వైసీపీలో హ్యాపీ డేస్… జగన్ ఎదుటకు వచ్చేందుకు?

మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. తమ టార్గెట్ రీచ్ అయ్యామని సంబరపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ జగన్ ఎమ్మెల్యేలకు లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి [more]

Update: 2021-03-03 03:30 GMT

మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. తమ టార్గెట్ రీచ్ అయ్యామని సంబరపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ జగన్ ఎమ్మెల్యేలకు లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలు శక్తివంచన లేకుండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడి పనిచేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు తోడు ఎమ్మెల్యేల కసరత్తు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించడానికి కారణమయిందని చెప్పాలి.

80 శాతం పంచాయతీలను….

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో నలుగురు టీడీపీ నుంచి వచ్చి మద్దతుదారులుగా ఉన్నారు. దాదాపు పదమూడు జిల్లాల్లోనూ వైసీపీదే పై చేయి అయింది. 80 శాతం పంచాయతీలను రాబట్టుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఏ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతమంది మద్దతుదారులు గెలిచిన దాఖలాలు లేవు. అధికార పార్టీకి కొంత అనుకూలత ఉంటుందని భావించినా పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని చెప్పక తప్పదు.

టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట కూడా….

ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట కూడా అత్యధిక స్థానాలను చేజిక్కించుకోవడంపై జగన్ అక్కడి ఇన్ ఛార్జులను ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. విశాఖ జిల్లా వంటి చోట్ల కొంత పార్టీకి ఇబ్బందిగా మారింది. మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినా దానిని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు సక్రమంగా వినియోగించుకోలేకోయారని జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

వన్ సైడ్ విజయాలతో….

చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు తదితర జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విజయాలను సాధించింది. ఇక మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్ని మున్సిపాలిటీలను, కొర్పొరేషన్లను గెలిచి తీరాల్సిందేనని జగన్ మరోమారు లక్ష్యాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులకు విధించినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న వైసీపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయిపోయారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు వచ్చి తమను అధినేతకు దగ్గర చేశాయని ఎమ్మెల్యేలు సంబరపడి పోతున్నారు.

Tags:    

Similar News