Ys jagan : దూరం మరింత పెరిగినట్లేనా?

వైఎస్ జగన్ రాజకీయంగా రాటు దేలుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో మరోసారి గెలిచేందుకు జగన్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీని దూరం పెట్టాలని భావిస్తున్నట్లుంది. [more]

;

Update: 2021-09-26 03:30 GMT

వైఎస్ జగన్ రాజకీయంగా రాటు దేలుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో మరోసారి గెలిచేందుకు జగన్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీని దూరం పెట్టాలని భావిస్తున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ సయోధ్యతోనే వెళుతున్నారు. తన తొలి ఢిల్లీ పర్యటనలోనే జగన్ కుండ బద్దలు కొట్టారు. అత్యధిక స్థానాలతో గెలిచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బతిమాలి ప్రయోజనాలను సాధించుకోవాల్సిందేనని.

రెండున్నరేళ్లుగా….

గడచిన రెండున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోదీ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. రెండు సభల్లో ఏ బిల్లు పెట్టినా సమర్థిస్తూ వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అండగా నిలిచింది. బీజేపీకి నమ్మకమైన మిత్రులందరూ వదిలించుకుని వెళ్లిపోయిన తర్వాత జగన్ ఒక్కరే మిత్రుడిగా మిగిలారు. బీజేపీ పెద్దలు కూడా జగన్ ను నమ్మితేనే బెటరని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కొద్దిరోజులుగా…..

కానీ జగన్ గత కొద్ది రోజులుగా కేంద్రంతో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీపై అసంతృప్తి పెరిగింది. దీనికి తోడు పెట్రో ఉత్పత్తి ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరిస్తుండటంతో రాష్ట్రంలో అసహనం పెరుగుతుంది. దానిని అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రజలు కూడా నమ్మే ఛాన్స్ ఉంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ తలనొప్పిగా తయారైంది. టీటీడీ బోర్డు నియామకం నుంచి మత విషయాల్లో తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుండటం జగన్ కు చికాకు తెప్పిస్తుంది. తాను మద్దతివ్వడాన్ని బలహీనతగా బీజేపీ భావిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

గుడ్డిగా మద్దతివ్వకూడదని….

అందుకే జగన్ కేంద్ర ప్రభుత్వంతో దూరం పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గుడ్డిగా ఇక మద్దతు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారని తెలిసింది. ఇటీవల హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి కూడా జగన్ దూరంగా ఉండటానికి అదే కారణమంటున్నారు. ఇక భారత్ బంద్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం మోదీకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడం ఈ కోణంలో చూడాల్సిందే. మొత్తం మీద జగన్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవడంతో రాజకీయ ప్రయోజనాలను ఆశించే బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.

Tags:    

Similar News