ఆయనకేందో అంత స్పెషల్…. మంత్రిపై వైసీపీలో గుస్సా

తిరుప‌తి పార్లమెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో వైసీపీ గెలిచి తీరాల‌నే కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతోంది. అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా ఇక్కడ భారీ మెజారిటీ సాధించాల‌ని కూడా [more]

Update: 2021-04-05 05:00 GMT

తిరుప‌తి పార్లమెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో వైసీపీ గెలిచి తీరాల‌నే కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతోంది. అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా ఇక్కడ భారీ మెజారిటీ సాధించాల‌ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి జ‌గ‌నే దిశానిర్దేశం చేయ‌డం.. ల‌క్ష్యంగా నిర్ణయించ‌డం తెలిసిందే. అంతేకాదు.. ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా మంత్రుల‌ను కేటాయించారు. అదేవిధంగా స‌ల‌హాదారుల‌ను కూడా కేటాయించారు. అయితే.. ఇంత చేసిన జ‌గ‌న్‌.. ఈ మొత్తం వ్యవ‌హారానికి ఇంచార్జ్‌గా చిత్తూరు జిల్లాకే చెందిన కీల‌క‌ మంత్రికి బాధ్యత అప్పగించారు. ఇదే ఇప్పుడు వైసీపీలో చ‌ర్చనీయాంశంగా మారింది.

అందరికీ బాధ్యతలను అప్పగించినా….

“అంద‌రికీ బాధ్యత అప్పగించారు. రేపు గెలిస్తే.. అంద‌రికీ క్రెడిట్ వ‌స్తుంద‌ని అనుకున్నాం. కానీ, సడెన్‌గా ఆయ‌న‌కు ఇంచార్జ్ బాధ్యత అప్పగించారు. ఇక‌, మాకు వ‌చ్చేదేంటి? శ్రమ త‌ప్ప!“ అని ఓ కీల‌క నాయ‌కుడు నిట్టూర్చారు. ఇక‌, తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిని దాదాపు ఈ ఎన్నిక‌ల నుంచి ప‌క్కన పెట్టార‌ని అంటున్నారు. ఆయ‌న ఎక్కడా క‌నిపించ‌డం లేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల‌లో ఒక‌రికి పూర్తిస్థాయి బాధ్యత‌లు అప్పగించ‌డంతో ఆయ‌నే అన్నీ చూసుకుంటున్నారు. నేత‌ల‌ను స‌మ‌న్వయం చేసుకోవ‌డంతోపాటు.. కార్యక‌ర్తల‌కు దిశానిర్దేశం చేయ‌డం వ‌ర‌కు కూడా అన్నీ ఆయ‌నే చూసుకుంటున్నారు.

ఐక్యత దెబ్బతీస్తుందని….

ఈ ప‌రిణామం.. పార్టీలో ఐక్యత‌ను దెబ్బతీసే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు వాపోతున్నారు. “నిన్న మొన్నటి వ‌ర‌కు ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వారు ప‌నిచేసుకున్నాం. ఇప్పుడు అంద‌రినీ క‌లిపి ఒకే బాధ్యత అప్పగించారు. ఇప్పుడు ఎవ‌రి మాట ఎవ‌రు వినాలి? అనేది కీల‌క స‌మ‌స్యగా మారింది. ఈ విష‌యంలో క్లారిటీ లేదు. రేపు ఎక్కడైనా.. త‌క్కువ మెజారిటీ వ‌స్తే.. మా ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రిని దీనికి బాధ్యుల‌ను చేస్తారు? ఎక్కువ మెజారిటీ వ‌స్తే.. ఇంచార్జ్ త‌న ఖాతాలో వేసుకుంటారు బాగానే ఉంది. కానీ, త‌క్కువ వ‌చ్చిన చోట ఎవ‌రు బాధ్యులు?“ అని ఆయ‌న ప్రశ్నించారు.

సమన్వయం కొరవడుతుందా?

ప్రస్తుతం ఇదే త‌ర‌హాలో నేత‌ల మ‌ధ్య తిరుప‌తి ఇంచార్జ్‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. విచిత్రం ఏంటంటే తిరుప‌తి పార్లమెంటు ప‌రిధిలో ఉన్న ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే అధిష్టానం, జిల్లా మంత్రుల‌పై గుస్సాతో ఉన్నారు. నెల్లూరు, చిత్తూరు రెండు జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. అయితే జ‌గ‌న్ మాత్రం వారి అభీష్టంతో సంబంధం లేకుండా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఏడుగురు మంత్రుల‌కు బాధ్యత‌ల‌ను ఇది ఎన్నిక‌ల ‌స‌మ‌యంలో వివాదాల‌కు, ఐక్యత‌ను దెబ్బతీసేందుకు దారితీస్తుందా ? అనేది చూడాలి.

Tags:    

Similar News