జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తే… ?

జగన్ అప్పుడెపుడో నాలుగేళ్ళ క్రితం పాదయాత్ర చేశారు. అది సుదీర్ఘంగా పద్నాలుగు నెలల పాటు మూడు వేల ఏడువందల కిలోమీటర్ల దాకా సాగింది. దానికి తగిన ప్రతిఫలంగా [more]

;

Update: 2021-09-15 05:00 GMT

జగన్ అప్పుడెపుడో నాలుగేళ్ళ క్రితం పాదయాత్ర చేశారు. అది సుదీర్ఘంగా పద్నాలుగు నెలల పాటు మూడు వేల ఏడువందల కిలోమీటర్ల దాకా సాగింది. దానికి తగిన ప్రతిఫలంగా అధికారాన్ని కూడా తెచ్చింది. నాలుగేళ్ళు అంటే రాజకీయాల్లో చూసుకున్నపుడు ఎక్కువ సమయమే. పైగా జగన్ గత రెండున్నరేళ్ళుగా అధికారంలో ఉన్నారు. మరి ఇపుడు ఓసారి ఏపీలోని పదమూడు జిల్లాలలో జగన్ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది. జగన్ ఇపుడు ఏపీ రోడ్లను కొలిస్తే ఎలా ఉంటుంది. విపక్షాలు అదే డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ఇపుడు పాదయాత్ర చేయ్ అని సవాల్ చేస్తున్నాయి.

ఇంతకీ ఎందుకంటే ..?

ఏపీలోని రోడ్లు దారుణంగా ఉన్నాయి. అవి గుంతలు గోతులతో భయంకరంగా మారిపోయాయి. జగన్ వచ్చాక వైసీపీ పార్టీ వాడే కాబట్టి వరుణుడు కూడా అర్జంటుగా వచ్చేశాడు. ఏపీలో గత మూడేళ్ళుగా వానలు సీజన్ లో బాగానే కురిసాయి. దాంతో రైతులు ఆనందంగా ఉన్నారేమో కానీ రోడ్లు మాత్రం పూర్తిగా కొట్టుకుపోయి బీటలు వారిపోయాయి. ఈ రోడ్లకు చంద్రబాబు టైమ్ లో కొంత మరమ్మత్తులు జరిగాయి తప్ప పూర్తిగా ఆనాడూ ఏదీ జరగలేదు. ఇపుడు చూస్తే అవే రోడ్లు వరుణ ప్రతాపానికి కాల పరీక్షకు తట్టుకోలేక పూర్తిగా అద్వాన్నమయ్యాయి.

నడవగలరా…?

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక చెంచాడు సిమెంట్ కూడా వేసి రోడ్లను అభివృద్ధి చేయలేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వారు అన్నారని కాదు కానీ సగటు జనం లోనూ అదే బాధ, ఈ రోడ్ల మీద నుంచి ఎవరైనా నిండు గర్భిణీ ప్రయాణం చేస్తే ఆసుపత్రి అవసరం లేకుండానే ప్రసవం అవుతుంది అంటూ కామెంట్స్ కూడా పడుతున్నాయి. ఈ రోడ్ల దుస్థితి చూస్తున్న నెటిజన్లు వాటిని ఫోటోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవి ఒక విధంగా వైసీపీ పాలన గురించి అసలు నిజాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. మరి ఈ రోడ్ల మీద వేల కిలోమీటర్లు నడవగలరా జగన్ అంటూ విపక్షాలు చాలెంజ్ చేస్తున్నాయీ అంటే వైసీపీ ఫెయిల్యూర్ బట్టతల అంత చక్కంగా బయటకు కనిపిస్తున్నట్లే కదా.

తక్షణ కర్తవ్యం…

రోడ్లు అద్దాలుగా ఉండాలని ఎవరూ అత్యాశ‌ పడరు కానీ మరీ గోతులతో చిల్లులతో జనాలను ప్రాణాపాయంలోకి పడవేయాలని కూడా కోరుకోరు. అపుడెపుడో బీహార్ కి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక మాట అన్నారు. బీహార్ రోడ్లను బాలీవుడ్ నటీమణి హేమమాలిని బుగ్గల్లా నున్నగా అందంగా చేసి చూపిస్తాను అని. అలాంటి సౌందర్యం వద్దు కానీ కనీసం నడిపించు నా తోవా అన్నట్లుగానైనా ఉంటే చాలు అంటున్నారు ఏపీ జనం. ఇక ఏపీలో అభివృద్ధి లేదు అంటే సామాన్య జనానికి అర్ధం కాదు, ఆ గణాంకాలు లెక్కలు అన్నీ వారికి తెలియవు. కానీ కళ్ళ ముందు కనిపించే రోడ్లను చూసినపుడు మాత్రం వెంటనే మండిపడతారు. అవును నిజమే కదా అని విపక్షంతో ఏకీభవిస్తారు కూడా. ఈ గోతుల రోడ్ల మీద వెళ్లలేక ఈ రోజు జనం పడుతున్నారు. రేపటి రోజున జగన్ సర్కార్ ని ఈ గోతులు మింగేయకుండా ఉండాలంటే వాటిని అభివృద్ధి చేయడం ఏలిన వారి తక్షణ కర్తవ్యం కావాల్సిందే మరి.

Tags:    

Similar News