పాలనా రాజధాని పరువు తీస్తున్నదెవరు… ?

ఏపీకి రాజధాని లేదు అని బయట వారు చేస్తున్న ఎకసెక్కాలు ఎటూ ఉన్నాయి. ఇక అమరావతి రాజధాని ఉన్నా లేనట్లుగానే పరిస్థితి ఉంది. అక్కడే కొలువు తీరి [more]

;

Update: 2021-06-09 11:00 GMT

ఏపీకి రాజధాని లేదు అని బయట వారు చేస్తున్న ఎకసెక్కాలు ఎటూ ఉన్నాయి. ఇక అమరావతి రాజధాని ఉన్నా లేనట్లుగానే పరిస్థితి ఉంది. అక్కడే కొలువు తీరి రాజ్యం చేస్తున్న పాలకులు దాన్ని శ్మశానంతో పోల్చాక ఇక వేరేగా చెప్పేది ఏముంటుంది. సరే మూడు రాజధానుల కాన్సెప్ట్ బ్రహ్మాండంగా వెలిగిపోతోందా అంటే అదీ లేదు. ఆ చట్టం ఇపుడు కోర్టులో న్యాయ విచారణ దశలో ఉంది. ఇక విశాఖను పాలనారాజధాని అంటూ తరచూ వైసీపీ నేతలు చెబుతూండడంతో దానికి మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతోందని అంటున్నారు. విపక్షాలు సైతం ఫోకస్ పెట్టి ప్రతీ చిన్న ఘటనను భూతద్దంతో చూపిస్తూ వైసీపీ పరువు తీశామనుకుంటున్నారు కానీ విశాఖ పరువే టోటల్ గా పోతోంది అని ఎవరూ తెలుసుకోవడంలేదు.

అతి చేస్తున్నారుగా…?

ఏపీలో మధ్యాహ్నం తరువాత కర్ఫ్యూ అమలవుతోంది. పాస్ ఉన్న వారిని మాత్రం అనుమతిస్తున్నారు. ఇక ఆసుపత్రులలో పనిచేస్తున్న వారికి, ఇతర విధులలో ఉన్న వారికి మినహాయింపు ఉంది. అయితే నర్స్ గా పనిచేస్తున్న ఒక యువతి విషయంలో విశాఖ పోలీసులు చేసిన అతి ఇపుడు పాలనా రాజధాని పరువు మొత్తం తీస్తోంది అంటున్నారు. ఆమెను పికప్ చేసుకునేందుకు వచ్చిన యువకుడికి పాస్ లేదంటూ అపరాధ రుసుమును పోలీసులు విధించారు. అది కాస్తా పెద్దదై ఆ యువతి మీద పోలీసులు అన్యాయంగా జులుం చేశారన్నది మాత్రం బయటకు వచ్చింది. నిజానికి ఇది చాలా చిన్న విషయం. కానీ దాన్ని చిలికి చిలికి గాలివానగా చేసి ఏపీ సర్కార్ పరువు పోగొట్టేలా విశాఖ పోలీసులు వ్యవహరించారు అనే చెప్పాలి.

ఇదేనా సమయం…?

ఇక విశాఖలో మానసిక వికలాంగ బాలల కోసం ఏర్పాటు చేసిన ఒక పాఠశాలను హఠాత్తుగా కూల్చేసి జీవీఎంసీ అధికారులు తమ దూకుడు ఏంటో చూపించారు. అది కూడా కరోనా వేళ రాంగ్ టైమింగ్ లో చేసి వైసీపీ సర్కార్ కి కొత్త తలనొప్పులు తెచ్చారు నిజానికి అది జీవీఎంసీ వారి స్థలమే. లీజుకు ఇచ్చారు. లీజుదారునికి ఏ బాధా లేకుండా వేరే చోట ఆల్టర్నేషన్ చూపించాలన్న ఆలోచన కూడా ఉంది. కానీ ఇక్కడా అతి చేయడం వల్లనే వ్యవహారం ముదిరి ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు ఘటనలలో న్యాయం చట్టం సన్నని రేఖను దాటడం వల్లనే ఇంతటి రచ్చ అవుతోంది.

గోటితో పోయే దానికి…?

ఏపీలో జగన్ ఏలుబడిలో ఎలా ఉంది అంటే అధికారులు ఇష్టారాజ్యం అన్న మాటే జనం నుంచి వినిపిస్తోంది. ఒక విధంగా అధికారులకు స్వేచ్చ ఎక్కువ అయిందా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ నేతలు కూడా అధికారులను ముందు పెట్టి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు అన్నదీ ఉంది. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని బూతద్దంలో పెట్టి రచ్చ చేయడానికి విపక్ష తెలుగుదేశం, దాని అనుకూల మీడియా ఉన్నాయన్న స్పృహ ఏ మాత్రం ఉన్నా వైసీపీ నేతలు స్మూత్ గా డీల్ చేసేవారు. కానీ మొరటుగా ముందుకు పోవడం వల్ల ఇవన్నీ కూడా జగన్ ఖాతాలో పడిపోతున్నాయి. జగన్ ఏలుబడిలో విశాఖలో నిన్న మత్తు డాక్టర్ సుధాకర్, నేడు ఒక దళిత యువతి అంటూ టీడీపీ బురద జల్లుతోంది అంటే ఆ కంపు అంతా చేసుకున్నది ఎవరు అన్నది ఆలోచించాలిగా.

Tags:    

Similar News