ఈయనే ఫస్ట్ సీఎం అయి ఉంటే… ?

రాజకీయాలలో కొన్ని ఊహాజనితమైన ఆలోచనలకు జవాబు ఏంటి అంటే ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకోవాల్సిందే. 1996 తరువాత ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే ప్రధాని అయి ఉండేవారు [more]

;

Update: 2021-08-29 02:00 GMT

రాజకీయాలలో కొన్ని ఊహాజనితమైన ఆలోచనలకు జవాబు ఏంటి అంటే ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకోవాల్సిందే. 1996 తరువాత ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే ప్రధాని అయి ఉండేవారు అంటారు. ఇక చంద్రబాబు టీడీపీలో చేరకపోయి ఉంటే అ పార్టీ కధ వేరుగా ఉండేదని అంటారు. చిరంజీవి 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెడితే సీఎం అయ్యేవారు అని చెప్పే వారూ ఉన్నారు. ఇక 2014 ఎన్నికలలో జనసేనాని పోటీ చేసి ఉంటే ఆయన రాజకీయ హోదా వేరేగా ఉండేది అన్న మాటా చెబుతూ ఉంటారు. కేసీఆర్ కి మంత్రి కుర్చీ ఇచ్చి ఉంటే తెలంగాణా రాష్ట్రం విడిపోదు అని నమ్మే వారూ ఉన్నారు. ఇపుడు అలాంటిదే మరో మాటను జగన్ కొలువులో డిప్యూటీ సీఎం అయిన ధర్మాన కృష్ణ దాస్ వదిలారు.

అంధ్రాలో అద్భుతమేనా …?

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. తెలంగాణా, ఆంధ్రాగా విడిపోయిన తరువాత అక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఏపీలో జగన్ రావాల్సిందే. కానీ చివరి మూడు వారాలలో సీన్ మొత్తం మారిపోయింది. దాంతో చంద్రబాబు పవర్ లోకి వచ్చారు. అదే జగన్ విభజన ఏపీకి తొలి సీఎం అయి ఉంటే కధ వేరుగా ఉండేది అని తాపీగా ధర్మాన కృష్ణ దాస్ అంటున్నారు. అయిదేళ్ల చంద్రబాబు తప్పులతడక పాలనలోని పాపాలన్నీ తాము రెండున్నరేళ్ళుగా మోస్తున్నామని కూడా ఆయన బాధగా చెబుతున్నారు. అంటే జగన్ మొదటి సీఎం అయి ఉంటే ఏపీకి చాలా మేళ్ళు జరిగేవి అన్నదిధర్మాన కృష్ణ దాస్ వారి భాష్యం.

అదెలాగ అంటే…?

జగన్ తొలి సీఎం అయితే ప్రత్యేక హోదాపై కప్పదాట్లు ఉండేవి కాదట, ఆయన కేంద్రం ముక్కు పిండి దాన్ని తెచ్చేవారట. చంద్రబాబు హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అన్న తరువాతనే ఏపీకి అతి పెద్ద హామీ దక్కకుండా పోయింది అన్నది వైసీపీ నేతల భావన. అలాగే పోలవరం విషయంలో కూడా బాబు లాలూచీ పడ్డారని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఇక విభజన హామీలు, ఏపీకి రెవిన్యూ లోటు ఇతర నిధుల విషయంలో కూడా తాము గట్టిగా నిలబడి సాధించేవారమని ధర్మాన కృష్ణ దాస్ అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం రాజధాని విషయంలో టీడీపీ బ్లండర్ మిస్టేక్ చేసింది అన్నది వైసీపీ ఆరోపణ.

ఒకటి అనలేకనే …?

నిజానికి జగన్ ఏపీలొ తొలి సీఎం అయితే మూడు రాజధానుల ఊసు ఉండేదా అన్న చర్చ కూడా వస్తోంది. ఆయన ప్రకాశం జిల్లాలోని దోనకొండ వద్ద రాజధానికి ప్లాన్ చేశారు అని చెబుతారు. ప్రకాశం జిల్లా అంటే ఉత్తర కోస్తాకు బహు దూరం. జగన్ అలా కనుక చేస్తే మరి బాబుకు రాయలసీమ వ్యతిరేకం అయినట్లుగా జగన్ కి ఈ ప్రాంతాలు దూరం అయ్యేవి. ఇక బాబు అమరావతి అన్నాక ఇపుడు జగన్ మూడు రాజధానులు అంటున్నారు. జగన్ తొలి సీఎం అయితే ఈ మూడు లేకుండా పోయేది అని చెబుతారు. ఏది ఏమైనా ఒక్క విషయం. జగన్ అనుకున్న పధకాలు అమలు చేసేవారు. అప్పులు నాడూ నేడూ సమానమే. కాకపోతే హోదాపై ఆశలను సజీవంగా ఉంచేవారు. రాజధాని విషయంలో బాబు మాదిరిగా ఆర్భాటాలకు పోకుండా దొనకొండలో తన అయిదేళ్ళ పాలనలో కట్టి చూపించేవారు. ఏది ఏమైనా జగన్ తొలి సీఎం అయితే బాబు కంటే భిన్నంగానే పాలన ఉండేది అన్నది తటస్థుల మాట కూడా. కానీ ఎవరేమీ చేయలేరు. ఇపుడు అంతా జరిగిపోయింది కాబట్టి గతాన్ని తలచుకుని వగచే కన్నా జగన్ కొత్త మార్గాలని వెతకడమే ముందున్న కర్తవ్యం కావాలి.

Tags:    

Similar News