నన్ను తొక్కేస్తున్నారంటున్న వైసీపీ ఎమ్మెల్యే

అధికార వైసీపీలో అసంతృప్తి సెగ‌లు పొగ‌లు బ‌య‌ట ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వివాదాలు త‌లెత్తిన‌ప్పుడు సంయ‌మ‌నం పాటించేలా చేయాల్సిన మంత్రులే ఈ విమ‌ర్శలు ఎదుర్కొన‌డం.. పార్టీని ముందుండి [more]

Update: 2020-11-19 03:30 GMT

అధికార వైసీపీలో అసంతృప్తి సెగ‌లు పొగ‌లు బ‌య‌ట ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వివాదాలు త‌లెత్తిన‌ప్పుడు సంయ‌మ‌నం పాటించేలా చేయాల్సిన మంత్రులే ఈ విమ‌ర్శలు ఎదుర్కొన‌డం.. పార్టీని ముందుండి న‌డిపించేందుకు ప్రయ‌త్నించాల్సిన వారే.. నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చేయాల్సిన వారే ఇలా విమ‌ర్శల‌కు, వివాదాల‌కు కేంద్రంగా కావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా టి.గ‌న్నవ‌రం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త‌న అస‌హ‌నాన్ని ఆయ‌న వెళ్లగ‌క్కారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ఒక్క అడుగు మేర‌కు కూడా రోడ్డు వేయ‌లేక పోయాన‌ని.. దీంతో ప్రజ‌ల్లో తాను ప‌లుచ‌న‌య్యాన‌ని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు.

తొలిసారి గెలిచిన తనను…

‘తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేని నేను. నా విషయంలో నియోజకవర్గ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, మంత్రుల తీరు కారణంగా నన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను. మంత్రులు నాకు సహకరించడంలేదు. ఈ విషయమై ఎంతలా సర్దుకుపోదామనుకున్నా, నన్ను తొక్కేస్తున్నారు..’ అంటూ చిట్టి బాబు వ్యాఖ్యానించ‌డం జిల్లా రాజ‌కీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, ఈ ప‌రిస్థితి ఆయ‌న ఒక్కడికేనా ? అంటేకాదు. తూర్పుగోదావ‌రి జిల్లాలోని చాలా మంది వైసీపీ నాయ‌కులు ఇదే బాధ‌ను వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కీల‌క‌మైన ఇద్దరు మంత్రులు ఉన్నారు.

ఈ ఇద్దరు మంత్రులు…

పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణలు జిల్లాలో చ‌క్రం తిప్పుతున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా కోన‌సీమ రాజ‌కీయాల్లో వీరిని కాద‌ని ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ చిన్న పుల్ల కూడా ఇటు తీసి అటు వేసే ప‌రిస్థితి లేద‌ట‌. రాజోలు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ నుంచి గెలిచిన జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక‌వ‌ర‌ప్రసాద్‌ను వీరిద్దరూ ప్రోత్సహిస్తున్నా ర‌ని.. స్థానిక వైసీపీ నాయ‌కుడు బొంతు రాజేశ్వర‌రావు తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. ఇక‌, ఈ ప‌రంప‌రలోనే చిట్టిబాబు కూడా చేరిపోయారు.

మంత్రులు వేలు పెడుతూ…..

త‌న నియోజ‌క‌వ‌ర్గాన్నే కాకుండా త‌న‌ను కూడా మంత్రులు ప‌ట్టించుకోవ‌డం లేదని, నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిలేదని ఈ వైసీపీ ఎమ్మెల్యే బాహాటంగానే విమ‌ర్శలు సంధించారు. అంతేకాదు, ప్రతి విష‌యంలోనూ మంత్రులు వేలు పెడుతున్నారని .. క‌నీసం పార్టీ అదినేత‌, సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి కూడా అనుమ‌తి ల‌భించ‌డం లేద‌ని , దీనివెనుక మంత్రుల పాత్ర ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా జిల్లా రాజ‌కీయాలు రాష్ట్రాస్థాయిలో చ‌ర్చకు వ‌చ్చాయి.

వైసీపీకి వైసీపీయే…?

ఈ ఇద్దరు మంత్రులు కోన‌సీమ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ప్రాంతంపై ప‌ట్టుకోస‌మే ఈ ఇద్దరు మంత్రులు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ త‌మ వ‌ర్గాన్ని ప్రోత్సహిస్తున్నార‌ని… దీంతో ఎమ్మెల్యేల్లో అస‌హ‌నం పెరిగిపోతుంద‌ని వైసీపీ నేత‌లే చెపుతున్నారు. కోన‌సీమ వైసీపీలో మంత్రుల‌ది ఓ గ్రూపు కాగా, ఎంపీ చింతా అనూరాధ మ‌రో గ్రూపు గాను, పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు కాపు నేతల‌తో మ‌రో వ‌ర్గంగా, ఎమ్మెల్యేలు ఓ వ‌ర్గంగా ఉండ‌డంతో పార్టీ చీలిక‌లు, పీలిక‌ల్లా మారిపోయింది. ఇక మంత్రులు ఆధిప‌త్య రాజ‌కీయంలో ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు అస‌హ‌నంతో ర‌గులుతున్నారు. ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే వైసీపీకి వైసీపీయే అక్కడ శ‌త్రువు కావ‌డం ఖాయం.

Tags:    

Similar News