కాపునాడు ఎంట్రీతో కధ … ?

రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి. చాలా లెక్కలు చూడాలి. అనేక సమీకరణలు కూడా బేరీజు వేసుకోవాలి. అలాంటిది ఏమీ కాకుండా చేసే డిమాండ్లకు అధినాయకులు తలొగ్గితే ఇక అధికారాలు, [more]

;

Update: 2021-09-02 02:00 GMT

రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి. చాలా లెక్కలు చూడాలి. అనేక సమీకరణలు కూడా బేరీజు వేసుకోవాలి. అలాంటిది ఏమీ కాకుండా చేసే డిమాండ్లకు అధినాయకులు తలొగ్గితే ఇక అధికారాలు, విచక్షణ ఎందుకు అన్న మాట కూడా వస్తుంది. విషయానికి వస్తే మరి కొద్ది నెలల్లో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. ఆయన అందరినీ తీసేసి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? లేక కొందరిని ఉంచి మార్పులు చేర్పులు చేస్తారా? అన్నది ఎవరికీ తెలియని విషయమే. కాకపోతే మంత్రి వర్గ విస్తరణ ఖాయం. దానితో ఏపీ రాజకీయాలు కొంతకాలంగా ఆ వైపుగానే చూస్తున్నాయి. చర్చ కూడా అలాగే సాగుతోంది.

డిమాండ్ చేస్తే …

ఇక సందట్లే సడేమియా అన్నట్లుగా కొన్ని సామాజిక సంస్థలు మధ్యలోకి వచ్చి తమ వారికి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే ఇపుడు ఆశ్చర్యకరంగా ఉంది. జగన్ ఎవరి మాట వినరు, అలాగని ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పు పట్టలేనివిగానే ఉంటాయి. ఆయన అన్నీ ఆలోచించి ఆచీ తూచే నిర్ణయం తీసుకుంటారు, ఒకసారి నిర్ణయం తీసుకున్నారా ఇక జగన్ని ఆపడం ఏవరి తరం కూడా కాదు, ఇది విషయం. మరి ఈ నేపధ్యంలో కాపునాడు నేతలు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ వారిని పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే జగన్ ఎలా రియాక్ట్ అవుతారు.

తెర వెనక ఎవరో ..?

విశాఖ జిల్లా నుంచి యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి మంత్రి పదవి ఇవ్వాలంటూ కాపునాడు నేతలు తాజాగా కోరారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం కూడా పెట్టారు. నిజానికి విశాఖ నుంచి మంత్రి రేసులో ఉన్న వారిలో గుడివాడ ముందు భాగానే ఉన్నారు. అటు జగన్ కి ఇటు విజయసాయిరెడ్డికి కూడా ఆయన అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. అదే టైమ్ లో విస్తరణ జరిగితే నూటికి తొంబై శాతం అవకాశాలు గుడివాడకే ఉన్నాయని చెబుతున్నారు. ఈ టైమ్ లో కాపునాడు పేరుతో వచ్చిన ఈ డిమాండ్ గుడివాడ అవకాశాలను పెంచుతుందా తగ్గిస్తుందా అన్నదే చర్చగా ఉంది మరి. అసలు ఈ కాపునాడు ప్రెస్ మీట్ వెనక ఎవరున్నారు అన్నది కూడా వైసీపీలో ఆలోచిస్తున్నారుట.

నష్టమే తప్ప ….

ఇలాంటి డిమాండ్లు ఏ చంద్రబాబు వద్దనో, మరే కాంగ్రెస్ ముఖ్యామంత్రి వద్దనో పనిచేస్తే చేస్తాయేమో కానీ జగన్ లాంటి వారి వద్ద అసలు కుదరవని వైసీపీలో అంటున్నారు. జగన్ మనసుకు నచ్చాలి. ఆయన మెచ్చాలి, అంతే తప్ప డిమాండ్లు పెట్టి నెగ్గించు కోవాలనుకుంటే అంతిమంగా వారే నష్టపోతారని కూడా అంటున్నారు. ఇక ప్రస్తుత విశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా కాపు సామాజిక వర్గానికే చెందిన వారు. అలాగే రేసులో ఉన్న చోడవరం సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా కాపు నేతగానే ఉన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. కానీ గుడివాడ మాత్రమే అర్హుడు అంటూ కాపునాడు నేతలు చెప్పడం వల్ల కోరి మరీ యువనేత అవకాశాలు తగ్గించేస్తున్నారు అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. రాజకీయల్లో వ్యూహాలు అవసరమే కానీ అవి నేలబారుడుగా ఉంటే బూమరాంగ్ కాక తప్పదు.

Tags:    

Similar News