మాట నిలబెట్టుకుని … ఎవరిని మర్చిపోకుండా ?
జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఏ ఒక్కరినీ మరచిపోలేదు. తనతో పాదం కదిపిన వారంతా ఆయనకు గుర్తే. తన వెంట కష్టాలలో పడి నలిగిన వారు అంటే [more]
;
జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఏ ఒక్కరినీ మరచిపోలేదు. తనతో పాదం కదిపిన వారంతా ఆయనకు గుర్తే. తన వెంట కష్టాలలో పడి నలిగిన వారు అంటే [more]
జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఏ ఒక్కరినీ మరచిపోలేదు. తనతో పాదం కదిపిన వారంతా ఆయనకు గుర్తే. తన వెంట కష్టాలలో పడి నలిగిన వారు అంటే గౌరవమే. అన్నింటికీ మించి విదేయతకు జగన్ పెద్ద పీట వేశారు. జగన్ కోసం ఆస్తులు తగలేసుకుని నాడు కాంగ్రెస్, తరువాత టీడీపీ ప్రభుత్వాల నుంచి అనేక వేధింపులను ఎదుర్కొన్న వారందరినీ పిలిచి మరీ పెద్ద పీట వేశారు. వారి బయోడేటా తన దగ్గర ఉందని చెప్పకుండానే చెప్పి పదవులు ఇచ్చి షాక్ తినిపించేశారు. దటీజ్ జగన్ అనిపించుకున్నారు.
న్యాయం జరిగింది….
విశాఖ జిల్లాలో పదవులు అందుకున్న వారి జాబితా చూసిన పార్టీ నాయకులు అంతా ఒక్కటే మాట అంటున్నారు. న్యాయం జరిగింది అన్నదే ఆ మాట. సాధారణంగా పదవుల పంపిణీ జరిగినపుడు విమర్శలు, అలకలు అసంతృప్తులు సొంత పార్టీ నుంచే వస్తాయి. కానీ వైసీపీలో మాత్రం ఆలా జరగకపోవడం విశేషం. పైగా పదవులు ఆశించి భంగపడిన వారు సైతం జగన్ అందరినీ బాగా గమనిస్తున్నారని, ఆయన తప్పక న్యాయం చేస్తారని విశ్వాసం కనబరచడం విశేషం. అదే విధంగా సీనియర్లకు పదవులు దక్కడం మంచి పరిణామమేనని, ఇవాళ వారి వంతు, ఇదే తీరున కష్టపడితే రేపు తమ వంతు కూడా అంటూ వారు అనడం వైసీపీలో ఒక విశేషం పరిణామంగానే చూడాలి మరి.
లోటు పూడ్చారా ..?
ఎన్నికలు జరిగి రెండున్నరేళ్ళు అయింది. విశాఖ సిటీలో ఎన్నికల్లో పోటీ చేసిన చోట వైసీపీ ఓటమి పాలు కాగా టీడీపీ గెలిచింది. అలా సిటీకి నాలుగు దిక్కులా పార్టీకి ఇబ్బందులు వచ్చాయి. అయితే లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేనాటికి వైసీపీ పుంజుకుని ఓడిన చోటనే జెండా ఎగరేసింది. దాని కోసం శ్రమించిన పార్టీ నేతలను గుర్తు పెట్టుకుని మరీ జగన్ పదవులు పంపిణీ చేశారు. పశ్చిమలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, ఉత్తరంలో ఓడిన కేకే రాజులకు సముచిత స్థానమే దక్కింది. కీలకమైన కార్పోరేషన్లు వీరికి దక్కాయి. ఇక దక్షిణంలో చూసుకుంటే మైనారిటీ నాయకుడు జాన్ వెస్లీకి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్ పదవి లభించింది. ఉత్తరానికే చెందిన మరో కీలక నాయకుడు చొక్కాకుల వెంకటరావు ఫ్యామిలీకి కూడా కాకినాడ విశాఖ మెట్రో రీజియన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. గాజువాకలో రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ నామినేటెడ్ పదవులలో మాత్రం యాదవ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి అక్కడ టీడీపీకి షాక్ ఇచ్చారు.
ఓర్చుకున్న వాళ్ళకే ..?
కష్టాలు వచ్చాయని బయటపడకుండా ఓర్చుకున్న వారికే ఇపుడు పదవులు వరించాయని అంటున్నారు. ఇక అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే నేతలకు మాత్రం జగన్ చుక్కలే చూపించారు. మీరింకా వైసీపీకి కొత్తవారే అంటూ కాస్తా ఓపిక పట్టమని చెప్పినట్లు అయింది. ఇతర పార్టీలలో సీనియారిటీ వైసీపీలో చూపించి పదవులు పొందాలనుకుంటే తన వద్ద కుదరదు అని సందేశం ఇచ్చారు. వైసీపీకి చమటోడ్చిందే తనకు క్రెడిటేరియా అని జగన్ చెప్పకనే చెప్పేశారు. అందువల్ల వైసీపీలో ఎవరూ నిరాశ పడాల్సింది లేదు. పనిచేస్తేనే పదవులు అన్న న్యాయ సూత్రాన్ని జగన్ అమలు చేస్తున్నందువల్ల షార్ట్ కట్ మెథడ్స్ లో కుర్చీలు పట్టాలనుకునే వారికి తప్ప మిగిలిన వారికి ఈ పంపిణీ నిండా ఆనందాన్ని నింపిందనే చెప్పాలి.