కోరకుండానే వచ్చిపడ్డాయి… సత్తా తేలుతుందా?

కోరకుండానే వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల భారాన్ని జగన్ పూర్తిగా మంత్రుల మీదనే పెట్టేశారు. గత రెండేళ్ళుగా పార్టీ కార్యకలాపాలు కూడా పెద్దగా లేని వైసీపీ ఇపుడు [more]

;

Update: 2021-02-15 11:00 GMT

కోరకుండానే వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల భారాన్ని జగన్ పూర్తిగా మంత్రుల మీదనే పెట్టేశారు. గత రెండేళ్ళుగా పార్టీ కార్యకలాపాలు కూడా పెద్దగా లేని వైసీపీ ఇపుడు చేతిలో ఉన్న అధికారం మీదనే గట్టిగా ఆధారపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులే పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవాలి. అసలు పార్టీ ఏ దశలో ఉంది. దానికి ఉన్న కార్యవర్గాలు ఏంటి అన్నది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మరచిపోయారు. పార్టీ పడకేసిన చోట ప్రభుత్వమే అంతటా కనిపిస్తోంది. ఇక క్యాడర్ ఎలా ఉందో, ఏమనుకుంటుంటో అయిపూ అజా లేదు. కానీ ఇపుడు అర్జంటుగా వారితో పని వచ్చి పడింది.

వారే బాధ్యులుగా…?

రాష్ట్రంలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వారే ఇపుడు పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను గిర్రున తిప్పాలి. ఒక విధంగా వారి పనితనానికి ఇది మచ్చుతునకగా మారనుంది. ఇరవై నెలల జగన్ పాలన మీద జనాలు ఇచ్చే తీర్పు కచ్చితంగా రాబోయే అన్ని ఎన్నికల మీద పెను ప్రభావం చూపనుంది. కాబట్టి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకుని పంచాయతీ సమరంలోకి దూకాల్సిందేనని హై కమాండ్ నుంచి హుకుం జారీ అయింది. అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా పార్టీ విజయం కోసం పని చేయాల్సిందే అంటూ అదేశాలు వెళ్లాయి.

త్రిమూర్తులు యమ బిజీ …..

ఇక పదమూడు జిల్లాల రాష్ట్రాన్ని జగన్ మూడు భాగాలుగా చేసి ముగ్గురు కీలకమైన నేతలను అప్పగించారు. ఉత్తరాంధ్రాకు విజయసాయిరెడ్డి, గోదావరి జిల్లాలు ఉత్తర కోస్తా జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు, ప్రకాశం సహా రాయల‌సీమ జిల్లాలకు సజ్జల రామక్రిష్ణారెడ్డి పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ఏ నాయకుడు అయినా మంత్రి అయినా వారికే వచ్చి సమస్యలు చెప్పుకోవడం ఇప్పటిదాకా జరిగిన కధ. దాంతో మొత్తం వ్యవహారాన్ని కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన కర్తవ్యం త్రిమూర్తుల మీదనే ఉంది. జగన్ మొత్తం పంచాయతీ వ్యవహారాలు ఇలా అందరికీ అలా పంచేశారు అని వినిపిస్తున్న టాక్.

ప్లీనరీ కంటే ముందు….

నిజానికి పార్టీ పడకేసిందని, 2017 నాటి కార్యవర్గాలే పార్టీకి ఇప్పటికీ ఉన్నాయన్న సంగతి వైసీపీ పెద్దలకు తెలియనిది కాదు, దాని కోసమే 2021లో పార్టీ ప్లీనరీని నిర్వహించి కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఆ తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని కూడా వైసీపీ పెద్దలు ఆలోచన చేశారు. కానీ ఇపుడు అనూహ్యంగా పంచాయతీ ఎన్నికలు తోసుకు వచ్చాయి. దాంతో పార్టీ ఏ స్థితిలో ఉందో కూడా ఎవరికీ తెలియదు. ఇపుడు మంత్రులే మొత్తం భారం మోయాల్సిన సీన్ ఉంది. మరి చూడాలి వారు జగన్ కోరినట్లుగా నూటికి తొంబై శాతం సీట్లు గెలిపించి తెస్తారో లేదో.

Tags:    

Similar News