జగన్ కి జనం కి మధ్యలో… ?

భగవంతుడికీ భక్తుడికీ మధ్యలో పూజారి అయినా ఉంటాడు. ఆయన భక్తుల నివేదన ఆ దేవదేవునికి చేరుస్తాడు. కానీ జగన్ కి జనానికి మధ్యలో మాత్రం ఎవరూ లేరు, [more]

;

Update: 2021-09-16 12:30 GMT

భగవంతుడికీ భక్తుడికీ మధ్యలో పూజారి అయినా ఉంటాడు. ఆయన భక్తుల నివేదన ఆ దేవదేవునికి చేరుస్తాడు. కానీ జగన్ కి జనానికి మధ్యలో మాత్రం ఎవరూ లేరు, రారు కూడా. ఇది గొప్పగానే వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెబుతున్నారు. అంటే మంత్రులతో సహా ఏ సామంతుడూ కూడా జగన్ జనం మధ్యలో తలదూర్చేందుకు సాహసించడు అని గోపాలక్రిష్ణ సెలవిచ్చారన్న మాట. జగన్ ఇక్కడ మీట నొక్కితే అక్కడ లబ్దిదారుని ఖాతాలో డబ్బు పడిపోతుంది జగన్ ఇక్కడ ఒక ఆలోచన చేస్తే ఆ వెంటనే అది సామాన్యుడికి చేరిపోతుంది. ఇలా జగన్ జనం మధ్యలో ఎవరికీ దూరేందుకు సూది బెజ్జమంత స్థలం కూడా లేదు అంటున్నారు వైసీపీ భక్తులు.

మంచిదే కానీ..?

ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రి, పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. 150 మంది వరకూ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కానీ జగనే మొత్తం అంటున్నారు వైసీపీ నేతలు. ఇది ఒక విధంగా మంచిదే అయినా ప్రజాస్వామ్య స్పూర్తితో చూస్తే మాత్రం విరుద్ధమే అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో దశలు ఉంటాయి. ఎందరో మధ్యలో ఉంటారు, ఉండాలి కూడా. కానీ జగన్ అందరినీ కట్ చేసేశారు. తానూ జనమే అంటున్నారు. ఇది ఆయనకు మేలు చేస్తుందా కీడు తెస్తుందా అన్నది ఎన్నికల వేళ ఆలోచించుకోవాలి. కానీ ఇప్పటికైతే నడి మధ్యలో మంత్రిగా మారిన వేణుగోపాల క్రిష్ణ లాంటి వారికి బాగానే ఉంది. సీనియర్ మంత్రులే విలవిలలాడుతున్నారు.

మోజు ఉందా…?

మంత్రి పదవి అంటే కుర్చీ మాత్రమే కాదు, అధికార దర్పాన్ని చూపించే మంత్రదండమూ చేతికి అందాలి. అది లేని పదవి వట్టి ఉత్సవ విగ్రహమే. జగన్ ఇచ్చే మంత్రి పదవుల కోసం చాలా మంది కాచుకుని కూర్చున్నారు అని ఒక వైపు వార్తలు వస్తూంటే మరో వైపు ఎందుకొచ్చిన మినిస్టర్ పోస్ట్ అన్న వైరాగ్యంలో కూడా నేతాశ్రీలు ఉన్నారట‌. పేరుకు ముందు మంత్రి అన్నది తప్ప తమకు ఏమైనా అధికారాలు ఉంటాయా ఏంటి అన్న నిరాశతో కూడా చాలా మంది పెద్దలు ఉన్నారట. జగనే సమీక్షలు చేస్తూ ఆయనే ఆల్ ఇన్ వన్ గా ఉంటూ వస్తున్న ఏలుబడిలో మంత్రులకు ఎక్కడ చాన్స్ ఉందన్న మాట ఉంది. దాంతో మంత్రి పదవి మీద మోజు కూడా కొందరికి తగ్గిందని చెబుతున్నారు.

ఠికాణా ఉందా …?

మంత్రి పదవి ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో టికెట్ కి ఠికాణా ఉంటుందా అంటే అదేమీ లేదు అనే బదులు వస్తోంది. అలాంటపుడు ఆ పదవిని పట్టుకుని మరో రెండున్నరేళ్ళ పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలను బహుమానంగా పొందే కంటే గమ్ముంటే సరిపోలా అన్నది కూడా వారి మాటగానే చెబుతున్నారు. ఇక రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవులు భర్తీ చేయాలి కాబట్టి చేస్తున్నారు కానీ జగన్ మాత్రమే ఏకైక్ డెసిషన్ మేకర్ అయినపుడు మంత్రుల పేర్లు మారుతాయి తప్ప జాతకాలు మారవని కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్, జనానికి మధ్యలో ఎవరు లేరు అన్న దాని మీద వైసీపీలోనే విమర్శలూ ఉన్నాయి. మరి చూడాలి జనంలో దీని రియాక్షన్ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News