ఇక జనం బాట పట్టక తప్పేట్లు లేదే?

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు తెలుగు ప్రజలు గమనిస్తుంటారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొంతకాలంగా సాగుతుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి [more]

;

Update: 2021-07-14 02:00 GMT

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు తెలుగు ప్రజలు గమనిస్తుంటారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొంతకాలంగా సాగుతుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా విమర్శలు చేసుకోకపోయినా ఎవరికి వారు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఇద్దరిలో ఒకరు జనంలోకి వెళుతున్నారు. మరొకరు క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు.

యాక్టివ్ అయిన కేసీఆర్….

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ప్రగతి భవన్ లేదా ఫాం హౌస్ కే కేసీఆర్ పరిమితమవుతారన్న విమర్శలున్నాయి. దీనిని పక్కన పెడుతూ కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టడంతో అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా కేసీఆర్ ఉన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన జనం బాట పట్టారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లి కార్యాలయాన్ని వదిలి రావడం లేదు.

ఏడాదిన్నరగా….

దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. నెలలు తరబడి లాక్ డౌను ను విధించాల్సి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు ఏడాదిన్నరగా జిల్లాల పర్యటనలు చేయడం లేదు. కేసీఆర్ జిల్లా పర్యటనలు చేస్తుండటంతో ప్రజలు పోల్చి చూస్తున్నారు. ఆ వయసులో కేసీఆర్ పర్యటించగా లేనిది, జగన్ కు ఏం ఇబ్బంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదు. రెండేళ్ల నుంచి సంక్షేమ పథకాలను జోరుగా అమలు పరుస్తున్న జగన్ మాత్రం ప్రజల వద్దకు వెళ్లలేకపోయారు. వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితమయ్యారు.

అధికారులకు ఆదేశాలు…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేపట్టడంతో జగన్ సయితం ఇక పర్యటనలకు రెడీ అవుతున్నారని తెలిసింది. ప్రతి జిల్లాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారానికి ఒక జిల్లా పర్యటనను ప్లాన్ చేయాలని జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్లాన్ చేయాలని కోరారు. దీంతో కేసీఆర్ తరహాలోనే జగన్ కూడా జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News