వైసీపీలో రాజుల యుద్ధం..ఒక్కరు కాదు.. ఏకంగా ఐదుగురు
అధికార వైసీపీలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే జనసేన గెలిచిన రాజోలులో అధికార పార్టీలో రాజులు చేస్తోన్న యుద్ధంతో [more]
;
అధికార వైసీపీలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే జనసేన గెలిచిన రాజోలులో అధికార పార్టీలో రాజులు చేస్తోన్న యుద్ధంతో [more]
అధికార వైసీపీలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే జనసేన గెలిచిన రాజోలులో అధికార పార్టీలో రాజులు చేస్తోన్న యుద్ధంతో అక్కడ రాజకీయం వేడెక్కగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలోనూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు రాజులు రాజకీయ ఆధిపత్యానికి తెరలేపారు. ఆ నియోజకవర్గంలో క్షత్రియ నేతలు తమ హవా నడవాలని.. తమ మాటే నెగ్గాలనే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. దీంతో సదరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఉండి. మిగిలిన ఒకటి రెండు నియోజకవర్గాల మాదిరిగానే ఇక్కడ కూడా క్షత్రియ నేతల ఆధిపత్యం ఎక్కువ. అయితే, ఓటు బ్యాంకు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున మంతెన రామరాజు విజయం సాధించారు. గత కొన్ని దశాబ్దాలుగా 2004 మినహా ఇక్కడ ఎప్పుడు టీడీపీ మినహా మరే పార్టీ గెలవలేదు.
ఒకరు కాదు ఇద్దరు కాదు…..
అయితే, పార్టీ అధికారంలోకి రాకపోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక్కడి క్షత్రియ నేతలు ఆధిపత్యం చలాయిస్తున్నారు. అయితే, ఒకరో ఇద్దరో అయితే.. ఫర్వాలేదు కానీ. ఏకంగా వైసీపీకి చెందిన ఐదుగురు క్షత్రియ నేతలు చక్రం తిప్పుతుండడంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఉండి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న పీవీఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యే సర్రాజులు ఎవరికివారే ఆధిపత్యం చలాయిస్తున్నారు. పీవీఎల్ అయితే.. అనధికార ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. ప్రతి పనినీ తనకే చెప్పి చేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కూడా నేనేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు కూడా ఇక్కడ బలమైన వర్గం ఉండడంతో తాను చెప్పిందే జరగాలని అధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు చేస్తున్నారు.
మంత్రి దృష్టి కూడా….
అయితే, విషయం ఈ ఇద్దరితోనే అయిపోలేదు. జిల్లాకు చెందిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా ఇక్కడే చక్రం తిప్పుతున్నారు. వాస్తవానికి ఆయన నియోజకవర్గం ఆచంట. అయితే, ఆయన స్వగ్రామం ఉండిలో ఉండడంతో ఇక్కడే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఏదో ఒక పనిపై ఇక్కడికి రావడం అధికారులను తన కనుసన్నల్లో పనిచేయించు కోవడం పరిపాటిగా మారింది. ఇదిలావుంటే, ఈ నియోజకవర్గంపై ఆశ పెట్టుకున్న మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుమారుడు రామరాజు ఇప్పుడు వైసీపీలోనే ఉండడంతో ఆయన కూడా ఇక్కడ తనదై న శైలిలో చక్రం తిప్పుతున్నారు. పైగా రామరాజు ప్రస్తుతం నరసాపురం పార్లమెంటరీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన నరసాపురం ఎంపీ లేదా ఉండి సీటుపై కన్నేసి ఉంచారు.
రఘురామ కూడా …..
అదే సమయంలో గంగరాజు సోదరుడు నరసింహరాజు కూడా వైసీపీలోనే ఉన్నారు. దీంతో ఆయన కూడా తమ వర్గం ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఒక నియోజకవర్గంలో ఐదుగురు క్షత్రియుల పోరు.. అన్నట్టుగా తయారైంది. వీరే కాకుండా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటోన్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు సైతం ఇక్కడ పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని మెయింటైన్ చేసుకుంటూనే వస్తున్నారు. సరే! ఈ విషయం అధిష్టానం వరకు రాలేదా? అంటే వచ్చింది. మంత్రులు కూడా పరిశీలించారు. కానీ, ఎటూ చెప్పలేక మౌనం పాటిస్తున్నారు.
అధిష్టానం జోక్యం చేసుకున్నా…..
గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ వైవి. సుబ్బారెడ్డి పలుమార్లు చెప్పినా ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. పార్టీ ఇద్దరు నేతల మధ్య వార్ అంటే ఎవరో ఒకరిపై చర్యలు తీసుకోవచ్చు… ఏకంగా నలుగురైదుగురు నేతలు ఇక్కడ అనధికారిక ఎమ్మెల్యేలుగా ఉండడంతో ఎవ్వరిని వదులుకునే పరిస్థితి లేదు. దీంతో ఉండి రాజకీయాలు రసవత్తరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీ నాయకుడు రామరాజు.. వీరి ధాటికి ఏం చేయాలో అర్ధం కాక.. తలపట్టుకుంటున్నారట. ఇదీ సంగతి..!