చంద్రబాబు కోట ఈసారి కొట్టడం కష్టమేనా?

వైసీపీలో నిత్య వివాదాల‌కు కేంద్రంగా ఉన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎమ్మెల్యేల మ‌ధ్య తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. ప్రతి విష‌యంలో మంత్రుల జోక్యం [more]

;

Update: 2021-02-20 08:00 GMT

వైసీపీలో నిత్య వివాదాల‌కు కేంద్రంగా ఉన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎమ్మెల్యేల మ‌ధ్య తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. ప్రతి విష‌యంలో మంత్రుల జోక్యం పెరుగుతోంద‌ని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇటీవల న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రోజా ఏకంగా ఈ విష‌యంలో కంట‌త‌డి పెట్టుకున్న ఘ‌ట‌న వెలుగు చూసింది. త‌న‌కు క‌నీసం ప్రొటోకాల్ కూడా అమ‌లు చేయ‌డం లేద‌ని రోజా ఆరోపించారు. ఈ ప‌రిణామం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో అస‌లు జిల్లాలో ఏం జ‌రుగుతోంద‌ని, మంత్రులు ఏం చేస్తున్నార‌నే విష‌యాల‌పై ఆస‌క్తి రేగింది.

న‌గ‌రిలో ప‌రిస్థితి….

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజా వ‌రుస‌గా రెండో సారి విజ‌యం సాధించారు. ఆదిలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో క‌ల‌గ‌లుపుగా కార్యక్రమాలు చేసేవారు. అయితే.. ఇత‌ర విష‌యాల్లో రోజాతో విభేదించిన పెద్దిరెడ్డి రోజాపై తీరుగుబాటు బావుటా ఎగ‌రేసిన కేజే కుమార్‌ను ప్రోత్సహించ‌డం ప్రారంభించారు. కుమార్ స‌తీమ‌ణి శాంతికి ఈడిగ కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌వి వ‌చ్చేలా చేశారు. ఇక‌, అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలూ శాంతి చూస్తున్నారు. మ‌రోవైపు మంత్రి నారాయ‌ణ స్వామి కూడా న‌గ‌రిపై పెత్తనం ప్రారంభించారు. అధికారుల‌ను తన క‌సుసైగ‌ల‌తో శాసిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడిక‌క్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే రోజా త‌న‌ను ఇద్దరు మంత్రులు టార్గెట్ చేస్తున్నారంటూ క‌న్నీళ్లు పెట్టుకునే ప‌రిస్థితి.

చిత్తూరు ప‌రిస్థితి ఇదీ..

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం మంత్రి పెద్దిరెడ్డిపై గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్న బుల్లెట్‌ సురేష్ ను మొదలియార్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా చేయడం వెనక మంత్రి హస్తం ఉందని ఎమ్మెల్యే కుత‌కుత‌లాడుతున్నారు. ఇదే స‌మయంలో ఇటీవ‌ల ప్రధాన ర‌హ‌దారిలో డ్రెయినేజీ కాంట్రాక్టును ఎమ్మెల్యేకు తెలియ‌కుండానే మంత్రి పెద్దిరెడ్డి వేరేవారికి కేటాయించ‌డం ఈ వివాదాల‌ను మ‌రింత పెంచింది. అయితే.. పార్టీలో కీల‌క స్థానంలో ఉన్న పెద్దిరెడ్డిని నేరుగా విభేదించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో మౌనంగా ఉంటున్నారు.

చంద్రగిరిలోనూ ఇంతే…

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో మంచి సంబంధాలు లేవని ప్రచారం జరుగుతోంది. చంద్రగిరి రెవెన్యూశాఖ వ్యవహారాల్లో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. పైగా చిత్తూరు లోక్‌సభ నియోజవర్గం జిల్లాగా మారితే త‌న‌కు ప్రాధాన్యం పెరుగుతుంద‌ని చెవిరెడ్డి భావిస్తున్నారు. అయితే.. పెద్దిరెడ్డి, మంత్రి నారాయ‌ణ‌స్వామిలు త‌మ‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ను రంగంలోకి దింపుతుండ‌డంతో చెవిరెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క‌.. త‌న‌ను తాను ర‌క్షించుకుని ఎదిగేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

కొంప కూల్చడం ఖాయమేనా?

మొత్తంగా చూస్తే.. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యే ల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరుకున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆ మాట‌కు వ‌స్తే మంత్రి పెద్దిరెడ్డిపై జిల్లాలో ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా గుస్సాతో ఉన్నారు. శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి సైతం పెద్దిరెడ్డిపై తిరుగుబావుటాతో ఉండ‌డంతో అక్కడ కూడా మ‌రో రెడ్డి నేత‌ను పెద్దిరెడ్డి ఎంక‌రేజ్ చేసేలా పావులు క‌దుపుతున్నార‌ట‌. జ‌గ‌న్ చిత్తూరుపై దృష్టి పెట్టక‌పోతే ఈ గ్రూపు రాజ‌కీయాలే ఆయ‌న కొంప కూల్చడం ఖాయం.

Tags:    

Similar News