తెలుసుకోకుంటే…బాబు బాటే…!!

గెలుపు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కాని అతివిశ్వాసానికి పోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అతి విశ్వాసం స్పష్టంగా కన్పిస్తుంది. ఇటీవల జరిగిన [more]

;

Update: 2019-07-11 11:00 GMT

గెలుపు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కాని అతివిశ్వాసానికి పోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అతి విశ్వాసం స్పష్టంగా కన్పిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని అప్పగించారు ఏపీ ప్రజలు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు యాభై శాతం ఓటింగ్ శాతాన్ని జగన్ పార్టీ సాధించుకుంది. ఐదేళ్ల పాటు రాజ్యమేలిన చంద్రబాబునాయుడు పార్టీకి సయితం దాదాపు నలభై శాతం ఓట్లు లభించడం విశేషం.

దూకుడుగా వెళుతున్నా…..

అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత దూకుడుగా వెళుతున్నారు. యువకుడు కావడంతో ఆ మాత్రం దూకుడు అవసరమే. తాను చేసిన పాదయాత్ర, తన వల్లనే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారన్న అతివిశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు కన్పిస్తోంది. మంత్రి వర్గ విస్తరణలోనూ సీనియర్లు కాదని జూనియర్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఇందుకు సంకేతమంటున్నారు. అనుభవజ్ఞులను పక్కన పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి కొంత ఉపయోగకరంగా ఉండేదన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి.

సీనియర్లను పక్కన పెట్టి…..

అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన కొద్దిరోజుల నుంచే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వెలికి తీసే పనిలో పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో అభ్యంతరం చెప్పటానికి ఏమీ లేకున్నా…. కేవలం ప్రత్యర్థిపార్టీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నది మాత్రం సుస్పష్టం. ప్రజావేదిక కూల్చి వేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారన్నది పార్టీ వర్గాలు సయితం అంగీకరిస్తున్న విషయం. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వేదికను కూల్చే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ల సలహాలను కూడా తీసుకోక పోవడంతో జగన్ వేసిన తొలి అడుగు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపింది.

ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా….

ఏపీలో ప్రజావేదిక కూల్చకుండా ఉండాల్సిందన్నది మెజారిటీ అభిప్రాయంగా విన్పిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర వల్ల గెలిచి ఉండవచ్చు. కానీ ఇంత మెజారిటీ రావడానికా కారణం కేవలం జగన్ ఒక్కరి వల్లనే కాదన్నది తెలుసుకోవాలి. అధికార పార్టీ చేసిన తప్పిదాలు, చంద్రబాబునాయుడు తీసుకున్న యూటర్న్ లు కూడా జగన్ కు ఇంత మెజారిటీ తెచ్చి పెట్టాయని గ్రహించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సయితం ఇదే చర్చ నడుస్తుంది. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే జగన్ కూడా చంద్రబాబు బాట పట్టాల్సి వస్తుంది

Tags:    

Similar News