ద్వారంపూడి వ‌ర్సెస్ దొర‌బాబు.. తూర్పు వైసీపీలో పొలిటిక‌ల్ హీట్‌

తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపుతిరుగుతున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గం దూకుడుతో ఇత‌ర నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు. పైగా త‌మ సొంత ఇలాకాల్లోకి రెడ్డి వ‌ర్గానికి [more]

Update: 2021-01-24 00:30 GMT

తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపుతిరుగుతున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గం దూకుడుతో ఇత‌ర నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు. పైగా త‌మ సొంత ఇలాకాల్లోకి రెడ్డి వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వేలు పెడుతున్నా.. ఏమీ చేయ‌లేక పోతున్నార‌ట‌. దీంతో తూర్పు వైసీపీలో పెద్ద ఎత్తున పొలిటిక‌ల్ హీట్ రాజుకుంటోన్న ప‌రిస్థితి నెల‌కొంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర్ రెడ్డి.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన నాయ‌కుల్లో ఒక‌రు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ద్వారంపూడి దూకుడు ఓ రేంజ్‌లో ఉంద‌ని చెప్పుకొంటున్నారు.

జగన్ కు సన్నిహితుడు కావడంతో….

ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ నియోజకవర్గంతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కొన్ని నెలలుగా మట్టి తవ్వకాలు చేయిస్తున్నారు. కొండల దగ్గర నుంచి పోలవరం మట్టి తరలింపు వరకు పక్క నియోజకవర్గాల్లోనూ ఆయ‌న జోక్యం చేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ద్వారంపూడి పెత్తనం చలాయించడం చూసి.. ఆయన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు మ‌ద‌‌న‌ప‌డుతున్నారు. ద్వారంపూడి సీఎం జగన్ సన్నిహితుడు కావ‌డంతో పార్టీలోనూ ఆయ‌న‌కు తిరుగులేకుండా పోవ‌డంతో అంద‌రూ మౌనంగా ఉంటున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో….

ఆయనను ఎదుర్కొంటే రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతాయనే భయంతో ఇతర ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. దాంతో ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి దూకుడును నిలదీయలేక.. తమ నియోజకవర్గాల్లో ఆయ‌న వేలు పెట్టడాన్ని ఆప‌లేక వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌లు సతమతమవుతున్నారు. కాకినాడ పక్కనే పిఠాపురం నియోజకవర్గం ఉంది. దాంతో పిఠాపురంలో ద్వారంపూడి పోలవరం మట్టితో వ్యాపారం చేసుకుంటూ కోట్లు గడిస్తుండటాన్ని చూసి ఎమ్మెల్యే దొరబాబు కుతకుత ఉడికిపోతున్నారట. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరిలో సీఎం జగన్ పర్యటించి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించారు.

మట్టిని నింపడానికి…..

ఇక్కడ ఇచ్చిన 16 వేల ఇళ్ల పట్టాలు కాకినాడ సిటీ నియోజకవర్గం లబ్ధిదారులవి. అయితే కాకినాడలో ఇళ్ల స్థలాలకు భూములు లేక పిఠాపురం నియోజకవర్గంలో 350 ఎకరాలు అక్కడి లబ్దిదారులకు కేటాయించారు. అయితే ఈ 350 ఎకరాల భూములు చదునుచేసేందుకు మట్టితో నింపే కోట్ల రూపాయల కాంట్రాక్టును ఎమ్మెల్యే ద్వారంపూడి చేజిక్కించుకున్నారు. వేలాది టిప్పర్లలో మట్టిని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని పోలవరం కాలువల నుంచి తరలించారు.

అధికారులు సయితం….

అయితే, తన నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు, కోట్ల రూపాయల మట్టి ఫిల్లింగ్‌ కాంట్రాక్టును ద్వారంపూడి దక్కించుకోవడాన్ని దొరబాబు భరించలేకపోతున్నారు. అయితే, ఎవ‌రికి చెప్పినా.. అమ్మో ద్వారంపూడి విష‌యంలో జోక్యం చేసుకోం! అని చెబుతుండ‌డంతో రాజ‌కీయంగా ఏం చేయాలో తెలియ‌క దొర‌బాబు త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నార‌ని జిల్లా వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఆయనను కూడా డమ్మీని చేసి…..

ఇక పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇన్‌చార్జ్‌గా ఉన్ ద‌వులూరు దొర‌బాబును కూడా డ‌మ్మీని చేసి ద్వారంపూడి అక్కడ కూడా కొన్ని విష‌యాల్లో హ‌వా చెలాయిస్తున్నార‌ని టాక్‌. ఇక ఇటీవ‌లే డీఆర్సీ స‌మావేశం సాక్షిగా రాజ్యస‌భ స‌భ్యుడు పిల్లి బోస్‌ను ద్వారంపూడి ఎలా ? బూతుల‌తో తిట్టారో… త‌ర్వాత జ‌గ‌న్ నుంచి వార్నింగ్ రావ‌డంతో ఇంటికి లంచ్‌కు పిలిపించి మ‌ళ్లీ క‌లిసిన‌ట్టు క‌వ‌రింగ్ ఇచ్చారో చూశాం. ఏదేమైనా జిల్లాలో రెడ్ల బ‌లం లేక‌పోయినా పైన జ‌గ‌న్ అండ‌తో ద్వారంపూడి మామూలు హ‌వా చెలాయించ‌ట్లేదు. ఇది మ‌రో రెండు ప్రధాన సామాజిక వ‌ర్గాల నాయ‌కులు, ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతోంది.

Tags:    

Similar News