ఒకే జిల్లా ఐదు నియోజకవర్గాలు… వైసీపీలో రగడ
ఏపీలో అధికార వైసీపీలో గ్రూపుల రాజ్యం నడుస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో పార్టీలో బలమైన నేతల మధ్య [more]
;
ఏపీలో అధికార వైసీపీలో గ్రూపుల రాజ్యం నడుస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో పార్టీలో బలమైన నేతల మధ్య [more]
ఏపీలో అధికార వైసీపీలో గ్రూపుల రాజ్యం నడుస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో పార్టీలో బలమైన నేతల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఈ మూడు ముక్కలాటలో పార్టీ సర్వనాశనం అయ్యే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి. బాపట్ల పార్లమెంటు పరిధిలోని చీరాల, అద్దంకి, పరుచూరు మూడు నియోజకవర్గాల్లోనూ మూడేసి గ్రూపులు ఉన్నాయి. పరుచూరులో ప్రస్తుత ఇన్‌చార్జ్ రావి రామనాథం బాబుపై కంప్లెంట్లు ఎక్కువ అవ్వడంతో ఆయన్ను మార్చేయాలని అధిష్టానం దాదాపు నిర్ణయం తీసేసుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ మాజీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి భరత్ యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. ఇక దగ్గుబాటి కుటుంబాన్ని జగన్ పక్కన పెట్టినా ఆ వర్గం మాత్రం దగ్గుబాటి తనయుడు హితేష్ చెంచురామ్‌కు నియోజకవర్గ పగ్గాలు ఇప్పించుకోవాలని తమ వంతుగా ప్రత్యేకంగా ఫైట్ చేస్తోంది. వైసీపీలో తమకు జరిగిన అన్యాయంపై అదను చూసి దెబ్బకొట్టాలని దగ్గుబాటి వర్గం చూస్తోంది.
ఆధిపత్యం కోసం…..
ఇక చీరాల వైసీపీ పంచాయితీపై అధిష్టానం తలపట్టుకుంటోంది. ఇక్కడ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణమోహన్, పార్టీ మారి వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కు తగ్గేలా లేకపోవడంతో జగన్ సైతం ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పోతుల సునీత కూడా కాచుకుని ఉంది. ఇటీవలే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. చీరాలలో చేనేతలు ఎక్కువుగా ఉండడంతో ఆ కోణంలో ఇక్కడ పాగా వేసేందుకు పోతుల సునీత ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా.
అద్దంకి నియోజకవర్గంలో……
ఇక అద్దంకి రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వంలో గొట్టిపాటి వర్సెస్ కరణంగా మారిన రాజకీయ పోరు కాస్తా ఇప్పుడు మూడు ముక్కలాటగా మారింది. కరణం బలరాం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు పట్టుంది అద్దంకిలోనే.. ఆయన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగా.. తర్వాత రెండుసార్లు వరుసగా కరణం, ఆయన తనయుడు వెంకటేష్ ఇద్దరూ ఓడిపోయారు. ప్రస్తుతం అద్దంకిలో కరణం వర్గం స్ట్రాంగ్‌గా ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మరో మాజీ ఎమ్మెల్యే అయిన సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య తనయుడు కృష్ణ చైతన్య ఉన్నారు. అద్దంకిలో తమ పట్టు సడలేందుకు ఒప్పుకోని కరణం ఫ్యామిలీ క్కడ కూడా కాలు దువ్వుతుండడంతో వైసీపీలో వర్గ పోరు మామూలుగా లేదు.
నాలుగు స్థంభాలాట…..
ఇక టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డిది ఈ నియోజకవర్గం కావడంతో ఆ వర్గం ఓ గ్రూపుగా ఉంది. ఇక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ఇప్పటకీ రెడ్లలో కొందరు అనుసరిస్తున్నారు. ఆయన వైసీపీలోకి రావాలని వారంతా ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. వ్యాపారాల ఇబ్బందుల్లో ఉన్న రవి వైసీపీలోకి వస్తే అద్దంకిలో నాలుగు స్తంభాలాట ఖాయం. అద్దంకి పంచాయితీ వైసీపీలో ఎప్పటకీ తెగే పరిస్థితి లేదు. రేపు కరణంను చీరాల నుంచి తప్పిస్తే అప్పుడు అద్దంకిలో వర్గపోరు మరింత రాజుకుంటుంది. ఒకవేళ గొట్టిపాటి కూడా వైసీపీలోకి వస్తే అద్దంకి, చీరాలలో బాచిన ఫ్యామిలీ, కరణం ఫ్యామిలీ, ఆమంచిలలో ఎవరు బకరాలు అవుతారో ? ఇప్పుడే చెప్పలేం.
ఇక్కడా మూడు గ్రూపులే…..
ఇక ఎస్సీ నియోజకవర్గం అయిన కొండపిలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ మాదాసు వెంకయ్య వర్సెస్ మాజీ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు వర్గాలు నిత్యం ఘర్షణలకు దిగుతున్నాయి. వెంకయ్య గత ఎన్నికల్లో ఓడినా జగన్ డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో అశోక్‌బాబు ఇన్‌చార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ హామీ ఉన్నా.. ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చనే ఆయన కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఈ రెండు వర్గాల వార్‌ను గమనిస్తోన్న జూపూడి ప్రభాకర్ రావు తాను సైతం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నారు.
ఐదు నియోజకవర్గాల్లో అంతే….?
ఇక దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య ప్రతి రోజు.. ప్రతి విషయంలోనూ నువ్వా.. నేనా ? అన్న రేంజ్‌లో వార్ నడుస్తోంది. ఇక మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీలో చేరడంతో ఆ వర్గం కూడా పట్టుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి శిద్ధా వర్గం సైలెంట్‌గా ఉన్నా.. రేపటి రోజున సమీకరణలు మారితే లక్ చిక్కుతుందన్న ఆశతో ఉంది. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ మూడు పీలికలుగా చీలిపోవడంతో అది ప్రతిపక్షానికి కలిసొచ్చే పరిణామాలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.