వైసీపీకి మరో అగ్ని పరీక్ష…?

వైసీపీతో విశాఖ రాజకీయం ఆటలాడుతూనే ఉంది. దాదాపుగా వంద వరకూ ఉన్న వార్డుల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వైసీపీ పరం అవుతాయని గత ఏడాది అనుకున్నారు. [more]

;

Update: 2021-04-18 02:00 GMT

వైసీపీతో విశాఖ రాజకీయం ఆటలాడుతూనే ఉంది. దాదాపుగా వంద వరకూ ఉన్న వార్డుల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వైసీపీ పరం అవుతాయని గత ఏడాది అనుకున్నారు. కానీ సడెన్ గా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కాలంలో సీన్ మొత్తం మారిపోయింది. మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 98 వార్డులకు గానూ 58 సీట్లతో వైసీపీ మేయర్ సీటుని గెలుచుకుంది. ఇలా గెలుచుకుందో లేదో అలా ఒక కార్పోరేటర్ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడింది.

స్వల్ప మెజారిటీతో…?

ఇక వైసీపీకి చెందిన 61వ వార్డు కార్పోరేటర్ దాడి సూర్యకుమారి హఠాత్తుగా మరణించారు. ఆమె ప్రమాణం చేసి వచ్చిన రెండు రోజులకే ఈ లోకాన్ని వీడారు. ఇపుడు ఆ సీట్లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. సూర్యకుమారి గెలిచింది కూడా టఫ్ కాంపిటేషన్ మీద. కేవలం 500 ఓట్ల తేడాతోనే ఆమె కార్పోరేటర్ అయ్యారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. దాంతో పాటుగా వామపక్షాలు కూడా గట్టిగానే ఉన్నాయి. దాంతో మొత్తానికి ఏదో విధంగా వైసీపీ బయటపడింది. అలాటి సీట్లో ఇపుడు ఉప ఎన్నిక ఖాయంగా ఉంది.

ఉక్కు సెగతోనే…?

నిజానికి ఇక్కడ వైసీపీకి మంచి బలం ఉండేది. కానీ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నేపధ్యంలో కేంద్రం మీద ఉన్న కోపం కాస్తా ఏపీ సర్కార్ మీద పడుతోంది. టీడీపీ నాయకులు సైతం బీజేపీతో లాలూచీ పడి వైసీపీ సర్కార్ ఉక్కు ప్రైవెటీకరణ మీద నోరెత్తడంలేదని దారుణంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో టీడీపీ గెలుపు అంచుల దాకా వచ్చేసింది. అదే సమయంలో వైసీపీ బొటా బొటీ మెజారిటీతో గెలుచుకుంది. ఇపుడు అక్కడ కనుక ఉప ఎన్నిక జరిగితే వైసీపీ ఫేట్ ఎలా మారుతుందో అన్న టెన్షన్ పార్టీ నేతలకు పట్టుకుంది.

అసంతృప్తి అలా…?

ఇక విశాఖ మేయర్ విషయంలో జగన్ చేసిన ప్రయోగం ఆశావహులకు పెద్దగా నచ్చలేదు అంటున్నారు. పేరున్న నోరున్న నాయకులు తమ ఇంటి వారిని కార్పోరేటర్లను చేశారు వారిని మేయర్ గానో డిప్యూటీ మేయర్ గానో చూడాలనుకున్నారు. కానీ పెద్దగా రాజకీయంగా పలుకుబడి లేని గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ చేయడంతో వారంతా ఖంగు తిన్నారు. ఇక మేయర్ కోసమే 21వ వార్డు నుంచి కార్పోరేటర్ గా పోటీ చేసిన వంశీ అయితే తన పదవికి రాజీనామా చేస్తాను అంటున్నారు. ఇపుడు జీవీఎంలో మ్యాజిక్ ఫిగర్ కంటే పది సీట్లు మాత్రమే వైసీపీకి ఎక్కువగా వచ్చాయి. అందులో ఒకరు చనిపొవడం, మిగిలిన వారిలో అసంతృప్తి మొదలుకావడం ఈ మొత్తం ప్రభావం మేయర్ సీటుకు ఎసరు తే‌దు కదా అన్న చర్చ అయితే సొంత పార్టీ పెద్దలలో ఉంది.

Tags:    

Similar News