ఓపికకయినా ఒక హద్దుంటుందిగా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. కానీ తనను నమ్ముకున్న నేతలకు ఇప్పటి వరకూ పదవులు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి [more]

;

Update: 2021-07-16 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. కానీ తనను నమ్ముకున్న నేతలకు ఇప్పటి వరకూ పదవులు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారితో పాటు పదేళ్లుగా పార్టీతో అనుబంధం ఉన్నవారిని జగన్ పట్టించుకోవడం లేదు. జగన్ అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జపం చేస్తున్నారని సొంత పార్టీ నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. పార్టీకి అన్ని రకాలుగా అండదండలుగా నిలిచిన వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి జగన్ పెద్దపీట వేస్తున్నారని నేతలు కినుక వహిస్తున్నారు.

రెండున్నరేళ్లయినా?

జగన్ అధికారంలోకి రెండున్నరేళ్లే అయింది కాబట్టి ఓపికగా వారంతా ఎదురు చూస్తున్నారు. తమపై జగన్ దృష్టి పడుతుందని వారు నమ్మకంతో ఉన్నారు. జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినా వీలు కలవకపోవడంతో ముఖ్యనేతలను కలసి తమ గోడు చెప్పుకుని వెళుతున్నారు. అయితే రానున్న కాలంలో ఈ నేతల అసంతృప్తి బయటపడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కన్పిస్తున్నాయి. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ నేతలు ఎక్కువగా కన్పిస్తున్నారు.

పదవి వస్తుందని….

జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశించారు. అధికారంలో లేనప్పుడు చేతి చమురు వదలించుకుని, ఇప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ భర్తీ చేసే పదవులన్నీ జగన్ కొన్ని వర్గాలకే ఇస్తుండటం కూడా వారి ఆగ్రహానికి కారణంగా చెప్పాలి. కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో తప్పు లేదని, కానీ ప్రతి పదవిలోనూ ఆ కోణం చూస్తే ఎలా అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.

అంతా ఆ జపమేనా?

జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. ఆయన పాదయాత్రతో పాటు నేతలుగా నియోజకవర్గాల్లో తమ శ్రమ కూడా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన తమను అధికారంలోకి వచ్చినా ఆదుకోకపోతే పార్టీలో ఉండటం వృధా అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇలాంటి నేతలు దాదాపు నలభై నుంచి యాభై మంది ఉండటంతో రానున్న కాలంలో జగన్ కు రాజకీయంగా కష్టం.. నష్టం సంభవించే అవకాశాలు మాత్రం కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News