ఈసారి దసరా అయినా… ?

ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఇప్పటికి రెండు దసరాలు వచ్చాయి. ముచ్చటగా మూడవసారి దసరా వస్తోంది. ఆనాటికైనా జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం జరుగుతుందా అన్న చర్చ [more]

;

Update: 2021-08-31 02:00 GMT

ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఇప్పటికి రెండు దసరాలు వచ్చాయి. ముచ్చటగా మూడవసారి దసరా వస్తోంది. ఆనాటికైనా జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం జరుగుతుందా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చాక ఉగాది, దసరాలకు ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఆ టైమ్ కి మంచి ముహూర్తాలు చూసుకుని జగన్ విశాఖ వచ్చేస్తున్నాడు అంటూ ఇప్పటికి చాలా రకాలుగా ప్రచారం జరిగింది. ఇపుడు కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. దసరా నుంచి విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్ పాలన సాగిస్తారు అన్నదే దాని సారాంశం.

ముందుగా అలా…

ఇక ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా విశాఖకు తొందరలో తరలి వస్తుంది అంటున్నారు. దాని కోసం విశాఖ బీచ్ రోడ్డులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగుని కూడా ఖాయం చేశారని అంటున్నారు. అత్యాధునిక హంగులు కలిగిన ఈ భవనంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ సాగరతీరాన్ని ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చాలని జగన్ భావిస్తున్నారట. సాధారణంగా పార్టీ హెడ్డాఫీసులు రాజధానిలోనే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అనధికారికంగా విశాఖను రాజధానిగా వైసీపీ డిక్లేర్ చేసినట్లు అవుతోంది అంటున్నారు.

ఏది ఎలాగైనా ..?

జగన్ మూడు రాజధానులంటూ ఆర్భాటంగా ప్రకటించారు. దానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. కోర్టులో విచారణ జరిగి తీర్పులు వచ్చినా అది సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళే చాన్స్ ఉంది. ఆ తీర్పు వచ్చేటప్పటికి బహుశా ఎన్నికలు కూడా 2024లో జరిగిపోవడం ఖాయం. దాంతో తన మాట నిలబెట్టుకోవాలన్నా ఈ ప్రాంతీయుల ఆశలు నెరవేర్చాను అన్న తృప్తి ఉండాలన్నా జగన్ చేయగలింది ఎంతో కొంత ఉంది. అందుకే ఆయన తన చేతుల్లో ఉన్న వాటినే ఇపుడు చురుకుగా పరిశీలిస్తున్నారు అంటున్నారు.

ఇదీ వ్యూహం…

కర్నూలు కి న్యాయ రాజధాని రావాలి అంటే అంత తొందరగా జరగని పని. అందుకే హైదరాబాద్ లో ఉన్న మానవహక్కుల ఆఫీస్ ని కర్నూలు లో పెట్టడానికి జగన్ రెడీ అవుతున్నారుట. మరో వైపు లోకాయుక్త కార్యాలయాన్ని కూడా కర్నూలు లో పెట్టడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. అలాగే హై కోర్టు అనుబంధ ఆఫీసులను కూడా కర్నూలు లో ఉండేలా చూస్తున్నారుట. అలా కర్నూలు కి న్యాయ రాజధాని కళను అద్దాలనుకుంటున్నారు. అదే టైమ్ లో విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకోవడానికి న్యాయపరమైన అడ్డంకులు ఉండవు అంటున్నారు. దాంతో తొందరలోనే జగన్ అటు కర్నూలు, ఇటు విశాఖ జనాలు మెచ్చేలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారు. దానికి ముహూర్తం ఈసారి దసరా రోజు కావచ్చు అన్న ప్రచారం అయితే సాగుతోంది.

Tags:    

Similar News