“ఆత్మ”లతో ఆటాడుకుంటున్నారుగా?
ఇదంతా వేదాంతం. ఎవరికీ అర్ధం కాని పరమాత్మ సిద్ధాంతం. కానీ ఇదే ఇపుడు ఏపీలో రాజకీయ రాద్ధాంతంగా మారుతోంది. జగన్ విషయంలో ప్రతీ రోజూ విమర్శలు చేసే [more]
;
ఇదంతా వేదాంతం. ఎవరికీ అర్ధం కాని పరమాత్మ సిద్ధాంతం. కానీ ఇదే ఇపుడు ఏపీలో రాజకీయ రాద్ధాంతంగా మారుతోంది. జగన్ విషయంలో ప్రతీ రోజూ విమర్శలు చేసే [more]
ఇదంతా వేదాంతం. ఎవరికీ అర్ధం కాని పరమాత్మ సిద్ధాంతం. కానీ ఇదే ఇపుడు ఏపీలో రాజకీయ రాద్ధాంతంగా మారుతోంది. జగన్ విషయంలో ప్రతీ రోజూ విమర్శలు చేసే టీడీపీ అనుకూల మీడియా ఉంది. వారికి జగన్ ని జనాలలో బదనాం చేయడమే ముఖ్య కర్తవ్యంగా ఉంది. జగన్ మీద ఇన్నాళ్ళూ ఫ్రాక్షనిస్ట్, లక్ష కోట్ల దోపిడీదారు అంటూ ఘనమైన ముద్రలు వేసిన పసుపు మీడియా పెద్దలు ఇపుడు ఆయన మీద క్షుద్రమైన ఆరోపణలకు దిగిపోతున్నారు. జగన్ ని ఏకంగా పిచ్చివాడు అన్నట్లుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన రాతలు వైసీపీలో మంట పుట్టిస్తున్నాయి. ఇది నిజంగా బరితెగింపే అంటున్నారు.
ఆత్మలతో అలా…?
జగన్ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారా? ఆయన జీసస్ తో మాట్లాడుతారా? ఆయన మరణించిన తన తండ్రి వైఎస్ తో కూడా మాట్లాడతారా? నిజానికి ఇవన్నీ సిల్లీగానే ఉన్నాయి. కానీ తామేదో జగన్ బెడ్ రూమ్ లో ఉండి అన్నీ చూసేసినట్లుగా పచ్చి పచ్చిగా పచ్చ రాతలు రాసే మీడియా వల్లనే ఇది చర్చకు వస్తోంది. జగన్ చదువుకున్న వారు. బిజినెస్ మాన్. రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసినా మూఢ నమ్మకాల మీద ఆయన ఎపుడూ మద్దతుగా మాట్లాడింది లేదు. పైగా ఆయన దేవుడిని నమ్మే ఆస్థికుడుగానే ఉన్నారు. మరి ఇన్ని కళ్ల ముందు ఉండగా జగన్ ఆత్మలతో అర్ధరాత్రి మాట్లాడుతారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసి అచ్చేయడమేంటి అన్నదే చర్చ.
అది పట్టుకుని …..
నిజానికి ఇదంతా ఎలా జగురుతోందో తెలియదు కానీ జగన్ ని ఆత్మలతో మాట్లాడేవానిగా ఒక మీడియా రాస్తే టీడీపీ భావి వారసుడు లోకేష్ మీరు ఆత్మలతో మాట్లాడ్డం ఆపి అంతరాత్మతో మాట్లాడండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంటే ఆత్మలతో మాట్లాడడం అన్న దాన్ని నిజం చేసేలా లోకేష్ కామెంట్స్ ఉన్నాయి అన్న మాట. దీన్ని బట్టి తెలిసేది ఏంటి అంటే ఏదో తోచిన రీతిన బండ వేసేయడం. దానికి మద్దతుగా మరిన్ని కామెంట్స్ చేయడం. ఏదో విధంగా మంచికో చెడ్డకో ఇది జనాల్లో చర్చకు ఉండేలా చూడడం ఇదొక స్ట్రాటజీగానే ఉందనుకోవాలేమో. నూటికి నూరు శాతం నమ్మక పోయినా కూడా కొందరు నమ్మినా చాలు జన్మ ధన్యం, బుర్రకు వచ్చిన ఇలాంటి ఘనమైన ఆలోచనలు కూడా ధన్యం అన్నట్లుగా పచ్చ రాతలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.
నిజంగా ఉందా…?
ఇలా ఆత్మల గురించి, అంతరాత్మల గురించి మాట్లాడుతున్న వారికి కానీ రాసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి కానీ అవి నిజంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఆత్మలను చంపుకుని బతికే వారే రాజకీయాల్లో ఉంటారని ఒక నానుడి. ఎవరేమన్నా కూడా తుడిచేసుకుని నిస్సిగ్గుగా ముందుకు పోయే వారే రాజకీయాల్లో కనిపిస్తారు. అలాంటి రాజకీయాల్లో ఆత్మలకు జొప్పించడం అంటే నిజంగా వింతలోకెల్లా వింత. జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఇలా రాతలు రాస్తున్న వారు కూడా అంతరాత్మలను ఎక్కడో తాకట్టు పెట్టిన వారేనని వైసీపీ నేతలు అంటున్నారు అంటే తప్పేముంది. ఆనాడు ఎనభై దశకంలో ఎన్టీయార్ మీద కూడా ఇలాంటి కధనాలు వచ్చేవి. ఆయన క్షుద్ర పూజలు చేసేవారని పిచ్చి రాతలు రాసేవారున్నారు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఎపుడూ అలాంటివి ప్రచారం లోకి రాలేదు. నాటికీ నేటికీ తేడా ఏంటి అంటే ప్రధాన స్రవంతి లోని మీడియానే ఇపుడు ఆ పని చేయడం. అంటే ఆత్మలను కూడా అమ్ముకునో చంపుకునో ఇలాంటివి రాస్తూ జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లే అనుకోవాలి. జగన్ అయితే ఇలాంటి వాటి మీద సీరియస్ గానే ఉన్నారని ఆయన కామెంట్స్ బట్టి అర్ధమవుతోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే రాతలే ఇవి. మొత్తానికి దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ఆత్మ సాక్షిగా అంటూ రాసే రాతగాళ్ళు ఎక్కువైపోతారు. తస్మాత్ జాగ్రత్త.