ఆ మంత్రుల మీద జగన్ గుస్సా… ?

తాను ఎంపిక చేసుకున్న పాతిక మంది మంత్రులలో పనిమంతులు ఎవరు అన్నది జగన్ కి ఈ పాటికి పక్కా క్లారిటీ వచ్చి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే మంత్రులుగా [more]

;

Update: 2021-08-08 12:30 GMT

తాను ఎంపిక చేసుకున్న పాతిక మంది మంత్రులలో పనిమంతులు ఎవరు అన్నది జగన్ కి ఈ పాటికి పక్కా క్లారిటీ వచ్చి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు అంతా రెండేళ్ళకు పైగా కొనసాగుతున్నారు. వారిని ఎంపిక చేసుకున్నపుడు జగన్ ఎక్కువగా సామాజిక తూకాన్ని, ప్రాంతాలను చూసుకున్నారు. దాంతో పెర్ఫార్మెన్స్ లో కొందరు బాగా వెనకబడిపోతున్నారు అన్నది జగన్ కి అందుతున్న నివేదికలు. ఇక అనుభవం ఉన్న వారు, సీనియర్లు కూడా అసలు నోరు విప్పడంలేదు. ఇదంతా ఎందుకు అంటే తమకెందుకు వచ్చిన తలనొప్పి అని వారు ప్రతీ విషయానికి దూరం జరుగుతున్నారు. మొత్తానికి పాతిక మంది మంత్రులు 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన బలమైన వైసీపీ సర్కార్ అన్ని విషయాల్లోనూ విపక్షాలకు అడ్డంగా దొరికేస్తోంది.

విపక్షలదే సౌండ్….

ఏపీలో ఏం జరిగినా కానీ అధికార పక్షం కంటే విపక్షం సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతీ దాన్ని జగన్ వైఫల్యం కిందనే జమ కట్టేసి పెద్ద నోరుతో విరుచుకుపడిపోతున్నారు. ఇక ఏపీలో గత కొంతకాలంగా సర్కార్ దివాళా తీసింది అన్న ప్రచారాన్ని మొదలెట్టారు. ఇది నిజంగా ఏ ప్రభుత్వానికైనా తలవంపులే. టీడీపీ, దాని అనుకూల మీడియా అయితే దీన్నే జనంలోకి గట్టిగా తీసుకుపోతోంది. అసమర్ధం అవినీతి పాలన అంటూ చంద్రబాబు తరచూ విమర్శలు చేస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా కోరస్ పాడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తమను కాచుకోవడానికి తమ వెర్షన్ వినిపించడానికి వైసీపీ మంత్రులు ఎవరూ సిద్ధంగా లేకపోవడమే దారుణం అంటున్నారు.

క్లాస్ తీసుకున్నారా … ?

ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జగన్ మంత్రివర్గ సమావేశంలో కొందరి మంత్రుల మీద గట్టిగానే మాట్లాడారు అంటున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేస్తూంటే బాధ్యత లేదా అంటూ జగన్ నిలదీశారని అంటున్నారు. ఒక వైపు బీజేపీ ఏపీలో మత రాజకీయాలకు పాల్పడుతోంది. తెలుగుదేశం అయితే తన హయాంలో జరిగిన తప్పులను కూడా కలిపి చుట్టి వైసీపీ మీదకు తెలివిగా నెడుతున్నా కూడా మంత్రులు కిక్కురుమనడంలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. కీలకమైన విషయాల్లో మంత్రులు స్పందించాలని జగన్ ఆదేశించినట్లుగా చెబుతున్నారు. లేకపోతే ప్రజలలోకి తప్పుడు ప్రచారమే వెళ్తుందని కూడా అంటున్నారు.

గుండె దడ పెరిగిందా..?

తాజా మంత్రివర్గ సమావేశం తరువాత జగన్ ఆలోచనలు మరింతగా తెలుసుకున్న మంత్రులలో గుండె దడ బాగా పెరిగిందని అంటున్నారు. ఎందుకంటే జగన్ దగ్గర మార్కులు ఎవరికి పడ్డాయో ఎవరికీ పడలేదో కూడా ఎవరికి వారే అంచనా కట్టుకుంటున్నారుట. కచ్చితంగా మరో నాలుగు నెలలలో మంత్రి వర్గ విస్తరణ ఉంది. దాంతో ఈ నాలుగు నెలల్లో ఎంత మెరుగుపడినా ఫలితం ఉండదని కొందరు అయితే డిసైడ్ అయిపోయారు అంటున్నారు. మొత్తానికి చూస్తే మంత్రుల తప్పులను ఎత్తిచూపడం ద్వారా జగన్ ఎవరూ పదవుల మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పేసారని అంటున్నారు

Tags:    

Similar News