జగన్ ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు … ?

జగన్ ఆగ్రహం ఏంటి అంటే తాను ఇచ్చిన బీ ఫారం మీద ఎంపీ గా గెలిచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సవాల్ చేయడమేంటి అన్నది. [more]

Update: 2021-08-15 13:30 GMT

జగన్ ఆగ్రహం ఏంటి అంటే తాను ఇచ్చిన బీ ఫారం మీద ఎంపీ గా గెలిచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సవాల్ చేయడమేంటి అన్నది. అందువల్ల ఆయన్ని మాజీని చేయాలని జగన్ పంతం మీద ఉన్నారు. అందుకోసం ఆయన అలుపెరగని పోరాటమే చేస్తున్నారు. తమ పార్టీ టికెట్ మీద గెలిచి తిరుగుబాటు చేశారు అన్నదే జగన్ అండ్ కో భావన. మరి అదే నిజం అయితే జగన్ రమ్మని పిలిచారో, లేక వారే వచ్చారో తెలియదు కానీ ఏపీలో కూడా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజు బాటలోనే సాగారు అన్నది నిజం.

వీరి సంగతేంటి …?

ఏపీలో తెలుగుదేశానికి 23 మంది గెలిస్తే అందులో కొందరు వైసీపీకి మద్దతు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన మద్దాల గిరి, ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం, కృష్ణా జిల్లాకు చెందిన వల్లభనేని వంశీ, విశాఖ జిల్లాకు చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి బాహాటంగా మద్దతు ఇస్తున్నారు. ఇక జనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పవన్ని కాదని జగన్ కి జై కొడుతున్నారు. మరి వీరి సంగతి కూడా చూడాలి కదా అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.

వేటు పడితే అలా….

అయితే జగన్ కూడా ఇలాంటి ఆరోపణలు భరించడానికి సిద్ధంగా లేరు అంటున్నారు. రఘురమా కృష్ణం రాజు మీద లోక్ సభ స్పీకర్ వేటు వేస్తే ఇక్కడ శాసనసభలో ఈ అయిదుగురు ఎమ్మెల్యేల మీద వేటు పడేలా చూస్తారని అంటున్నారు. అంటే ఒక్క రాజుతోనే ఈ గొడవ పోదు మొత్తం ఏపీలో అరడజన్ దాకా ఉప ఎన్నికలు అసెంబ్లీకి కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. జగన్ కూడా ముఖ్యామంత్రి అయిన కొత్తలో చెప్పినట్లుగానే తన పార్టీలో చేరాలంటే అవతల పార్టీ తరఫున వచ్చిన పదవికి రాజీనామా చేయాల్సిందే అన్న విధానమే అనుసరిస్తారు అంటున్నారు. ఈ విధంగా వాటిని కూడా గెలుచుకుని విపక్షాలు నోరెత్తకుండా చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉందిట.

బాబుకు జవాబు…

ఇక్కడ చిత్రమేంటి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చినా టీడీపీ వాటి గురించి ఏమీ గొడవ చేయడంలేదు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద రాజీనామాలు చేయండి, మూడు రాజధానుల మీద పదవులు వదులుకోండి, ప్రత్యేక హోదా మీద రిఫరెండం కోరండి అంటూ బాబు వీలున్న ప్రతీ సారీ డిమాండ్ చేస్తూంటారు. ఆ విధంగా చూసుకుంటే మూడు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో గెలిస్తే బాబుకు సరైన జవాబు ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా వైసీపీ పెద్దల మరో ఆలోచనట. ఇక బాబు వెనకేసుకువస్తున్న రఘురామ అసలు సత్తా ఏంటి, టీడీపీ బలం ఏంటి అన్నది ప్రజా క్షేత్రంలోనే తేల్చాలని జగన్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి రాజు గారి మీద అనర్హత వేటు పడితే ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతాయనే అంటున్నారు.

Tags:    

Similar News