Ys jagan : అలెర్ట్ జగన్… ఇదీ గ్రౌండ్ లెవెల్ లో సీన్

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని సమాధానం చెబుతాం….. కానీ కాస్త లోతుగా ఆలోచించి చూస్తే ప్రాంతీయ పార్టీలలో అధికారంలో ఉండేది పార్టీలు [more]

;

Update: 2021-10-14 05:00 GMT

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని సమాధానం చెబుతాం….. కానీ కాస్త లోతుగా ఆలోచించి చూస్తే ప్రాంతీయ పార్టీలలో అధికారంలో ఉండేది పార్టీలు అనడం కంటే కులాలని చెప్పొచ్చు. కమ్మ ప్రభుత్వం పోయి రెడ్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. కనీవినీ ఎరుగని స్థాయిలో వైసీపీకి ప్రజలు ఎమ్మెల్యే స్థానాలను కట్టబెట్టారు. ఇంతటి తీవ్ర వ్యతిరేకత చంద్రబాబు ఎందుకు మూటగట్టుకోవాల్సి వచ్చింది అంటే కులాన్ని తప్ప మరొకటి పట్టించుకోకపోవడం., కులానికి తప్ప మరొకరికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం…, రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లలో పాలనను కులం కంపు కొట్టించడం వల్ల ప్రజలకు కడుపు మండటం వల్ల చంద్రబాబు 23 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.

గత పాలనకు భిన్నంగా…?

చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్‌ రెడ్డి గత పాలనకు భిన్నంగా సాగుతున్నారా అంటే ఎవరైనా నొసలు ముడుస్తారు. సంక్షేమ పథకాల అమలులో “కులం చూడం., మతం చూడం., ప్రాంతం., పార్టీలు అసలే చూడమనే” మాటల్లో చిత్తశుద్ది అటుంచితే రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనే సందేహం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చగా మారింది. ఏ కులాధిపత్యాన్ని చూసి చంద్రబాబు అండ్‌ కోకు జనం ఛీ కొట్టారో తిరిగి అదే పరిస్థితిలోకి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సాగుతోంది. సోషల్‌ మీడియా భజనలు., డిజిటల్ ప్రమోషన్లతో ఊదరగొట్టే వాళ్లకు క్షేత్ర స్థాయిలో జనంలో తిరిగే అలవాటు ఏ మాత్రం ఉండదు. తమ నాయకుడికి భజన చేయడం ద్వారా లబ్ది పొందడమో., కుల పరమైన కారణాలో వీరికి ఉంటాయి. ఇలా ప్రచారం చేసే డిజిటల్‌ ఆర్మీలు కమ్మ నాయకుడు చంద్రబాబుకు, రెడ్ల అధిపతి జగన్మోహన్‌ రెడ్డికి సమానంగా ఉన్నారు. వీళ్ల వల్ల ఎన్నికల్లో జనం ఎలా మొగ్గు చూపుతారనేది వేరే విషయం.

తొలిసారి రెడ్లు…

కమ్మ సామాజిక వర్గం మీద జనంలో పేరుకుపోయిన ఏహ్యభావనకు ప్రాధాన కారణం ఆధిపత్య ధోరణి., కుల దురహంకారం., తాము తప్ప మరొకరినికి ఎదగనివ్వకూడదనే దుష్టత్వం ప్రధాన కారణాలు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటం., 16నెలల జైలు జీవితం., కాంగ్రెస్‌ అధ్యక్షురాలిని ధిక్కరించినందుకు కష్టనష్టాలు భరించారనే సానుభూతి వైఎస్సార్‌ వారసుడికి అధికారాన్ని కట్టబెట్టాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది మాత్రం వేరు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది మొదలు., ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే వరకు దాదాపు 70ఏళ్లలో రెడ్డి సామాజిక వర్గం అటు పార్టీలోను., ఇటు ప్రభుత్వంలోను పూర్తి స్థాయి అధికారాన్ని తొలిసారి అనుభవిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో., పాలనలో రెడ్లకు గుర్తింపు., రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నా ఢిల్లీ హైకమాండ్‌దే తుది నిర్ణయం అయ్యేది. ఇప్పుడు వైసీపీకి అలాంటి అవసరం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి “రెడ్లు” అధికారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారు. అందుకే ముఖ‌్యమంత్రి చుట్టూ రెడ్లు దడి కట్టినా ఆయనకు అదేమి పెద్ద తప్పేం అనిపించడం లేదు.

భిన్నమైన పాలన అందిస్తారనే….

జగన్మోహన్‌ రెడ్డిని రెడ్ల నాయకుడిగా భావించి జనం అధికారాన్ని అప్పగించలేదు. చంద్రబాబుకు భిన్నమైన పాలన అందిస్తాడనే నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఆయన మాత్రం నవరత్నాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగుల మీద పెట్టడం మానేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయలు., ఆంగ్ల మాద్యమంలో బోధన., ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు వంటి పథకాలు తప్ప మిగిలిన పథకాలతో జనానికి ఎన్నికల్లో ఓట్ల తాయిలాలే అనే ఆలోచన జనంలో మొదలైంది. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు., మౌలిక సదుపాయాల కల్పన., ఉపాధి రంగాలను పూర్తిగా విస్మరించారు. రాష్ట్రంలో ఉద్యోగులు మొదలుకుని పెన్షనర్ల వరకు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం పడుతోంది. ఇవన్నీ ఇద్దరు ముగ్గురు కలిసిన చోట చర్చకు వస్తున్నాయి. కొత్తగా ఉపాధి కల్పన., ఉద్యోగ నియమకాల ఊసే లేదు.

క్రైస్తవులు కూడా…

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమో., వైసీపీ ప్రభుత్వమో అనే సందేహం జనాన్ని వెంటాడుతుంది. బీజేపీకి ఆగ్రహం కలుగుతుందనే భయం వల్లో., క్రిస్టియన్‌ ముద్రను వదిలించుకోడానికో జగన్మోహన్‌ రెడ్డి చేసే పనులు దళితులు., దళిత క్రైస్తవుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతున్నాయి. క్రిస్టియన్‌ ముద్రతో అయా వర్గాలను మోసం చేస్తూ., బీజేపీ ఎజెండా అమలు చేసే బాధ్యతలు జగన్ స్వీకరించారనే ప్రచారం జరుగుతుంది. సాధారణంగా హిందూ ఆలయాల్లో మాదిరి చర్చిలు., మసీదుల్లో ప్రార్ధనలు ఉండవు. తమకు ఎదురవుతున్న కష్టాలను భగవంతుడికి చెప్పుకోవడమే పరిష్కారంగా వారి ప్రార్ధనలు ఉంటాయి. అందులో రాజకీయ ప్రస్తావనలు., పార్టీల ధోరణలు అన్నింటిపై చర్చ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అగ్రకులాల వారికి మొదటి వరుసలో సీట్లు రిజర్వు చేసి ఉంటాయి. కులాధిపత్యం అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధోరణి అధికంగా ఉంటుంది. దళిత వాడల్లోనే ప్రత్యేక ప్రార్థనల ద్వారా మత బోధకులు తమ సమాజం ఎదుర్కొనే కష్టాలను దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న క్రైస్తవ వ్యతిరేక అజెండాపై చాలా ప్రాంతాల్లో బహిరంగ ప్రార్ధనలు జరుగుతున్నాయి.

దర్శనమే మహా భాగ్యంలా….

ముఖ‌్యమంత్రి జగన్ కి మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండని అడిగితే జనం బ్రహ్మాండమైన విజయాన్ని కట్టబెట్టారు. అందుకు ప్రతిగా ఆయన జనం మనసులు గెలిచే ప్రయత్నాలు చేయలేకపోయారు. ఆయన దర్శనమే మహా భాగ్యం అనే పరిస్థితి కల్పించారు. ఆయనతో నేరుగా మాట్లాడుకునే అవకాశాన్ని మంత్రులు., ఉద్యోగ సంఘాలకే లేకుండా చేశారు. కొన్ని శాఖల్లో మంత్రులు ఉన్నా లేనట్టే, దళిత మంత్రులు తామెందుకు ఉన్నామో తమకే తెలియదనే దైన్యం. తమకు వ్యతిరేకం అనే సాకుతో మీడియాను దూరం పెట్టారు. ప్రెస్‌ మీట్లు పెట్టరు, జనం సందేహాలను నివృత్తి చేయరు. మీడియాను ధైర్యంగా ఎదుర్కోలేరు. వందల్లో సలహాదారులు ఉన్నా ఆయన ఎవరి మాట వింటారో తెలీదు. చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఆయనకు తెలుస్తాయో., తెలీదో అంతుచిక్కదు. ప్రజల్లో ఆయన స్థానం ఏమిటో తెలీదు. సంక్షేమం., డబ్బు పంపిణీ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే నమ్మకం తప్ప మరొకటి కనిపించదు. ఎంత కష్టపడినా., రోజుకు 18 గంటలు పనిచేసినా జనం ఎందుకు నమ్మలేదని చంద్రబాబు వాపోయినట్టు., బాధపడే పరిస్థితి వస్తే….., ఆల్‌ ఈజ్‌ వెల్ అనుకోవడమే.

 

– సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ

Tags:    

Similar News