Ys jagan : ఓటు మారదు.. సీటు ఛేంజ్ కాదు.. రీజన్ ఇదేనట

ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎక్కడైనా సహజం. అధికారంలో ఉన్న పార్టీలో లోపాలు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పును జనం కోరుకుంటారు. ఇందుకు ఏ రాష్ట్రమూ అతీతం కాదు. [more]

Update: 2021-10-18 08:00 GMT

ప్రజలు మార్పు కోరుకుంటారు. ఎక్కడైనా సహజం. అధికారంలో ఉన్న పార్టీలో లోపాలు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పును జనం కోరుకుంటారు. ఇందుకు ఏ రాష్ట్రమూ అతీతం కాదు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మార్పు అనవసరమనుకున్నారు. ఏపీ రాజకీయాలలో ఇదే ప్రధాన నినాదంగా మారింది. విపక్షాలు ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాయి. కానీ జగన్ పార్టీ మాత్రం తమకు ఈసారి కూడా విజయానికి ఢోకా లేదని చెబుతున్నారు.

బలహీనం చేసి….

జగన్ తాను అనుకున్నట్లుగానే విపక్షాన్ని బలహీనం చేశారు. తెలంగాణలో విపక్షాన్ని బలహీనం చేయబట్టే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగలిగారు. ప్రత్యామ్నాయ నేత కనపడక పోవడంతో తెలంగాణ ప్రజలకు మళ్లీ కేసీఆర్ తప్ప వేరెవరూ కన్పించలేదు. అందుకే ఆయనను మరోసారి గెలిపించారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. టీడీపీ బాగా బలహీనమయింది. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదు.

నమ్మకం లేక…

ఇక పవన్ కల్యాణ్ కిందా మీదా పడినా, పొర్లు దండాలు పెట్టినా పెద్దగా పొడిచేదేమీ లేదు. జనం అసలు ఆయనను నేతగా అంగీకరించడం లేదు. కేవలం నటుడిగానే చూస్తున్నారు. ఇక కాంగ్రెస్, కమ్యునిస్టులు, బీజేపీ పార్టీల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొడాలి నాని వంటి వారు జగన్ మళ్లీ సీఎం అని పదే పదే చెబుతున్నారు. మళ్లీ గెలవకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసురుతున్నారు.

సంక్షేమ పథకాలు….

ఇక వైసీపీ నేతలు తమను సంక్షేమమే గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు. కరోనా కష్టకాలంలోనూ దాదాపు మూడు లక్షల కుటుంబాలను జగన్ ఆదుకున్నారు. వివిధ పథకాల ద్వారా వారికి నగదు బదిలీని చేశారు. దీంతో జగన్ పై నమ్మకం పెరిగింది. జగన్ అధికారంలోకి రాకపోతే ఏటా తమకు వివిధ పథకాల రూపంలో వచ్చే దాదాపు లక్ష రూపాయలు రాకుండా పోతాయని భావిస్తారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా సంక్షేమ పథకాలతోనే వరస విజయాలను సాధిస్తున్నారన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎటు చూసుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News