సర్కార్ వారి కొత్త పాట

ఈ దేశంలో ఒక దురాచారం ఉంది. ఇంట్లో ఒకరికి అధికార పదవి వస్తే చాలు ఆ ఇంటి మొత్తం సభ్యులు అధికారాన్ని చలాయిస్తారు. ఇక మహిళలకు పవర్ [more]

Update: 2021-09-09 06:30 GMT

ఈ దేశంలో ఒక దురాచారం ఉంది. ఇంట్లో ఒకరికి అధికార పదవి వస్తే చాలు ఆ ఇంటి మొత్తం సభ్యులు అధికారాన్ని చలాయిస్తారు. ఇక మహిళలకు పవర్ ఇస్తే ముందుగా తెర ముందు ప్రత్యక్షం అయ్యేది మొగుడు గారే. ఏపీలో కూడా సీన్ అలాగే ఉంది. జగన్ మహిళలకు అన్ని పదవులల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే పేరుకే వారు పదవుల్లో ఉన్నారు కానీ మొత్తం కధను నడిపించేది వారి భర్తలే. ఇక ఈ వ్యవహరం బాగా ముందుకు వెళ్ళిపోయింది. ఏకంగా సతీమణి కుర్చీలో దర్జాగా కూర్చుని అధికారులతో మీటింగులు పెట్టేసే మొగుడ్స్ కూడా ఉన్నారు.

అంతే సంగతులు….

ఇది ఆ నోటా ఈ నోటా వినిపిస్తూ వస్తున్న విషయమే. అయితే జగన్ సర్కార్ మాత్రం దీన్ని అసలు ఉపేక్షించను అంటోంది. పంచాయతీ నుంచి కార్పోరేషన్ వరకూ మహిళకు ఇచ్చిన పదవులలో భర్తలు కనిపిస్తే ఇక కఠిన చర్యలే అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆడ సర్పంచ్ ఇంట్లో ఉంటే భర్త సర్పంచ్ వేషం కట్టి పంచాయతీ ఆఫీస్ లో రాజకీయం చేసే సీన్ ఉండదని స్పష్టంగా ప్రభుత్వ పెద్దలు చెప్పేశారు. అలాగే ఏపీలో మేయర్లుగా ప్రధాన నగరాలలో ఎంపిక అయ్యారు. కానీ భర్తలే రాజ్యం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పే అంటోంది వైసీపీ సర్కార్. అలా ఇక మీదట జరిగితే చూస్తూ ఊరుకోమని కూడా చెప్పేసింది ప్రభుత్వం.

టోటల్ ఫ్యామిలీస్ ….

లోకల్ బాడీ సర్వ సభ్య సమావేశాలు జరుగుతూంటే టోటల్ ఫ్యామిలీస్ తోనే నేతశ్రీలు దిగిపోతున్నారు. అక్కడ ప్రజల నుంచి ఎన్నికైన వారి కంటే ఈ బంధువర్గమే ఎక్కువగా ఉంది. పైగా ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వీరే ముందు వరసలో కూర్చుని హడావుడి చేస్తున్న సన్నివేశాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. దాంతో ఈ సమావేశాలకు అయ్యే ఖర్చు కూడా బాగా పెరిగిపోతోంది అని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. భోజనాల నుంచి ఇతర సదుపాయాల వరకూ మొత్తం సర్కార్ వారి పాట పాడేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి కళ్ళెం బిగించేసింది అంటున్నారు. బంధువులతో సహా మీటింగులకు స్థానిక ప్రజా ప్రతినిధులు వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చేశాయి.

అదే బాగుందా…?

గతంలో పురుషులే పదవులు తీసుకునేవారు. కానీ రాను రానూ మహిళలకు రిజర్వేషన్లు అని డిమాండ్ రావడంతో పేరుకు ఇస్తున్నారు. కానీ ఆమె భర్త పేరొందిన నాయకుడు కావడం ఆమె ఇంట్లో ఇల్లాలుగానే ఉండిపోవడంతో కొత్త చిక్కులు వస్తున్నాయి. అంతే కాదు, ఆడది చదువుకుంటే అందరూ చదువుకున్నట్లే అని అంటారు. ఇపుడు ఆడవారికి పదవులు వస్తే ఆ ఇంట్లో అందరికీ వచ్చినట్లే అన్నట్లుగా అయిపోతోంది. దీంతో సీన్ సితార్ అవుతోంది. మహిళలు ముందుకు వచ్చి తమ అధికారాన్ని తెలుసుకోలేకపోవడం, వారు భర్త చాటుగానే ఉండడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. అదే టైమ్ లో భర్తలు కూడా తమ భార్యలను పక్కన పెట్టి రాజ్యం చేయడంతో పదవి ఒకరికి కాదు ఇద్దరిదీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో ఈ మొగుడ్స్ పెళ్ళామ్స్ పొలిటికల్ గేమ్ కి తెర దించాలని జగన్ సర్కార్ గట్టిగానే భావిస్తోంది. ఇక మీదట మహిళా మేయర్లు, చైర్ పర్సన్స్ నే మనం చూడవచ్చా అంటే వచ్చు అనుకోవాలేమో.

Tags:    

Similar News