ఎన్టీఆర్ ని గుర్తు చేయమాకు జగనూ…?

జగన్ ని చాలా విషయాల్లో ఎన్టీఆర్ తో పోలుస్తారు. జగన్ కి ఉన్న పట్టుదల మొండితనం అన్న గారికీ ఉండేవి. ఇక ఇద్దరూ మంత్రులు గా చేయకుండా [more]

;

Update: 2021-08-24 11:00 GMT

జగన్ ని చాలా విషయాల్లో ఎన్టీఆర్ తో పోలుస్తారు. జగన్ కి ఉన్న పట్టుదల మొండితనం అన్న గారికీ ఉండేవి. ఇక ఇద్దరూ మంత్రులు గా చేయకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రులు అయిన వారే. ఇద్దరికీ అపరిమితమైన ప్రజాదరణ ఉన్న సంగతి విదితమే. మనసులో ఆలోచన వచ్చిందే తడవుగా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జగన్ ఎన్టీఆర్ సరిసాటిగా నే ఉంటారు. ఇపుడు జగన్ మరో విషయంలో ఎన్టీఆర్ ని గుర్తుకు తేస్తారు అంటున్నారు. మరి అది ప్రచారమా లేక నిజమవుతుందా అంటే కొద్ది నెలలు ఓపిక పట్టాలి.

నాడు అలా …?

ఎన్టీఆర్ 1989లో ఒకేసారి మొత్తం మంత్రులను తన క్యాబినెట్ నుంచి తొలగించేశారు. ఆ తరువాత కొత్త వారికే తీసుకున్నారు. ఆ ఏడే ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ లో జరిగిన జమిలి ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి 73 సీట్లు మాత్రమే దక్కాయి. ఆయన ఓడిపోయారు. దానికి ఆయన చేసిన అతి పెద్ద తప్పు మూకుమ్మడిగా మంత్రులను ఎన్నికల ఏడాదిలో తొలగించడం అని అంటారు. మరి జగన్ కూడా మొత్తం మంత్రులను మార్చేస్తారు అన్న వార్త అయితే గట్టిగా వినిపిస్తోంది. అది నిజమైతే పరిణామాలు ఎలా ఉంటాయో అని వైసీపీ వర్గాలు తల్లడిల్లుతున్నాయి.

చాన్స్ ఇచ్చినట్లే…?

వైసీపీలో అసమ్మతి ఉందా లేదా అన్నది పక్కన పెడితే మొత్తానికి మొత్తం మంత్రులను తొలగిస్తే మాత్రం అది కోరి మరీ సొంత పార్టీలో సంక్షోభానికి జగన్ చాన్స్ ఇచ్చినట్లుగా ఉంటుంది అంటున్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ చాలా మంది సీనియర్లను మార్చేశారు. అయితే ఆయన కూడా బలమైన వారిని ఉంచారు. కొంతమందికి ప్రమోషన్లు కూడా ఇచ్చారు. కానీ ఏపీలో అలాంటి ఫీట్ చేయడం అంటే జగన్ చాలా ఆలోచించాలి. ఆయన సగం మందిని తీసేసినా ఫరవాలేదు కానీ మొత్తానికి మొత్తం మంగళం అంటే మాత్రం ఉవ్వెత్తున అసమ్మతి ఎగసిపడుతుంది అంటున్నారు. అది విపక్షాలకు కూడా అస్త్రంగా మార్చుకునేందుకు వీలు అవుతుంది.

అది గెలిస్తే ఓకే …?

ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. జగన్ మంత్రి వర్గ విస్తరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా హితైషులు సూచిస్తున్నారు. ఎవరినీ నొప్పించకుండా ఈ కసరత్తు పూర్తి కాదు కానీ నచ్చ చెప్పి మెజారిటీ ఎమ్మెల్యేలను చల్లబరచవచ్చు. అలాగే మంత్రులను కూడా ఎందుకు తీసేస్తున్నామో చెప్పి ఒప్పించవచ్చు. కానీ ఒక్క దెబ్బకు ఠా అన్నట్లుగా మంత్రులు అందరికీ మాజీలుగా చేస్తే మాత్రం జగన్ మరో ఎన్టీఆర్ అవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. మరి జగన్ ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎన్నుకుంటారో చూడాలి.

Tags:    

Similar News