Ys jagan : ఆపాటి ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారో?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ నైజాన్ని ఎండగట్టారు. దేశంలో పెట్రోలు ఉత్పత్తుల ధరలపై కేంద్రం ఇప్పటి వరకూ ఆడిన డ్రామాలను మీడియా సమాశంలో కడిగి పారేశారు. [more]

Update: 2021-11-08 05:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ నైజాన్ని ఎండగట్టారు. దేశంలో పెట్రోలు ఉత్పత్తుల ధరలపై కేంద్రం ఇప్పటి వరకూ ఆడిన డ్రామాలను మీడియా సమాశంలో కడిగి పారేశారు. పెట్రోలు ఉత్తత్తుల ధరలను పెంచడంపై ఉన్న లోగుట్టును విప్పి చూపారు. సామాన్యుడు నుంచి ధనికుడు వరకూ పెట్రోలు బాధితుడే. దీనిని ఏ విధంగా గత ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందీ కేసీఆర్ చెప్పకనే చెప్పారు. కానీ జగన్ ఆ పని చేయలేకపోయారు. జగన్ కు మీడియా సమావేశం పెట్టే ఓపిక లేదా? అంత సమయం లేదా? అన్న ప్రశ్న ఏపీ ప్రజల్లో సహజంగానే తలెత్తుతుంది.

ఒకటి రెండు సార్లు…

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి అదీ కరోనా సమయంలో మీడియా సమావేశం పెట్టారు. గత రెండున్నరేళ్లుగా ఆయన మీడియా ముందుకు రాలేదు. బీజేపీ, టీడీపీ పెట్రోలు ధరల పెంపుపై తన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా జగన్ మౌనాన్నే పాటిస్తున్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన అది ఎంతమందికి చేరుతుందన్నది ప్రశ్న. అలా కాకుండా కేసీఆర్ తరహలో మీడియా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎందుకు ఎండగట్ట లేకపోతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

బీజేపీతో కలవడం….

బీజేపీతో జగన్ ఎప్పటికీ మిత్రత్వాన్ని నెరపలేరు. పరోక్షంగా మద్దతివ్వడం తప్ప నేరుగా సంబంధాలు పెట్టుకోరు. అలాగే బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకు పరంగా చూసినా, దానితో పొత్తును కోరుకోరు. బీజేపీతో సఖ్యత అంటే కొరివితో తల గోక్కున్నట్లేనన్న సామెత రాజకీయ వర్గాల్లో నానుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎండగట్టాల్సిన సమయంలోనూ జగన్ మౌనంగా ఉండటం పార్టీ నేతలకు కూడా నచ్చడం లేదు.

అనేక అంశాలపై…?

ఒక్క పెట్రోలు ధరలు మాత్రమే కాదు. జనానికి అనేక తన పైన, తన ప్రభుత్వంపైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి జగన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మద్యం బ్రాండ్లు, డ్రగ్స్, ఇసుక వంటి వాటితో పాటు జగన్ పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై తన పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన ప్రజలకు ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంది. కానీ జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసైనా నేర్చుకోవాలన్న సూచనలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News