జగన్ అంటే ఆ భయం పోయినట్లేనా?

పైకి క‌నిపించ‌క‌పోయినా.. ప‌దే ప‌దే చెప్పుకోక పోయినా..వైసీపీలో క్రమ‌శిక్షణ మామూలుగా ఉండ‌దు. పార్టీ అధినేత జ‌గ‌న్ అంటే.. అమ్మో.. అనే నాయ‌కులే అంద‌రూ. ఆయ‌న ద‌గ్గర దోబూచులు.. [more]

;

Update: 2020-11-19 08:00 GMT

పైకి క‌నిపించ‌క‌పోయినా.. ప‌దే ప‌దే చెప్పుకోక పోయినా..వైసీపీలో క్రమ‌శిక్షణ మామూలుగా ఉండ‌దు. పార్టీ అధినేత జ‌గ‌న్ అంటే.. అమ్మో.. అనే నాయ‌కులే అంద‌రూ. ఆయ‌న ద‌గ్గర దోబూచులు.. తెరవెనుక రాజ‌కీయం వంటివి చేసే సాహ‌సం, ధైర్యం కూడా ఎవ‌రూ చేయ‌రు. ఇది నిన్నటి మాట. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు రోడ్డెక్కుతున్నారు. ఎవ‌రికి వారు ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అవినీతి ప్రోత్సహిస్తున్నార‌ని దోచుకుంటున్నార‌నే ఆరో‌ప‌ణ‌లు సైతం వ‌స్తున్నాయి. ఇసుక మాఫియా కూడా వైసీపీ నేత‌ల క‌నుస‌న్నల్లోనే సాగుతోంది. ఇలా చేయొద్దు.. మొర్రో.. అని జ‌గ‌నే స్వయంగా చెబుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు వినిపించుకోవ‌డం లేదు.

ఎక్కడ చూసినా…..?

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రి రాజ్యం వారిది.. అనేలా కొన్ని చోట్ల ఉంటే.. గిల్లి క‌జ్జాలు పెట్టుకునే మంత్రులు, ఎమ్మెల్యే సంఖ్య కూడా మామూలుగా లేదు. దీంతో స‌ర్వవిధ భ్రష్టత్వం అంతా కూడా ఇప్పుడు వైసీపీలో క‌నిపిస్తోంది. చీరాల నుంచి తూర్పుగోదావ‌రి జిల్లా పి.గ‌న్నవ‌రం వ‌ర‌కు, అనంత‌పురం నుంచి విశాఖ‌, విజ‌యన‌గ‌రం వ‌ర‌కు ఎక్కడ చూసినా.. నాయ‌కుల మ‌ధ్య కీచులాట‌లు, కుమ్ము లాట‌లు క‌నిపిస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం ప్రద‌ర్శించు కునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు వేలు పెడుతున్నారు. ప‌లితంగా అభిమానుల మాటేమో కానీ.. పార్టీ మాత్రం అభాసుపాల‌వుతోంది. టీడీపీ నుంచి వ‌చ్చిన వారిపైనా వైసీపీ నేత‌లు చిర్రుబుర్రులాడుతున్నారు.

జగన్ నిర్ణయాలతోనేనా?

మ‌రి ఎంతో క్రమ శిక్షణ‌.. అధినేత ప‌ట్ల ఎంతో విధేయ‌త‌, అదే స‌మ‌యంలో భ‌యం ఉన్న నాయ‌కులు క‌ట్టు ఎందుకు త‌ప్పుతున్నారు ? అనే ప్రశ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. ఇలా ఎందుకు జ‌రుగుతోంది ? అనేదే కీల‌క ప్రశ్న. దీనికి స‌మాధానం.. జ‌గ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికారంలో ఉన్న సీఎంగా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజ‌ల్లో ఆగ్రహానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. మూడు రాజ‌ధానులు స‌హా పోల‌వ‌రం విష‌యంలోనూ ఆయ‌న అనుస‌రించిన వైఖ‌రిపై స‌ర్వత్రా విస్మయంగా ఉంది. అదే స‌మ‌యంలో ప్రజ‌లు దీనిని తిర‌స్కరిస్తున్నారు.

అసంతృప్తి కారణంగానే….

ఇక, పింఛ‌ను పెంచుతాన‌ని పెంచ‌క‌పోవ‌డం కూడా తీవ్ర వ్యతిరేక‌త‌గా మారింది. ఇక ఎమ్మెల్యేల‌కు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవ‌డం, తాము కోరిన చిన్న అభివృద్ధి ప‌నుల‌కు నిధులు ఇవ్వక‌పోవ‌డంతో చాలా మంది తాము ఎమ్మెల్యేలుగా ఉండి వేస్ట్ అని రుస‌రుస‌లాడుతున్నారు. ఇక నాయ‌కులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారంతా నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ప‌రిష్కరించలేక‌పోతున్నారు. ఉత్తరాంధ్రలో విజ‌య‌సాయి ఎంతో క‌ట్టుదిట్టంగా పార్టీ నేత‌ల‌ను కంట్రోల్ చేస్తున్నార‌న్న పేరున్నా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయ‌న‌కే ఎదురు తిరిగే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ.. సీఎంకే ప‌రిస్థితి బాగోలేదు. పైగా ఆయ‌న పై ఉన్న కేసుల విచార‌ణ కూడా సాగుతోంది… మేం చిన్న త‌ప్పు చేయ‌కూడ‌దా ? అన్న ధోర‌ణి కొంద‌రు జూనియ‌ర్ ఎమ్మెల్యేల్లో ఎక్కువుగా ఉంద‌ట‌. దీంతో వైసీపీ నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నచందంగా ఉన్నారు. ఈ ప‌రిస్థితి కంట్రోల్ చేయ‌క‌పోతే వైసీపీలో పుట్టి వైసీపీ వాళ్లే ముంచుకునే రోజు ఎంతో దూరంలో లేద‌నిపిస్తోంది.

Tags:    

Similar News