూ ఎకసెక్కాలు ఆడేవారు. కానీ జగన్ ఒక మీడియా నిర్వాహకునిగా ఉన్నారు. ఆయనకు తెలుసు మీడియాను ఎలా ఫేస్ చేయడమో. కానీ జగన్ స్వభావమే వేరు కాబట్టే దూరంగా ఉంటున్నారు అని వైసీపీ నేతలు చెబుతారు. పైగా తమ నేతలు పబ్లిసిటీ పిచ్చ లేదని కూడా అంటారు.

అది నమ్మొచ్చా…?

జగన్ మీడియా ముందుకు రాకపోవడానికి భయమే కారణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు సూత్రీకరిస్తున్నారు. జగన్ ఏమీ చేయలేదు కాబట్టి మీడియా అడిగే ప్రశ్నలను అసలు తట్టుకోలేరని అందుకే పారిపోతున్నారని అంటున్నారు. మరి ఇదే నిజం అనుకుంటే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎక్కువగా మీడియాను ఉద్దేశించి మాట్లాడరు కదా. ఒడిషా సీఎం కానీ ఇతర రాష్ట్రాల సీఎంలు ఎవరూ మీడియాతో ప్రతీ రోజూ మాట్లాడిన దాఖలాలు లేవు కదా. అంతవరకూ ఎందుకు ఏడేళ్ళుగా ప్రధానిగా ఉన్న మోడీ కూడా ఎపుడూ మీడియా మీట్ పెట్టలేదు కదా. మరి వీరందరూ ఏ పనీ చేయడంలేదనా చంద్రబాబు ఉద్దేశ్యం అన్న చర్చ కూడా వస్తోందిపుడు.

అదే సీన్ కదా..?

మీడియా ఇపుడు గతంలోలా లేదు. అందులో కూడా పార్టీలు, రాజకీయాలు చేరిపోయాయి. పక్కా టీడీపీకి అనుకూలమని ఎముకలు మెడలో వేసుకుని శివతాండవం చేసే పసుపు పత్రికలు కూడా ఉన్నాయి. వీరంతా జగన్ ని అడగాలని, కడగాలని బాబు గారి ఆరాటమైతే అది జగన్ వద్ద అసలు సాగదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ కి జనంతోనే డైరెక్ట్ కనెక్షన్ ఉందని, మీడియాకు ఏది చేప్పాలో అది చెప్పే యంత్రాంగం కూడా ఉందని వారు వివరిస్తున్నారు. అలాంటపుడు జగనే మీడియా ముందుకు ఎందుకు రావాలి అన్న ప్రశ్నను వారు వేస్తున్నరు. మరో వైపు మీడియాతో గంటల తరబడి మీటింగులను చంద్రబాబే అలవాటు చేశారు, దేశంలో ఎక్కడా ఎవరూ చేయని పని కూడా అదేనని వారు కౌంటర్లేస్తున్నారు. మొత్తానికి జగన్ కి మీడియా భయం లేదని వారు అంటూంటే మీడియా ఫోబియా అని టీడీపీ అంటోంది.

Tags:    

Similar News