పోయిన సారి అన్నీ కలసి వచ్చాయి.. కానీ ఈసారి?

వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పెద్దగా లేదు. మరో మూడేళ్ల సమయం ఉండటంతో జగన్ డెవెలెప్ [more]

;

Update: 2021-08-12 05:00 GMT

వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పెద్దగా లేదు. మరో మూడేళ్ల సమయం ఉండటంతో జగన్ డెవెలెప్ మెంట్ పై దృష్టి పెడతారు. అయితే ఈసారి ఎన్నికల్లో జగన్ కు సానుభూతి ఉండదు. వైఎస్ చరిష్మా కూడా పెద్దగా పనిచేయదు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు సయితం జగన్ వెంట నడిచే అవకాశం లేదు. దీంతో జగన్ తన సొంత ఇమేజ్ పైనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

బంపర్ మెజారిటీతో….?

2019 ఎన్నికల్లో జగన్ కు అన్నీ కలసి వచ్చాయి. వైఎస్ చరిష్మాతో పాటు 2014 ఎన్నికల్లో ఓటమి, పాదయాత్ర అన్నీ కలసి ప్రజల్లో సింపతీని కలిగించాయి. విజయమ్మ, షర్మిల ప్రచారం కూడా జగన్ కు కలసి వచ్చింది. దీనికి తోడు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ కోరడం కూడా ఆయనకు ప్లస్ అయింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా దీనికి తోడవ్వడంతో జగన్ కు 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ దక్కింది.

వచ్చే ఎన్నికల నాటికి…

కాని వచ్చే ఎన్నికలకు ఇవేమీ పనిచేయవు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు. సంక్షేమ పథకాల విషయంలో జగన్ మాత్రం అత్యధిక శాతం మంది ప్రజల వద్దకు చేరిపోయారు. కానీ విచ్చలవిడిగా పథకాల పేరుతో ప్రజల సొమ్మును పంచిపెట్టడాన్ని మాత్రం మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఏపీని కేవలం పథకాల రాష్ట్రంగా మార్చివేశారని, పరిశ్రమలు రాక ఉపాధి అవకాశాలు కొరవడ్డాయన్న విమర్శలు జగన్ పై ఉన్నాయి.

ఉద్యోగుల్లోనూ అసంతృప్తి…

ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్ పట్ల సంతృప్తికరంగా లేరు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వోద్యోగులు 90 శాతం మంది పనిచేశారు. కానీ వీరిలో కూడా బాగా మార్పు వచ్చిందంటున్నారు. సీపీఎస్ విధానాన్ని అమలు పర్చకపోవడం, పీఆర్సీ అమలు చేయకపోవడం వంటి వాటిపై వారంతా గుర్రుగా ఉన్నారు. జీతాలు సకాలంలో రాకపోవడం, రాజధాని మార్పు అంశం కూడా ఉద్యోగులపై ప్రభావం చూపనుంది మొత్తం మీద జగన్ కు గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల నాటికి మైనస్ లు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News