8 కోట్లు ఇచ్చింది.. ఆ ఇద్దరేనా?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడబోతోంది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణమైన ఆ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఎవరనేది ఇప్పడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయ [more]

;

Update: 2021-07-24 03:30 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడబోతోంది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణమైన ఆ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఎవరనేది ఇప్పడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయ నేతలా? లేక వ్యాపార భాగస్వామ్యులా? అన్నది సీబీఐ విచారణలో తేలాల్సి ఉంది. అయితే అనుమానాలు మాత్రం రాజకీయ నేతల మీదకే మళ్లుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని చంపడానికి కారణాలు కూడా ఈ ఇద్దరు దొరికితేనే బయటపడతాయి.

రెండేళ్లు దాటుతున్నా…

వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. తొలుత బాత్రూంలో జారిపడ్డారని భావించినా, ఆయన శరీరంపై 11 చోట్ల కత్తిపోట్లు ఉండటంతో హత్యగా నిర్ధారణ అయింది. అప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయాన్ని బాత్ రూం నుంచి బయటకు తరలించారు. దీంతో సాక్షాధారాలు చెరిపేశారన్న ఆరోపణులు కూడా వచ్చాయి. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను నియమించింది.

8 కోట్లు సుపారీ….

తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా సిట్ ను నియమించింది. అయితే రెండు సంస్థలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏమీ తేల్చకపోవడంతో ఆయన కూతురు సునీత కోర్టును ఆశ్రయించింది. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దాదాపు ఏడాది కాలంగా సీబీఐ అధికారులు వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు. వందల సంఖ్యలో సాక్షులను విచారించారు. కానీ వైఎస్ వివేకాను హత్య చేసేందుకు 8 కోట్ల సుపారీ ఇచ్చారని తేలడంతో నిర్ఘాంత పోయారు. ఇంత పెద్దమొత్తంలో సుపారీ ఇచ్చారంటే రాజకీయ నేతలే అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ నేతలేనా?

రాజకీయ నేతలకు సంబంధించి కూడా వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టీడీపీలో ఉన్న నేతలతో పాటు అధికార పార్టీ నేతలపేర్లు కూడా ఆరోపణలుగా విన్పించాయి. సీబీఐ అధికారులు వీరిని కూడా విచారించారు. అయితే తాజాగా ఇద్దరి ప్రమేయంతో తొమ్మిది మంది ఈ హత్యకు పాల్పడినట్లు సీబీఐ విచారణలో వెల్లడయింది. ఆ ఇద్దరు ఎవరన్న చర్చ జరుగుతోంది. వైఎస్ వివేకానందరెడ్డికి బెంగుళూరులో కూడా వ్యాపారాలున్నాయి. వ్యాపార లావాదేవీల్లో తేడా వచ్చి వారెవరైనా ఈ హత్యకు కుట్రపన్నారా? అన్న కోణంలో కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుంది. మొత్తం మీద ఆ ఇద్దరు ఎవరో తేలితే కాని వైఎస్ వివేకాహత్యకు కారణాలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.

Tags:    

Similar News