జగన్ పై వ్యతిరేకత అంత ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కంటే మీడియాతోనే అధికారపార్టీ ఎక్కువగా పోరాటం చేయాల్సి వస్తోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెసు, వామపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలు పెద్దగా కదలిక [more]
;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కంటే మీడియాతోనే అధికారపార్టీ ఎక్కువగా పోరాటం చేయాల్సి వస్తోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెసు, వామపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలు పెద్దగా కదలిక [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కంటే మీడియాతోనే అధికారపార్టీ ఎక్కువగా పోరాటం చేయాల్సి వస్తోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెసు, వామపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలు పెద్దగా కదలిక తేవడం లేదు. ప్రజలు ఉదాసీనంగా ఉంటున్నారు. పార్టీలన్నిటినీ ఒకేగాటన కట్టేస్తున్నారు. తాము నిజాయతీపరులమని చెప్పుకునేందుకు ఏ ఒక్కపార్టీకి, నేతకు హక్కులేదనేది స్థూలంగా ప్రజాభిప్రాయం. అందుకే జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజావ్యతిరేకత ప్రబలడం లేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో నిస్సత్తువ ఆవరిస్తోంది. జనసేన, బీజేపీలు దాదాపు ఉద్యమాలకు మంగళం పాడేశాయి. వామపక్షాలు టీడీపీ హయాంలో ఎంతోకొంత హడావిడి చేస్తుండేవి. ప్రస్తుతం ఉద్యమాలకంటే ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ యాక్టివిటీ కనిపిస్తోంది. కానీ యాక్షన్ ప్లాన్ కరవు అవుతోంది. ఆ పాత్రను పోషించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా భారీ కసరత్తు చేస్తోంది. రాజకీయ క్సేత్రంలో ప్రతిపక్షాలకున్న గ్యాప్ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది.
బాకా మీడియా పక్షపాతం..
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మరింత క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రప్రభుత్వ తప్పిదాలు దానికి కలిసి వస్తున్నాయి. కేంద్రం నుంచి అందుతున్న సమాచారమూ ఆసరాగా ఉంటోంది. ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు కొత్త అస్త్రాలు దొరుకుతున్నాయి. ఆంధప్రదేశ్ అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఏపీతో పాటు ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితుల్లోనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడి పరిపాలన చివరి దశలో అథో:ముఖ ప్రస్థానం మొదలైంది. ఈ రెండున్నర ఏళ్లలో పతాకస్తాయికి చేరింది. టీడీపీ పరిపాలనలోనే బీజం పడిన వాస్తవాన్ని మరుగున పరిచి ఈ రెండేళ్లనే హైలైట్ చేస్తోంది మీడియా. గతంలో టీడీపీ పరిపాలన చాలా మెరుగైన కాలం అన్నరీతిలో ప్రొజెక్టు చేస్తోంది. ప్రజల్లో జగన్ సర్కారు ప్రతిష్ఠను దెబ్బతీసే పనిని చేపడుతోంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడమే పనిగా మాధ్యమాలు పాక్షిక దృష్టికోణాన్నే ప్రదర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు పోరాట సత్తా కోల్పోయిన నేపథ్యంలో వాటికి జీవం పోసేందుకు మీడియానే ఇప్పుడొక ప్రధాన ప్రేరకంగా నిలుస్తోంది.
తప్పుదారి పట్టిస్తూ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ కోల్పోతున్నారంటూ ఇటీవల ఒక మీడియా హైలైట్ చేయడం మొదలు పెట్టింది. ఇండియాటుడే ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో జగన్ కు ప్రజల్లో ఆదరణ గతం కంటే తగ్గిందనేది వార్త. ఏపీలో తీసుకున్న నమూనా పరిమాణం అత్యల్పంగా ఉండటం, విద్యాధిక వర్గాల నుంచే శాంప్లింగ్ ఉండటంతో ఈ ఫలితాలు వచ్చాయి. ఏపీలో నాలుగుకోట్ల వరకూ ఓటర్లు ఉన్నారు. 175 శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. 20 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో 700 శాంప్లింగ్ మాత్రమే సర్వే సంస్థ తీసుకున్నట్లు సమాచారం. ఏ రకంగా చూసినా ఇది నామమాత్రపు నమూనానే. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అసెంబ్లీ నాటి రికార్డును వైసీపీ తిరిగి సాధించగలిగింది. ఇంకా పబ్లిక్ మద్దతు అధికారపార్టీకే కొనసాగుతోందనేందుకు అదొక ఉదాహరణ. మరోవైపు టీడీపీ పుంజుకుంటున్నట్లు ఏ సర్వే కూడా చెప్పడంలేదు. ఈ స్థితిలో అధికారపార్టీకి ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఆ విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా దాచిపెడుతూ వైసీపీని డామేజ్ చేయడమే లక్ష్యంగా వార్తలు వండి వార్చడం వల్ల ఒనగూడే ప్రయోజనం శూన్యం.
ఆత్మహత్యాసదృశం…
ఆంద్రప్రదేశ్ దురదృష్టం ఏమిటంటే అధికార,ప్రతిపక్షాలు , మీడియా అన్నీ కలిసికట్టుగా ఆత్మహత్యా సదృశమైన రాజకీయాలనే నడుపుతున్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు ఇతర రాస్ట్రాల్లోనూ ఇటువంటి ధోరణి కనిపించదు. తెలంగాణలో భయంకరమైన పోటీ రాజకీయం ఉంది. అయినా రాస్ట్ర ప్రయోజనాల విషయానికొచ్చేసరికి ఒకే వాయిస్ ఉంటుంది. జలవివాదాల్లో ఇంచుమించు పార్టీల వాదన అంతా ఒకటే చందంగా మనం గమనించవచ్చు. కానీ ఏపీలో వైసీపీ తీసుకునే ప్రతినిర్నయాన్ని టీడీపీ, మీడియా వ్యతిరేకిస్తుంది. కృష్ణాజలాల విషయంలోనూ జగన్ ప్రభుత్వానికి టీడీపీ నుంచి మద్దతు లభించలేదు. తమిళనాడులో ఏఐడీఎంకే, డీఎంకే దాదాపు శత్రువులుగా వ్యవహరిస్తుండేవి. ప్రస్తుతం నిర్మాణాత్మకంగా సహకరించుకుంటున్నాయి. అలాగే బీహార్ లో జేడీయూ, ఆర్జెడీ బలమైన ప్రత్యర్థులు. కానీ తాజాగా బీసీ కులాల జనగణన విషయంలో ఒక్కతాటిపైకి వచ్చి ప్రధానమంత్రిని కలిశాయి. ఇక కేంద్రం సందర్భానుసారంగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపక్సాలతో తీవ్రమైన విభేదాలు నెలకొనకుండా చూసుకుంటోంది. అంతర్జాతీయ అంశాల్లో సాధ్యమైనంతవరకూ ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుగా ప్రత్యేక బాటలో పయనిస్తోంది. ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి ఏపీ పట్ల చిన్నచూపునకు ఇదొక కారణమవుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్