ఆ సినీ నటికి జగన్ టికెట్ ఇస్తారా.. ?

జగన్ పార్టీకి సినీ గ్లామర్ బహు తక్కువ. అయిన సరే 2019 ఎన్నికలకు ముందు చాలా మంది సినీ స్టార్లు చేరారు. కానీ వారు ఇపుడు ఎక్కడ [more]

;

Update: 2021-08-26 03:30 GMT

జగన్ పార్టీకి సినీ గ్లామర్ బహు తక్కువ. అయిన సరే 2019 ఎన్నికలకు ముందు చాలా మంది సినీ స్టార్లు చేరారు. కానీ వారు ఇపుడు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. రాజ్యసభ సీటు కోసం మోహన్ బాబు బాగానే ట్రై చేశారని, అది జగన్ ఇవ్వలేదని ఆయన అలిగారని చెబుతారు. ఇక సీనియర్ కమెడియన్ ఆలీ ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నారు. ఆ మధ్య దాకా జగన్ ని తరచూ కలుస్తూ వచ్చారు. కానీ ఆయన కూడా ఇపుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నటులు పోసాని క్రిష్ణ మురళి భానుచందర్, డైరెక్టర్ ఎస్వీ క్రిష్ణారెడ్డి వంటి వారు జగన్ కి మద్దతు ఇచ్చి కూడా ఇపుడు తమ పనేదో తామేదో అన్నట్లుగా ఉన్నారు.

మళ్ళీ జగనేనట…

విశాఖ జిల్లా మాడుగులకు చెందిన రమ్యశ్రీ తెలుగు సినిమా నటి. ఆమె చాలా సినిమాలు చేశారు. మల్లి అని సినిమాలో తానే లీడ్ రోల్ పోషించి నిర్మించారు. ఆమె వైసీపీకి మద్దతు ఇచ్చి 2019 ఎన్నికల వేళ ప్రచారం చేశారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఆమె సోదరుడు గవిరెడ్డి రామునాయుడు టీడీపీ తరఫున 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మరో సోదరుడు 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారు. ఇంట్లో వేరే పార్టీలు ఉన్నా కూడా రమ్యశ్రీకి జగన్ అంటే ఇష్టం. అందుకే జగన్ మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమాగా చెబుతున్నారు.

గుర్తిస్తారా మరి…?

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన నామినేటెడ్ పదవుల పంపకంలో తనను జగన్ గుర్తించలేదు అన్న బాధ ఏమీ లేదని ఆమె తాజాగా చెప్పుకొచ్చారు. జగన్ కి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు అని ఆమె అంటున్నారు. సరైన సమయం వచ్చినపుడు తనకు కూడా అవకాశం ఇస్తారని ఆమె నమ్మకం పెట్టుకున్నారు. ఇక తాను స్వచ్చంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాను అంటున్నారు. అంతే కాదు 2024లో జరిగే ఎన్నికల్లో తాను మాడుగుల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని కూడా మనసులో మాటను బయటపెట్టారు. అంటే ఆమె చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు అన్న మాట.

ఆ సీనియర్ ని కాదని…?

మాడుగులలో సీనియర్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. ఆయనకు జగన్ ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన ఆయనే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయన మీద ఎటువంటి మచ్చ లేదు, జగన్ కూడా ఆయన పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఆయన లొంగకుండా పార్టీలో ఉన్నారు. దాంతో ఆయనకే మళ్ళీ జగన్ టికెట్ ఇస్తారని అంటున్నారు. మరి రమ్యశ్రీ కనుక ఆశలు పెట్టుకుంటే జగన్ ఆమెకు ఎంత మేరకు అవకాశం ఇస్తారు అన్నది చూడాలి. ఏది ఏమైనా సినిమా వారికి వైసీపీలో చాన్సులు తక్కువే అన్న మాట అయితే ఉంది మరి.

Tags:    

Similar News