విశాఖ మీద ప్రేమ ఇంతేనా జగన్?

జగన్ ఎందుకో విశాఖను కోరుకున్నారు. ఆయన మనసు సొంత గడ్డ కడప కంటే కూడా విశాఖ మీదనే ఎపుడూ ఉంటూ వచ్చింది. దానికి కారణం ఆయన మాతృమూర్తి [more]

;

Update: 2021-08-17 03:30 GMT

జగన్ ఎందుకో విశాఖను కోరుకున్నారు. ఆయన మనసు సొంత గడ్డ కడప కంటే కూడా విశాఖ మీదనే ఎపుడూ ఉంటూ వచ్చింది. దానికి కారణం ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మను విశాఖలో ఎంపీగా పోటీకి పెడితే లక్ష ఓట్ల తేడాతో ఓడిపోవడం కావచ్చు. ఆనాటి నుంచి విశాఖవాసుల మనసు గెలుచుకోవాలని జగన్ తెగ తాపత్రయపడ్డారు. విపక్ష నేతగా ఉద్యమాలను కూడా అనేకం విశాఖలో చేపట్టారు. విశాఖలో టీడీపీ హయాంలో భూదందా జరుగుతోందని సేవ్ విశాఖ పేరిట భారీ ధర్నా చేపట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఏకంగా విశాఖను పాలనారాజధానిగా ప్రకటించి మరీ విశాఖ మై స్వీట్ హార్ట్ అనేశారు.

సగం పాలనలో…

జగన్ ఈ మాట చెప్పి ఏడాదిన్నర కావస్తోంది. మూడు రాజధానుల బిల్లుని చట్టం చేసి కూడా ఏడాది పై దాటింది. కానీ విశాఖ మాత్రం అలాగే ఉంది. సరే మూడు రాజధానుల చట్టం న్యాయ సమీక్షలో ఉంది. ఆ విచారణ జరిగి తీర్పు ఎపుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ అనుకూలంగా వచ్చినా అవతల పార్టీ అప్పీల్ కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దాని సంగతి అలా ఉంచితే జగన్ ముఖ్యమంత్రిగా సగం పాలన పూర్తి అయినా అయినా విశాఖ ఊసును మాత్రం ఇపుడు గట్టిగా తలవడంలేదు ఎందుకు అన్న డౌట్ అయితే అందరిలోనూ వస్తోంది.

అన్నీ గెలిచేశాక…

విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీ గెలిచింది. విశాఖ రాజకీయాల్లో కూడా టీడీపీని పక్కన నెట్టి బలంగా తయారైంది. ఆ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించి పసుపు శిబిరంలో పరవశం అన్నదే లేకుండా చేసింది. ఇదంతా కూడా విశాఖ రాజధాని అన్న ఏకైక నినాదంతోనే జగన్ చేయగలిగారు. కానీ ఇపుడు తాడేపల్లి గడప దాటి జగన్ బయటకు రావడంలేదు. విశాఖను పాలనారాజధాని గా చేయాలంటే కోర్టు తీర్పు అవసరం కానీ విశాఖ రావడానికి కూడా అనుమతి కావాలా జగన్ అని నగర వాసులు అంటున్నారు.

బాబే నయమా …?

విశాఖలో ఒక్క రాత్రి కూడా జగన్ సీఎం అయ్యాక బస చేయలేదు. విశాఖకు ఆయన వచ్చింది కూడా చాలా తక్కువ. ఆయన సీఎం అయ్యాక రెండు సార్లు శారదాపీఠాంకే వచ్చారు. ఆ తరువాత మరోసారి విశాఖలో ఎల్జీపాలిమర్స్ లో ప్రమాదం జరిగితే వచ్చారు. అంతే తప్ప జగన్ విశాఖకు వచ్చి ఉన్నదీ లేదు, అక్కడ అభివృద్ధి మీద సమీక్ష చేసినదీ లేదు అన్న విమర్శలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరో వైపు సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖకు తరలిస్తారు అన్నది కూడా ప్రచారంగానే ఉంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు. ఏపీలో పెద్ద నగరంగా ఉన్న విశాఖకు జగన్ తరచూ విడిది చేసి అక్కడ ప్రగతి మీద తనదైన సలహా సూచనలు ఇచ్చినా జనాలు ఎంతో కొంత సంతోషపడతారు. కానీ జగన్ మాత్రం విశాఖ విషయంలో ఎందుకో దూరంగానే ఉంటున్నారు. జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు తన అయిదేళ్ళ పాలనలో ఎన్నో సార్లు వచ్చారు. ఎన్నో సమావేశాలు కూడా నిర్వహించారు. విపక్షంలో ఉంటూ కూడా ఈ రెండున్నరేళ్ళలో ఆయన చాలా సార్లు వచ్చారు. మరి విశాఖ మీద జగన్ కి ప్రేమ తగ్గిందా. లేక వ్యూహాత్మకమా. లేక వేచి చూసే ధోరణా. తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Tags:    

Similar News