పంచాయ‌తీ పోరులో వైసీపీ ఎంపీ vs ఎమ్మెల్యే పంతం

వైసీపీలో పంచాయ‌తీ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇది పంచాయ‌తీ పోరు కాకుండా వైసీపీలో పంచాయితీగా మారిపోయింది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యేలు, ఇత‌ర కీల‌క నేతల [more]

;

Update: 2021-02-12 02:00 GMT

వైసీపీలో పంచాయ‌తీ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇది పంచాయ‌తీ పోరు కాకుండా వైసీపీలో పంచాయితీగా మారిపోయింది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యేలు, ఇత‌ర కీల‌క నేతల మ‌ధ్య అభ్యర్థుల విష‌యంలో గొడ‌వ‌లు ముదిరి పాకాన ప‌డుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మంత్రులు త‌మ‌కు సంబంధం లేని జిల్లాల్లో కూడా తాము చెప్పిన వారికి టిక్కెట్లు ఇవ్వాల‌ని పట్టుబ‌డుతుండ‌డంతో మంత్రుల‌కు, ఎమ్మెల్యేల మ‌ధ్య పెద్ద యుద్ధమే న‌డుస్తోంది. ఈ క్రమంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకే చెందిన ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల ఫ్యానెల్స్ పోటాపోటీగా రంగంలో ఉన్నాయి. ఒకే పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే గ్రూపులు పోటీలో ఉండ‌డంతో నిజ‌మైన వైసీపీ కేడ‌ర్ సైతం ఎవ‌రు అస‌లు వైసీపీ మ‌ద్దతుదారులో తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉంటే.. ఇది ఎక్కడ టీడీపీకి లాభిస్తుందో ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

వర్గాలుగా విడిపోయి…

ఈ ప‌రిస్థితి చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా, ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ ఇద్దరి మ‌ధ్య ప్రారంభ‌మైన కోల్డ్‌వార్ క్రమ‌క్రమంగా ప్రారంభ‌మై.. స్థానిక ఎన్నిక‌ల వేళ కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండే స్థాయికి చేరుకుంది. ఇద్దరూ కూడా ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గకుండా పంతానికి పోతుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. శ్రీథ‌ర్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంత పంతానికి పోవ‌డానికి ప్రధాన కార‌ణం చింత‌ల‌పూడి ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డ‌మే. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు మండ‌లాల్లో కొన్ని పంచాయ‌తీల్లో ఇదే ప‌రిస్థితి ఉన్నా… శ్రీథ‌ర్ సొంత మండ‌లం కామ‌వ‌ర‌పుకోట‌లో ఎంపీ శ్రీథ‌ర్ + కేవీపీ రామ‌చంద్రారావు బావ‌మ‌రిది మేడ‌వ‌ర‌పు అశోక్ బాబు ఫ్యానెల్ ఒక వ‌ర్గంగాను… ఎమ్మెల్యే ఎలీజా మ‌రో వ‌ర్గంగాను నామినేష‌న్లు వేశారు.

ఎంపీ సొంత గ్రామంలో….

కామ‌ర‌వ‌పుకోట మండ‌ల కేంద్రమైన కామ‌వ‌ర‌పుకోట పంచాయ‌తీ ఎన్నిక‌ల జిల్లాలోనే ర‌స‌వ‌త్తరంగా మారింది. ఇక్కడ నుంచి ముందుగా ఎంపీ శ్రీథ‌ర్ వ‌ర్గం ఫ్యానెల్ నామినేష‌న్లు వేసింది. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే ఎలీజా స్వయంగా ద‌గ్గరుండి త‌న వ‌ర్గం ఫ్యానెల్‌తో నామినేష‌న్ వేయించ‌డంతో పాటు ఇదే అధికార వైసీపీ ఫ్యానెల్ అని బ‌హిరంగంగా ప్రక‌టించారు. నామినేష‌న్ల విత్ డ్రాల‌కు మ‌రో రెండు రోజుల టైం ఉన్నా ఇప్పటికే ప్రెస్టేజ్‌కు పోవ‌డంతో ఎవ్వరూ వెన‌క్కు త‌గ్గే ప‌రిస్థితి లేదు. ఇక ఇదే మండ‌లంలోని మ‌రో మూడు పంచాయ‌తీల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. కొన్ని చోట్ల టీడీపీ పోటీలో లేక‌పోయినా వైసీపీలోనే రెండు గ్రూపులు పోటీ ప‌డుతున్నాయి. శ్రీథ‌ర్ స్వగ్రామం ఈస్ట్ య‌డ‌వ‌ల్లిలో అయితే ఏకంగా శ్రీథ‌ర్ సోద‌రి పొన్నాల అనిత స్వయంగా ఎంపీగా ఉన్న సోద‌రుడి ఫ్యానెల్ మీద తానే స్వయంగా పోటీకి దిగారు.

మాగంటి బాబు హ్యాండ్సప్….

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చింత‌ల‌పూడి టీడీపీ ఇన్‌చార్జ్ క‌ర్రా రాజ‌రావుతో పాటు మాజీ ఎంపీ మాగంటి బాబు సైతం చేతులు ఎత్తేశారు. దీనికి తోడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. శ్రీథ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు కామ‌వ‌ర‌పుకోట మండ‌లంపై ప్రత్యేకంగా ఫోక‌స్ పెట్టి అశోక్‌తో క‌లిసి టీడీపీలో బ‌ల‌మైన కేడ‌ర్‌ను వైసీపీలో చేర్పించేస్తున్నారు. అయితే ఓ వైపు ఎంపీ ఫ్యానెల్ ముందుగా నామినేష‌న్లు వేసి ప్రచారం చేస్తుంటే.. వెంట‌నే ఎమ్మెల్యే కూడా త‌న వ‌ర్గాన్ని ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఎంపీ ఫ్యానెల్‌కు నేతృత్వం వ‌హిస్తోన్న కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌కు జ‌గ‌న్‌తోనే నేరుగా ఎటాచ్‌మెంట్ ఉండ‌డంతో ఆయ‌న ఎక్కడా వెన‌క్కు త‌గ్గడం లేదు.

ఒక సామాజికవర్గానికే….?

కొద్ది రోజుల ముందు వ‌ర‌కు ఈ వార్‌లో సైలెంట్‌గా ఉన్నట్టుగా క‌నిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా తెర‌ముందుకు వ‌చ్చేసి డైరెక్ట్‌గానే ఫైట్ చేస్తున్నారు. జిల్లా పార్టీ ప‌రిశీల‌కుడు వైవి. సుబ్బారెడ్డికి అశోక్‌పై ఫిర్యాదు చేసిన‌ట్టుగా కూడా స‌మాచారం. విచిత్రం ఏంటంటే ఎంపీ ఫ్యానెల్ కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకుని ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి. అదే పంథాలో ఎమ్మెల్యే కూడా కేవ‌లం ఒక్క సామాజిక వ‌ర్గానికే ప్రయార్టీ ఇస్తోన్న ప‌రిస్థితి. మ‌రి ఈ వార్‌లో ఎవ‌రైనా వెన‌క్కు త‌గ్గుతారా ? లేదా ఇదే పంథాలో ముందుకు వెళ్లి ఎవ‌రు ? ఎవ‌రిపై పై చేయి సాధిస్తారో ? చూడాలి.

Tags:    

Similar News