ఎందుకంత ట్రోల్ అవుతున్నారు?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే భావిస్తున్నట్లుంది. హైదరాబాద్ లో ఏ చిన్న అవకాశమొచ్చినా అంతా తానుచేసిందే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. [more]

;

Update: 2020-12-05 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే భావిస్తున్నట్లుంది. హైదరాబాద్ లో ఏ చిన్న అవకాశమొచ్చినా అంతా తానుచేసిందే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ ను తానే నిర్మించానంటారు. తన వల్లనే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందని చెబుతారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వస్తున్నాయంటే అంటే అది అంతా తన పుణ్యమేనని చెప్పుకొస్తారు. 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు.

హైదరాబాద్ ను తానే…..

కానీ ప్రజలు ఏమాత్రం దానిని పట్టించుకోలేదు. నిజమే చంద్రబాబు ముందుచూపుతోనే పరిశ్రమలు, ఐటీ వంటివి వచ్చాయి. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ పదే పదే తాను చెప్పుకోవడం చంద్రబాబు మానసిక స్థితిని తెలియజేస్తుందంటున్నారు. గతం వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్లు అమరావతిని చేస్తానని చెప్పినా గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును విశ్వసించలేదు.

అంతా తనవల్లనే…..

ఇక తాజాగా జీనోమ్ వ్యాలీని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించినప్పుడు కూడా ఆయన ఏమాత్రం దాచుకోలేదు. తన ప్రభుత్వం వల్లనే జినోమ్ వ్యాలీ వచ్చిందని చెప్పారు. అంతేకాదు దానిని సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తన వల్లనే నేడు కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ లో వస్తుందని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఏ విషయం వచ్చినా తన వల్లనే సాధ్యమయిందని చెప్పడం చంద్రబాబుకు ఎబ్బెట్టుగా మారింది.

సోషల్ మీడియాలో…..

సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పడుతున్నాయి. కంప్యూటర్ ను కనిపెట్టింది కూడా తానేనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఎవరినీ ఏమీ పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతున్నారు. అయితే ఆయన చేసే ప్రతి వ్యాఖ్య తెలంగాణ కోసం కాదు. రానున్న కాలంలో ఏపీ ప్రజలు తన నాయకత్వాన్ని విశ్వసిస్తారనే. అందుకోసమే ఆయన ఏ ప్రయత్నాన్ని వదులుకోవడం లేదు. మొత్తం మీద చంద్రబాబు తాను లేకుంటే హైదరాబాద్ లేదనే విధంగా వ్యాఖ్యానించడంపై సెటైర్లు మాత్రం విపరీతంగా పడుతున్నాయి.

Tags:    

Similar News