అక్కడ టీడీపీకి జ‌గ‌న్ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వట్లేదే?

రాజ‌కీయాల్లో ఏదైనా చేయొచ్చు. పైగా అధికారంలో ఉన్న పార్టీ క‌నుక వైసీపీ క‌ర్నూలు జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ జిల్లాలో మిశ్రమ ఓటు బ్యాంకు ఉంది. [more]

Update: 2020-11-17 00:30 GMT

రాజ‌కీయాల్లో ఏదైనా చేయొచ్చు. పైగా అధికారంలో ఉన్న పార్టీ క‌నుక వైసీపీ క‌ర్నూలు జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ జిల్లాలో మిశ్రమ ఓటు బ్యాంకు ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఇదే హవాను కొన‌సాగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అస‌లు భ‌విష్యత్తులో ఇక్కడ టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ చిన్న విజ‌యం లేకుండా చేసే ప్లాన్ వేస్తోంది. క‌డ‌ప జిల్లా పార్టీకి ఎంత తిరుగులేకుండా ఉందో ఇక్కడ కూడా పార్టీ అంతే స్ట్రాంగ్ అయ్యేలా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన యేడాదిన్నర కాలంలో క‌ర్నూలు జిల్లాలో టీడీపీని ఇప్పటికే నిర్వీర్యం చేసేశారు. ఇక తాజాగా మ‌రో ప్లాన్‌తో అక్కడ టీడీపీని మ‌రో దెబ్బ కొట్టనున్నారు. ఇప్పటి వ‌ర‌కు రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాల‌ని అనుకున్న క‌ర్నూలులో మూడో జిల్లాకు ప్రాధాన్యం ఇస్తోంది జ‌గ‌న్ ప్రభుత్వం.

మూడు జిల్లాలుగా…..

పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంతో క‌లిపి ఆదోనిని జిల్లా చేయాల‌ని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక్కడి ప్రజ‌లను శాంత ప‌రిచేందుకు, ఓటు బ్యాంకును త‌న‌కు అనుకూలంగా మార్చుకు నేందుకు ప్రయ‌త్నిస్తోంది. అదే స‌మ‌యంలో నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరుల‌ను క‌లిపి క‌ర్నూలు జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిపి నంద్యాల జిల్లా ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో రెండు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఇప్పుడు మూడు జిల్లాల ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు ముమ్మరం చేస్తున్నారు.

జగన్ లక్ష్యమదే……

ఆదోని.. పెద్ద రెవెన్యూ డివిజ‌న్ కావ‌డం. ఇక్కడి ప్ర‌జ‌లు జిల్లా ఏర్పాటుకు ముందుకు రావ‌డంతో క‌ర్నూలును పూర్తిగా తమ‌ హ‌స్తగ‌‌తం చేసుకునేందుకు ఇంత‌కు మించిన స‌మ‌యం లేద‌ని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనూ వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. అదే స‌మ‌యంలో క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా కూడా ప్రక‌టించిన ద‌రిమిలా.. త‌మ హ‌వాను మ‌రింత పెంచేందుకు వైసీపీ మూడు జిల్లాల ఏర్పాటు ప్రతిపాద‌న‌ను ముందుకు తెస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి రాజ‌కీయంగా కూడా ఎలాంటి అడ్డంకులు లేక పోవ‌డం క‌లిసి వ‌స్తున్న అంశంగా ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. ఏదేమైనా క‌ర్నూలుపై జ‌గ‌న్ ఈ స్థాయిలో కాన్‌సంట్రేష‌న్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తే వైసీపీకి ఈ జిల్లా కూడా మ‌రో క‌డ‌ప‌లా మారే అవ‌కాశాలే ఉన్నాయి. జ‌గ‌న్ ల‌క్ష్యం కూడా అదే..!

Tags:    

Similar News