వైసీపీ గొడవల్లో ఫస్ట్ ర్యాంక్ ఆ జిల్లాదే.. కొత్త గొడవల రచ్చ ?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ లో ఓ జిల్లాలో కీలక నేతల మధ్య పదే పదే గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఒకటి కాదు సగానికిపైగా నియోజకవర్గాల్లో నేతల [more]
;
ఏపీలో అధికార పార్టీ వైసీపీ లో ఓ జిల్లాలో కీలక నేతల మధ్య పదే పదే గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఒకటి కాదు సగానికిపైగా నియోజకవర్గాల్లో నేతల [more]
ఏపీలో అధికార పార్టీ వైసీపీ లో ఓ జిల్లాలో కీలక నేతల మధ్య పదే పదే గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఒకటి కాదు సగానికిపైగా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య రాజకీయ వేడి రాజుకుంది. ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చీరాల, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి, పరుచూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శిలో ఇదే పరిస్థితి ఉంది. బాలినేని, వైవి. సుబ్బారెడ్డితో పాటు జిల్లా పరిశీలకులు అయిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి లాంటి నేతలు చెప్పినా కూడా ఇక్కడ ఎవ్వరూ వినే పరిస్థితి లేదు.
ఏ నియోజకవర్గంలోనూ……
దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం బలరాం మధ్య గొడవ జరగని రోజు లేదు. ఆమంచికి పరుచూరు పగ్గాలతో పాటు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా ఆయన చీరాల వదిలేందుకు ఇష్టపడడం లేదు. ఇక అద్దంకిలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణచైతన్య తన పని తాను చేసుకుపోతున్నా కరణం కుమారుడు వెంకటేష్ తన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ వేలు పెడుతుండడంతో గరటయ్య వర్గంలో అలజడి మొదలైంది. పదవుల నుంచి పనుల వరకు తన వర్గానికి ప్రయార్టీ ఇవ్వాలని కరణం వర్గం డిమాండ్ చేస్తోంది.
లోకల్.. నాన్ లోకల్….
ఇక కొండపిలో ప్రస్తుత ఇన్‌చార్జ్ మాదాసు వెంకయ్యను తప్పించేసి… మాజీ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబుకు పగ్గాలు ఇవ్వాలని మెజార్టీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గ పోరు భరించలేక వెంకయ్య చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితి. సంతనూతలపాడు ఇటీవల కొత్త గొడవలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు వ్యతిరేకంగా మరో వర్గం లోకల్.. నాన్ లోకల్ వివాదం తెరమీదకు తెచ్చింది. సుధాకర్ బాబు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు ఇక్కడ పట్టు చిక్కడం లేదు.
రెడ్డివర్గం నేతల దూకుడుతో…
కనిగిరిలో ఎమ్మెల్యే మధుసూదన్‌కు వైసీపీలో కీలక పాత్ర పోషించే రెడ్డి సామాజిక వర్గానికి పొసగడం లేదు. పరుచూరులో పార్టీలోనే మూడొంతుల మంది ఇన్‌చార్జ్ రావి రామనాథం బాబుకు అక్కడ ఎమ్మెల్యే ఏలూరిని ఢీకొట్టే దమ్ములేదని చెప్పేస్తున్నారు. కొందరు దగ్గుబాటి అక్కడ లేకపోయిన ఆయన వర్గంగానే ఉంటున్నారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు తెలియకుండానే ఆయన నియోజకవర్గంలో పదవుల భర్తీతో పాటు కాంట్రాక్టు పనులు అయిపోతున్నాయి. జిల్లా మంత్రులతో పాటు రెడ్డి వర్గం నేతల దూకుడుతో ఆయన రగిలిపోతున్నారు.
ఇలాగే కొనసాగితే….?
మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తన అనుచరులు, బంధువర్గానికే ప్రయార్టీ ఇచ్చుకుంటూ వైసీపీ కోసం కష్టపడిన అసలు నేతలను పక్కన పెట్టేశారని చాలా మంది వాపోతున్నారు. చివరకు మంత్రి బాలినేని ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒంగోలులో కూడా చాలా మంది ఆయనతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. యర్రగొండపాలెంలో మంత్రి సురేష్‌తో పొసగకే మాజీ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సైకిల్ ఎక్కేస్తున్నట్టు ప్రకటించారు. ఏదేమైన కందుకూరు లాంటి చోట్ల మినహాయిస్తే జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ లో తీవ్రమైన వర్గపోరుతో పార్టీ నష్టపోయేలా ఉంది. మరి దీనికి అధిష్టానం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇక్కడ పార్టీకి షాకులు తప్పవు.