అక్కడ వైసీపీపై ఆశ‌లు చెదిరిపోయాయ్‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోటే. పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ పార్టీకి జిల్లా ప్రజ‌లు ప‌ట్టం క‌డుతూ వ‌చ్చారు. ఎన్టీఆర్ పార్టీ [more]

;

Update: 2020-12-27 13:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోటే. పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ పార్టీకి జిల్లా ప్రజ‌లు ప‌ట్టం క‌డుతూ వ‌చ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు ఇక్కడ అన్ని స్థానాలు స్వీప్ చేసిన టీడీపీ 1994లో అన్ని సీట్లు గెలిచింది. 1999లో కొవ్వూరు మిన‌హా అన్ని చోట్లా గెలిచిన సైకిల్ పార్టీ 2015లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో 15కు 15 సీట్లలో గెలిచింది. పాక్షికంగా జిల్లాలో ఉన్న రాజ‌మ‌హేంద్రవ‌రం సీటుతో క‌లుపుకుని మూడు ఎంపీ సీట్లు గెలిచింది. అలాంటి కంచుకోట‌లో తొలిసారిగా గ‌త ఎన్నిక‌ల్లో సై ‘ కిల్ ‘ అయిపోయింది. ప‌శ్చిమ ప్రజ‌లు టీడీపీని రెండు సీట్లకు ప‌రిమితం చేశారు. మూడున్నర ద‌శాబ్దాల్లో టీడీపీకి ఈ జిల్లాలో ఇదే ఘోర ప‌రాభ‌వం.

ఏడాదిన్నరలోనే…..

వైసీపీకి తిరుగులేని మెజార్టీని క‌ట్టబెట్టిన ఈ జిల్లాలో ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన యేడాదిన్నర కాలంలోనే ప‌శ్చిమ ప్రజ‌ల మ‌న‌స్సు మారుతోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వ‌ర్గాల‌కు మాత్రమే మేళ్లు జ‌రిగాయ‌న్న టాక్ ఎక్కువ రావ‌డంతో జ‌నాలు మార్పు కోరుకుని వైసీపీ అభ్యర్థుల‌ను భారీ మెజార్టీల‌తో గెలిపించారు. ప్రత్యేకించి టీడీపీ కంచుకోట‌లు బ‌ద్దల‌య్యాయి. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల అడ్రస్ ఎక్కడా ? అని వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. గ‌త ఆరేడు నెల‌లుగా క‌రోనా కొంత సాకుగా ఉన్నా అస‌లు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో చిన్నాచిత‌కా అభివృద్ధి ప‌నులు కూడా జ‌ర‌గ‌ని ప‌రిస్థితి.

ఎమ్మెల్యేలు అందుబాటులో లేక…

ఏదో ప్రభుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలు ఎమ్మెల్యేల‌తో సంబంధం లేకుండా ప్రజ‌ల‌కు అందుతున్నాయి. అవి మిన‌హాయిస్తే ఏ నియోజ‌క‌వ‌ర్గంలో చూసినా చెప్పుకోద‌గ్గ ఒక్క అభివృద్ధీ లేదు. ఇటీవ‌ల కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం ప్రజ‌ల‌కు ఏం చెప్పుకోవాలో తెలియ‌క శంకుస్థాప‌న‌లు చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రధాన ర‌హ‌దారులు.. ఇంకా చెప్పాలంటే జిల్లా, రాష్ట్ర ర‌హ‌దారుల ప‌రిస్థితి ఘోరంగా ఉంది. ప్రజ‌లు రోడ్ల మీద‌కు వ‌స్తే సేఫ్‌గా ఇంటికి వెళ‌తార‌న్న గ్యారెంటీ లేకుండా పోయింది. అస‌లు వైసీపీ ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గాల ప్రజ‌ల‌కు అందుబాటులోనే ఉండ‌డం లేదు.

చాప కింద నీరులా…..

గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజ‌ల్లో ఉండ‌డ‌మో లేదా.. త‌మ క్యాంప్ కార్యాల‌యాల్లో అయినా ఉండ‌డ‌మో చేసేవారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజ‌ల్లోకి రావ‌డం లేదు స‌రిక‌దా.. క‌నీసం క్యాంప్ కార్యాల‌యాల్లో సొంత కేడ‌ర్‌కు దొర‌క‌ని ప‌రిస్థితి. ఇటు ఎమ్మెల్యేల్లో ఒక‌రిద్దరు మిన‌హా జ‌గ‌న్ ద‌గ్గర ఎవ్వరికి ప్రయార్టీ లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇటు జ‌ల్లో వైసీపీపై చాప‌కింద నీరులా వ్యతిరేక‌త ప్రారంభ‌మైంది.

పోల‌వ‌రం, అమ‌రావ‌తి ఎఫెక్ట్ త‌ప్పదా..?

జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణయంపై ప్రజాభిప్రాయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నా ప‌శ్చిమ ప్రజ‌ల‌కు అమ‌రావ‌తితో అనుబంధం ఎక్కువుగా ఉన్న నేప‌థ్యంలో అంద‌రు ప్రజ‌ల్లో కాక‌పోయినా ఉన్నత‌, విద్యా, మేథావి వ‌ర్గాల్లో మాత్రం వైసీపీపై తీవ్ర అసంతృప్తి ఉంది. అమ‌రావ‌తి వికేంద్రీక‌ర‌ణ ప్రభావంతో ప‌శ్చిమ‌లో చాలా వ్యాపారాలు డ‌ల్ అయ్యాయి. ఇక ప్రతిష్టాత్మక‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప్రభుత్వం నాన్చుడి ధోర‌ణి జిల్లా ప్రజ‌ల‌కు ప్రాజెక్టు పూర్తవుతుంద‌న్న న‌మ్మకం పోయేలా చేసింది. ఈ రెండు కార‌ణాలు కూడా వైసీపీ ప్రభుత్వంపై న‌మ్మకం స‌న్నగిల్లడానికి రెండు ముఖ్య కార‌ణాలు.

మంత్రుల‌తోనూ ఉప‌యోగం లేదా ?

సాధార‌ణంగా స‌మ‌ర్థులు అయిన మంత్రులు ఉంటే జిల్లాలో పాల‌న ప‌రుగులు పెట్టడ‌మో లేదా పార్టీ ప‌టిష్టం అవ్వడ‌మో జ‌రుగుతుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వీరితో జిల్లాకు ఎంత మాత్రం ఉప‌యోగం లేద‌ని వైసీపీ నేత‌లే చెపుతోన్న మాట‌. తానేటి వ‌నిత అస‌లు మంత్రిగా ఉన్నారా ? అన్న సందేహాలు స‌ర్వత్రా వ్యక్తమ‌వుతున్నాయి. ఇక చెరుకువాడ రంగ‌నాథ రాజు ఆయ‌న రాజ‌కీయ ఆధిప‌త్యం కోస‌మే ఇప్పటి వ‌ర‌కు కాలం గ‌డిపేశారు. పైగా మ‌రో 9 నెల‌ల్లో జ‌రిగే ప్రక్షాళ‌న‌లో ఆయ‌న్ను త‌ప్పిస్తార‌ని ఆయ‌న‌కే తెలిసిపోయింద‌ని.. అందుకే ఆయ‌న యాక్టింగ్ మంత్రిగా మిగిలిపోవ‌డ‌మే త‌ప్ప క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో కూడా త‌న ముద్ర వేయ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శలు మూట‌క‌ట్టుకుంటున్నారు.

మంత్రులు ఉన్నా…

వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం చెరుకువాడ‌కు ప‌లుమార్లు అన్నా నీ లాంటి సీనియ‌ర్ పార్టీకి ఉపయోగ ప‌డ‌డంతో పాటు ప్రభుత్వ ప‌రంగా నీ ముద్ర వేయాల‌ని ప‌దే ప‌దే చెప్పినా ఆయ‌న మాత్రం త‌న దారి త‌న‌దే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక మ‌రో మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా ఆయ‌న‌పై ఉన్న అంచ‌నాలు ఏ మాత్రం అందుకోలేదు. పైగా ఆయ‌న శాఖ చుట్టూనో లేదా, నియోజ‌క‌వ‌ర్గంలోనో ఏదో స‌మ‌స్య రావ‌డం.. దానిని ప‌రిష్కారంలో ఆయ‌న చొర‌వ చూప‌క‌పోవ‌డం కూడా ఆయ‌న‌కు ఎదురు దెబ్బే అవుతోంది.

రాజుగారి ఎఫెక్ట్….

ఇక న‌ర‌సాపురం నుంచి గెలిచిన వైసీపీ అసంతృప్త ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు వ్యవ‌హారం కూడా పార్టీని డిస్టర్బ్ చేసింది. ఇక కొన్ని సామాజిక వ‌ర్గాలు.. ప్రత్యేకించి ఓ సామాజిక వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యేల ఆధిప‌త్యం జిల్లాలో ఉండ‌డంతో మిగిలిన వ‌ర్గాలు ర‌గులుతోన్న ప‌రిస్థితి. ఎన్నో ఆశ‌ల‌తో వైసీపీకి ఓట్లేసిన ప‌శ్చిమ ఓట‌ర్ల ఆశ‌లు ఫ‌లించ‌క‌పోవ‌డంతో వారి ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తోంది. మ‌రి ఇక‌పై అయినా వైసీపీ ప‌శ్చిమ అభివృద్ధిలో ముద్ర వేస్తుందో ? లేదో ? చూడాలి.

Tags:    

Similar News