జగన్, బాబు టార్గెట్ వారే… ?
ఏపీలో రాజకీయం ఎపుడో కులాలుగా విడిపోయింది. ఇక ఆ కులాలలో కూడా ఆర్ధిక అసమానతలు చూసి వారిని కూడా ఆకట్టుకోవడానికి నాయకులు తయారైపోతున్నారు. ఇక రాజకీయ నాయకులు [more]
;
ఏపీలో రాజకీయం ఎపుడో కులాలుగా విడిపోయింది. ఇక ఆ కులాలలో కూడా ఆర్ధిక అసమానతలు చూసి వారిని కూడా ఆకట్టుకోవడానికి నాయకులు తయారైపోతున్నారు. ఇక రాజకీయ నాయకులు [more]
ఏపీలో రాజకీయం ఎపుడో కులాలుగా విడిపోయింది. ఇక ఆ కులాలలో కూడా ఆర్ధిక అసమానతలు చూసి వారిని కూడా ఆకట్టుకోవడానికి నాయకులు తయారైపోతున్నారు. ఇక రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అట్టడుగు వర్గాలకే సాయం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే తంతు కొనసాగుతూవస్తోంది. ఈ నేపధ్యంలో మిగిలిన వర్గాలు ఆగ్రహిస్తున్నాయి. దానికి విరుగుడుగా కేంద్రంలోని మోడీ సర్కార్ అగ్ర వర్ణ పేదల కోసం పది శాతం రిజర్వేషన్ల పేరిట చట్టం చేసింది. దాని వల్ల రిజర్వేషన్ మీద తెగ మండిపడే బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు, రెడ్లు, కమ్మలు, వెలమలు, కాపులు కూడా లాభపడతారు. నిజానికి వీరిలోనే అత్యధికులు మధ్యతరగతి వర్గంగా ఉన్నారు.
సై అన్న జగన్ …
జగన్ కూడా ఇపుడు అగ్ర వర్ణ పేదల మీద దృష్టి సారించారు. వారి కోసం విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లు కల్పిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు. అగ్ర వర్ణ పేదల నిబంధనలు కూడా సరళతరం చేశారు. వార్షికాదాయం ఎనిమిది లక్షలకు తక్కువగా ఉన్న వారు అంతా పేదలే అని జగన్ సర్కార్ స్పష్టంగా చెప్పింది. దాంతో నూటికి తొంబై అయిదు శాతం పైగా ఈ కేటగిరీలోకి వచ్చేస్తారు. దీంతో ఇపుడు జగన్ ప్రభుత్వం అగ్ర వర్ణాలకు మంచి చేసుకుంటోందని అంటున్నారు. దీనికంటే ముందే అగ్ర వర్ణ పేదల కోసం కార్పోరేషన్లు కూడా జగన్ సర్కార్ ఏపీలో ఏర్పాటు చేసింది. తాజా నిర్ణయంతో ఈ వర్గం మద్దతు కోసం మరో అడుగు ముందుకేసినట్లుగా చెప్పుకోవాలి.
బాబు అటే ..?
ఇక చంద్రబాబుకు అగ్ర వర్ణాలలో మంచి మద్దతు ఉంది. ఎన్టీయార్ అంటే వ్యతిరేకించే ఈ వర్గాలు బాబును చూసి మాత్రం ముందుకు వస్తాయి. చంద్రబాబు దార్శనీకుడు అని ఈ వర్గాలు కొనియాడతాయి కూడా. ఈ వర్గాల మద్దతు కాంగ్రెస్ కి కూడా అప్పట్లో తక్కువగా లభిస్తే జగన్ వైసీపీకి ఇంకా బాగా తగ్గింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అవినీతి పాలన మీద ప్రచారం పెద్ద ఎత్తున సాగడంతో ఈ వర్గాలు జగన్ కి కొంత సానుకూలం అయ్యాయి. రెండేళ్ళుగా ఏపీలో అభివృద్ధి లేకపోవడంతో పాటు ప్రభుత్వం కేవలం పంచుడుకే పరిమితం కావడంతో ఈ వర్గాలు మళ్లీ దూరమయ్యాయి. దాంతో వారిని ఆకట్టుకోవడానికి బాబు గట్టిగా ట్రై చేస్తూంటే జగన్ కూడా గురి చూసి మరీ అస్త్రాలను వదులుతున్నారు.
రాత మారుస్తారా…?
ఈ వర్గాలే ఎక్కువగా రాజకీయాలు చర్చిస్తాయి. వీరిలో మార్పు వస్తే ప్రభుత్వాలు కూడా కదిలిపోతాయి. వీరే ఉద్యోగాల మీద ఎక్కువగా ఆధారపడతారు. అలాగే, ఎక్కువగా మిడిల్ క్లాస్ గా ఉండే ఈ వర్గాలు మౌత్ టాక్ ద్వారానే ఏ ప్రభుత్వం మంచి చెడ్డ అయినా జనాలకు చెబుతాయి. దాంతో వీరి ద్వారా మిగిలిన వర్గాలు ప్రభావితం అయి రాజకీయాన్ని కీలక మలుపు తిప్పుతాయి. అందువల్ల వీరు ఓట్లేయరు, మనకెందుకు అని ఎవరైనా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. జగన్ కూడా ఇన్నాళ్ళూ ఈ వర్గాలను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇపుడు సగం పాలన పూర్తి కావడంతో వీరిని టార్గెట్ చేశారు. మరి జగన్, బాబులలో ఎవరిని ఉత్తమ సీఎం గా ఈ వర్గాలు భావిస్తాయో ఎవరికి వచ్చే ఎన్నికల్లో దన్నుగా ఉంటాయో చూడాల్సిందే.