జగన్ మార్క్ విజన్ ?

ఒక వైపే చూడు రెండవ వైపు చూడాలనుకోకు అని బాలయ్య సినిమాలో ఒక భారీ డైలాగ్ ఉంటుంది. అలాగే ఏపీలో కూడా జగన్ ఒక వైపే చూస్తూ [more]

;

Update: 2021-07-12 13:30 GMT

ఒక వైపే చూడు రెండవ వైపు చూడాలనుకోకు అని బాలయ్య సినిమాలో ఒక భారీ డైలాగ్ ఉంటుంది. అలాగే ఏపీలో కూడా జగన్ ఒక వైపే చూస్తూ ఇన్నాళ్ళు గడిపారు. రెండేళ్ళ పాలనలో చెప్పుకోవడానికి ఏముంది అంటే పంచుడే. డబ్బులు తెచ్చి కుమ్మరించడమే. లెక్కకు మిక్కిలిగా పధకాలను అమలు చేస్తూ వాటి పేర్లు కూడా అధికార పార్టీ నాయకులు మరచిపోయేటంతలా స్కీములను నడిపించారు. దీంతో విపక్షాలకు సైతం విసుగొచ్చి విమర్శలు సంధిస్తున్నాయి. అభివృద్ధి ఎక్కడా లేదని కూడా గట్టిగా గర్జిస్తున్నాయి.

పాయింటే మరి ….

ఒక ప్రభుత్వం అంటే దాన్ని సమగ్రమైన రూపం కనిపించాలి. మనిషి తల వరకూ అందంగా ఉందని, కాళ్లూ చేతులు సన్నగా ఉంటే ఏం బావుంటుంది. ఇదే మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. మేము ప్రభుత్వ సమగ్రమైన రూపాన్ని చూస్తాం, మీలా ఒక వైపు చూసి బాగుంది అని చప్పట్లు కొట్టలేమని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే గఫూర్ వైసీపీ నేతలకు ఈ మధ్య జరిగిన ఒక టీవీ చర్చలో గట్టిగానే ఇచ్చేశారు. ప్రభుత్వం అంటే కేవలం పంచుడు మాత్రమే కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మరో వైపు చూస్తే జగన్ మీద మోజు తో మొదటి ఏడాది, కరోనాతో వచ్చిన సానుభూతితో రెండేళ్లు గడచిపోయాయి. జనాలు కూడా ప్రశ్నించలేదు. ఇపుడు మాత్రం అభివృద్ధి కావాలన్నది మెల్లగా నినాదంగా మారుతోంది.

రూట్ మార్చేశారా….?

దీంతో జగన్ కూడా తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. జగన్ కూడా తన ప్రాధ్యాన్యతలను ఇలా అయిదేళ్ళకు పంచుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది. తాను చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను మొదటి రెండేళ్ళు పూర్తి చేసి అభివృద్ధి మీద తరువాత సంవత్సరాల‌లో దృష్టి పెట్టాలని ఆయన ఆలోచించారని అంటున్నారు. సరిగ్గా ఇపుడు ఆ టైమ్ వచ్చేసింది. అందుకే ఏపీలో పారిశ్రామికరణకు అనుకూల వాతావరణాన్ని జగన్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఏకంగా ఏపీకి 12 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చేలా పలు అనుమతులు ఇస్తూ కార్యాచరణను రూపొందించారు.

అలా ముందుకు….

ఇక ఏపీకి ఐటీ కళ కట్టాలంటే ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున ఇవ్వాల్సిందే అని జగన్ డిసైడ్ అయ్యారు.అందుకే ఐటీ పాలసీలో ఇన్సెంటీవ్స్ ని కుమ్మరించేశారు. అటు ఐటీ ఉద్యోగులు, ఇటు ఐటీ సంస్థలు కూడా మెచ్చుకునేలా ఉభయతారకంగా ఈ పాలసీని డిజైన్ చేశారు. ఏపీలో మూడు ప్రాంతాలలో ఐటీ రంగం గట్టిగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు చూస్తే పారిశ్రామికవేత్తలకు ఉదారంగా భూమి, నీరు, విద్యుతు అందించేందుకు కూడా జగన్ సర్కార్ రెడీ అవుతోంది. మూడవ ఏడాది విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అంటున్నారు. కేవలం తూతూ మంత్రంగా వాటిని పెట్టడం కాకుండా మెటీరియలైజ్ అయ్యేలా చూడాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారట. మొత్తానికి అభివృద్ధిని ఎంతో కొంత చూపించి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ గట్టిగా తీర్మానించుకున్నారు అంటున్నారు.

Tags:    

Similar News