Ys jagan : మూడో వ్యక్తి వస్తే ఇద్దరికీ ముప్పు తప్పదా?

ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇద్దరిలో ఎవరికీ ఎవరు తక్కువ కాదు అనిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అమరావతి పేరు చెప్పి [more]

Update: 2021-11-09 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇద్దరిలో ఎవరికీ ఎవరు తక్కువ కాదు అనిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అమరావతి పేరు చెప్పి అబద్ధాలతో ఐదేళ్లు కాలం గడిపేశారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి తాయిలాలు ఇచ్చినా ఫలం దక్కలేదు. ఇక జగన్ కూడా ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లవుతున్నా సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు డబ్బులు పంచి పెట్టడమే తప్ప అభివృద్ధిని పక్కన పెట్టేశారు. అన్ని వర్గాల్లో క్రమంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమయింది.

ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారా?

ఇద్దరు నేతల పోకడలను చూసిన ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారనే అనుకోవాలి. అయితే అది పవన్ కల్యాణ్ రూపంలో మాత్రం కాదు. మరో రూపంలో ఏదైనా బలమైన ప్రత్యామ్నాయం వస్తే ఏపీలో ప్రజలు ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపే అవకాశముంది. జగన్, చంద్రబాబు…ఈ ఇద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ అభివృద్ధి జరగదనేది వాస్తవం. ఇద్దరూ పరమ శత్రువులుగానే చూసుకుంటే రాజకీయ అణిచివేతలకే ప్రాధాన్యత ఇస్తారు.

బాబు హయాంలో….

చంద్రబాబు ఏమీ శుద్ధపూస కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను ప్రతిపక్షంగా గుర్తించలేదు. అసెంబ్లీలో సయితం వైసీపీ నేతల నోళ్లు నొక్కేశారు. అఖిలపక్ష సమావేశం అనేది బీజేపీతో కలసి ఉన్నంతకాలం జరపలేదు. 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని జగన్ ను బలహీనం చేయాలనే చూశారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు చేసింది ఏమైనా ఉందా? అంటే జగన్ బలపడకూడదనే. వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా, నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిలకు బాధ్యతలను అప్పగించారు.

జగన్ కూడా….

ఇక ఇప్పుడు జగన్ కూడా అంతే. చంద్రబాబును అసలు ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదు. టీడీపీని లేకుండా చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. టీడీపీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. న్యాయస్థానాల ద్వారా టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపణలు చేస్తున్న వైసీపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కేసులు గుర్తు లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ అభివృద్ధికంటే టీడీపీని అణగదొక్కడంపైనే ఫోకస్ పెట్టారు. సో.. ఇద్దరిలో ఎవరిపైనా జాలి పడాల్సిన, సానుభూతి కురిపించాల్సిన అవసరం లేదు. దీంతో ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. మరి బలమైన మూడో ప్రత్యామ్నాయం వచ్చే వరకూ ఏపీకి పట్టిన గ్రహణం వీడదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News