అక్కడ చంద్రబాబు రివర్స్ స్కెచ్…వైసీపీకి కష్టమేనట

నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రాజ‌కీయాలు చీలిక‌లు.. పీలిక‌లుగా క‌నిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.. ఇటీవ‌ల కాలంలో [more]

Update: 2020-11-07 05:00 GMT

నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రాజ‌కీయాలు చీలిక‌లు.. పీలిక‌లుగా క‌నిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.. ఇటీవ‌ల కాలంలో సొంత పార్టీలోనే వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారు. 2009లో పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండోసారి గెల‌వ‌డంతో పాటు పార్టీ అధికారంలోకి రావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వం అయిన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీలో కీల‌క నేత‌లు తీవ్ర అసంతృప్తి అస‌హనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితి.. నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యే వ‌ర‌కు దారితీయ‌డం ఇప్పుడు చ‌ర్చకు వ‌చ్చింది. కావ‌లిలో అన్ని పార్టీల‌కూ స‌మాన బ‌లం ఉంది. కాంగ్రెస్‌, టీడీపీలు కూడా గ‌తంలో గెలిచాయి.

అనుచరులే నియంత్రిస్తుండటంతో….

పార్టీలో చిన్న కార్యక్రమం అయినా తాను చెప్పిన‌ట్టే జ‌ర‌గాల‌న్న ఎమ్మెల్యే నిర్ణయంతో టీడీపీ నుంచి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల‌రెడ్డి స‌హా చాలా మంది వైసీపీ నాయ‌కులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. స్థానిక స‌మ‌స్యల‌ను ఎత్తి చూపుతున్నా.. వీరిని ఎమ్మెల్యే అనుచ‌రులే నియంత్రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో వీరెవ‌రూ కూడా మీడియాతో మాట్లాడ‌డానికి వీల్లేద‌ని రామిరెడ్డి ఆంక్షలు విధిస్తున్నారు. ఏం జ‌రిగినా.. త‌న క‌నుస‌న్నల్లోనే జ‌ర‌గాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇక‌, పార్టీ అధిష్టానం కూడా రామిరెడ్డి ఎంత చెబితే అంతే అన్నట్టుగా ఉంది. దీంతో గ‌తంలో టీడీపీ నుంచి వ‌చ్చి.. వైసీపీలో చేరిన వంటేరు స‌హా ఆయ‌న అనుచ‌రులు, ఇత‌ర పార్టీల నేత‌లు ఇప్పుడు త‌మ దారి తాము చూసుకుంటున్నారు.

ఎమ్మెల్యే ఆంక్షలతో…..

వంటేరు గ‌తంలో 1999లో టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న నెల్లూరు ఎంపీగా ఓడారు. చంద్రబాబు కావ‌లిలో బీద సోద‌రుల‌కు ప్రయార్టీ ఇవ్వడంతో వంటేరు బాబుపై అలిగి.. వైసీపీలో చేరారు. ఇటీవ‌ల మ‌స్తాన్ రావు .. టీడీపీకి బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీకి ఇప్పుడు కావ‌లిలో నాయ‌కుడు అవ‌స‌రం అయ్యారు. బీద మ‌స్తాన్ రావు సోద‌రుడు ర‌విచంద్ర టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నా స్థానికంగా ఆయ‌న నాయ‌క‌త్వాన్ని నియోజ‌క‌వ‌ర్గంలో చాలా సామాజిక వ‌ర్గాలు అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. ఇది త‌న‌కు లాభిస్తుంద‌ని వంటేరు భావిస్తున్నారు. మ‌రోవైపు వైసీపీలో స్వేచ్ఛలేద‌ని, అడుగ‌డుగునా.. ఎమ్మెల్యే ఆంక్షలు ఎక్కువ‌య్యాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలోకి వస్తే….

ఈ క్రమంలో తిరిగి టీడీపీలోకి వ‌స్తే.. ఇంచార్జ్ పోస్టు ఇచ్చేందుకు పార్టీ కూడా రెడీగానే ఉన్న నేప‌థ్యంలో వంటేరు స‌హా ఆయ‌న అనుచ‌రులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అయ్యార‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఇక‌, వైసీపీలో కీల‌కంగా ఉన్న మ‌రికొంద‌రు కూడా ఎమ్మెల్యే రామిరెడ్డిపై తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు వీరిలో కొంద‌రిని త‌న‌తో క‌లుపుకొని సైకిల్ ఎక్కించుకోవాల‌ని వంటేరు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. కావ‌లిలో టీడీపీ బ‌ల‌ప‌డ‌డంతోపాటు.. వైసీపీ ఒకింత బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బీద మ‌స్తాన్‌రావు లాంటి బ‌ల‌మైన నేత‌ను పార్టీలో చేర్చుకుని ఇక్కడ టీడీపీకి నిలువ నీడ లేకుండా చేయాల‌ని వైసీపీ స్కెచ్ వేస్తే… ఇప్పుడు వంటేరు టీడీపీలో చేరితే టీడీపీకి ఆ న‌ష్టం భ‌ర్తీ అయినట్టే. మ‌రి కావ‌లి రాజ‌కీయం ఎలా ట‌ర్న్ అవుతుందో ? చూడాలి.

Tags:    

Similar News