జగన్ కు కేసీఆర్ పరీక్ష
రాష్ట్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం. ప్రజాదరణలో అందుకోలేనంత ఎత్తున అగ్రాసనం . నిత్యం జనం నీరాజనాలు. పంచాయతీ ఎన్నిక మొదలు పార్లమెంటు ఎన్నికల వరకూ ఏకపక్షమే. ప్రచారానికి వెళ్లకపోయినా తన [more]
;
రాష్ట్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం. ప్రజాదరణలో అందుకోలేనంత ఎత్తున అగ్రాసనం . నిత్యం జనం నీరాజనాలు. పంచాయతీ ఎన్నిక మొదలు పార్లమెంటు ఎన్నికల వరకూ ఏకపక్షమే. ప్రచారానికి వెళ్లకపోయినా తన [more]
రాష్ట్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం. ప్రజాదరణలో అందుకోలేనంత ఎత్తున అగ్రాసనం . నిత్యం జనం నీరాజనాలు. పంచాయతీ ఎన్నిక మొదలు పార్లమెంటు ఎన్నికల వరకూ ఏకపక్షమే. ప్రచారానికి వెళ్లకపోయినా తన పార్టీ వారికే పట్టం కడుతోంది ప్రజాతీర్పు. రాజకీయ ప్రత్యర్థులు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఇంతకు మించిన సౌలభ్యం, సౌఖ్యం ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పొరుగు రాష్టం నుంచి ప్రత్యర్థి వచ్చి పడ్డాడు. ప్రతిపక్షాలను ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదని రూఢిగా తేలిపోయింది. కానీ ఈ కొత్త ప్రత్యర్థి విసిరే సవాల్ ప్రజల్లో తన పలుకుబడికి పరీక్ష పెడుతోంది. ఎంత సంయమనంగా ఉందామనుకున్నా అది చేతగానితనమనుకుంటారేమోననే భయం లోలోపల వెంటాడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో కునుకు పట్టనీయని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య దాయాది వైరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం వంటి అన్ని విషయాల్లోనూ ప్రజల్లోనూ, నాయకుల్లోనూ , పార్టీల్లోనూ పోలిక వస్తోంది. ఏపీ, తెలంగాణల్లో ఎవరు ముందున్నారనే ప్రశ్న పదే పదే మీడియా చర్చలకు కారణమవుతోంది.
పక్కలో బల్లెం…
చంద్రబాబు నాయుడి పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో కేసీఆర్ చాలా సహకరించారు. సామదానభేదోపాయాలతో తెలంగాణతో సంబంధం ఉన్న రాజకీయ నేతలను జగన్ కు సానుకూలంగా మలిచారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రా రాజకీయ వేత్తలకు వ్యాపారాలు, పరిశ్రమలు ఉండటంతో కేసీఆర్ చెప్పినట్లు చేయకతప్పలేదు. చంద్రబాబు నాయుడనే ఉమ్మడి శత్రువును కలిసికట్టుగా ఓడించి ఇంటికి పంపించేశారు. అంతవరకూ బాగానే ఉంది. తాజాగా పరిస్థితులు తిరగబడ్డాయి. జగన్ సోదరి పార్టీ పెట్టడం, తెలంగాణలో ప్రత్యర్థి పక్షాలు బలం పుంజుకోవడంతో యాంటీ ఆంధ్రా సెంటిమెంటును మరోసారి తలకు ఎత్తుకోక తప్పని స్థితి కేసీఆర్ కు ఎదురవుతోంది. అందులో భాగంగానే ఏపీ వ్యతిరేకతను కనబరుస్తున్నారు. ఏపీలో జగన్ కు ఉన్నంతటి ప్రబలమైన జనాదరణ కేసీఆర్ కు తెలంగాణలో లేదు. నలభై శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ తెచ్చుకోగలుగుతోంది. బీజేపీ, కాంగ్రెసు, ఇతర పార్టీల ఓటు షేర్ అరవై శాతం పైగా ఉంది. తప్పనిసరిగా పక్క రాష్ట్రంతో అవసరమైన సందర్బంలో అగ్గి పుట్టించుకోక తప్పదు. ఈ అనివార్యత కేసీఆర్ ను జగన్ కు పక్కలో బల్లెంలా మారుస్తోంది.
ఉద్యోగాల ఉప్పు ..
కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ముఖ్యమంత్రి పాలన విధానంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఈ ఏడాది మొత్తానికి 10 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయనున్నట్లు జగన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏపీ లో నిరుద్యోగుల సంఖ్య తెలంగాణ కంటే ఎక్కువగా ఉంది. గతంలో హైదరాబాద్ లో ఏదో రకంగా ఉపాధి వెదుక్కునే సదుపాయం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత క్రమేపీ అవకాశాలు కుదించుకుపోతున్నాయి. ప్రయివేటు కంపెనీలు కూడా స్థానికులకే పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రయివేటు ఉద్యోగాలకు ఆధారమైన పెద్దనగరాలు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు కనుచూపు మేరలో కనిపించక అల్లాడిపోతున్నారు యువకులు. కేసీఆర్ ఉద్యోగ విధానాలతో తమ ప్రభుత్వ విధానాలను పోల్చుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల వంటివి కంటితుడుపు మాత్రమే తప్ప శాశ్వత ఉపాధి కాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ అంశం జగన్ ప్రభుత్వంపై నిరసనకు, అసంతృప్తికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
అనుభవ రాహిత్యం…
ఆనందంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదంటారు. అటువంటి సందర్భాల్లో మంచి చెడ్డలు, లాభనష్టాలను బేరీజు వేసుకునే మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. గెలిచిన ఆనందంలో ఉమ్మడి రాజదానిగా ఉన్న హైదరాబాద్ లో పూర్తి హక్కులను జగన్ స్వచ్చందంగా వదిలేసుకున్నారు. సెక్రటేరియట్ ను పూర్తిగా తెలంగాణకు అప్పగించేశారు. ఇతర కార్యాలయాలు సైతం మూత వేసేసుకున్నారు. అదే సమయంలో పదో షెడ్యూల్ లోని 140 సంస్థలు, తొమ్మిదో షెడ్యూల్ లోని 70 సంస్థల ఆస్తులకు సంబంధించి విభజనపై ఎటువంటి హామీ తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కేసీఆర్ దే పైచేయిగా మారింది. ఈ విషయం కూడా ప్రజల్లో చర్చకు పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ తో తన రాజకీయ అవసరాలు తీరిపోవడంతో జగన్ కు సహకరించేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. కృష్ణా జలాల పంపిణీపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండువంతులు ఆంధ్రాకు, ఒక వంతు తెలంగాణకు సరఫరా చేసేందుకు ఒప్పుకున్న కేసీఆర్ ప్రస్తుతం అడ్డం తిరుగుతున్నారు. సగం, సగం పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి నిస్సహాయంగా మారిపోయారు. ఇది కచ్చితంగా ఆయనకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుంది. ముఖ్యమంత్రి జగన్ బలహీనతను ప్రజల్లో చర్చకు పెట్టి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశాలున్నాయి. ఆంధ్రా రాజకీయ పార్టీలకు అధికార వైసీపీపై పోరాటానికి అవసరమైన అస్త్రాలను కేసీఆర్ సమకూరుస్తున్నారు. బలహీనంగా ఉన్న విపక్షాలు పోరాటం చేసేందుకు కొత్త ముడిసరుకును అందిస్తున్నారు.
– ఎడిటోరియల్ డెస్క్