వీళ్లంతా జస్ట్… సింగిల్ టైం ఎమ్మెల్యేలేనా?

ఏపీలోని గుంటూరు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ రెండు అసెంబ్లీ సీట్లు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం సాధించింది. జిల్లాలో రెండు ఎంపీ సీట్లు కూడా [more]

;

Update: 2020-10-26 06:30 GMT

ఏపీలోని గుంటూరు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ రెండు అసెంబ్లీ సీట్లు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం సాధించింది. జిల్లాలో రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. వైసీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల‌కు తోడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు సైతం వైసీపీ సానుభూతిప‌రుడిగా మారిపోయారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎమ్మెల్యేల్లో మాచ‌ర్ల ఎమ్మెల్యే రామ‌కృష్ణా రెడ్డి వ‌రుస‌గా నాలుగోసారి, న‌రాస‌రావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, బాప‌ట్లలో కోన ర‌ఘుప‌తి, గుంటూరు తూర్పులో ముస్తఫా మాత్రం రెండేసి సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో అంబ‌టి 1989లోనే తొలిసారి ఎమ్మెల్యేగా అవ్వగా.. చాలా ఏళ్ల త‌ర్వాత గ‌తేడాది రెండోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇక హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత మూడు సార్లు గెల‌వ‌గా, మంగ‌ళ‌గిరిలో ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి కూడా రెండోసారే గెలిచారు.

ఐదుగురు ఎమ్మెల్యేలు…

మిగిలిన ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఎమ్మెల్యేల ప‌నితీరుపై యేడాదిన్నర‌కే నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తరేక‌త‌, అస‌మ్మతి, అసంతృప్తి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. వీరంతా కేవ‌లం సింగిల్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతార‌న్న చ‌ర్చలు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. జిల్లాలో ముగ్గురు మ‌హిళా ఎమ్మెల్యేల్లో హోం మంత్రి సుచ‌రిత ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళుతున్నారు. పైగా మంత్రిగా కూడా ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంపై ఆమెకు మ‌రింత గ్రిప్ పెరిగింది. ఇప్పటి వ‌ర‌కు ఆమె గురించి నియోజ‌క‌వ‌ర్గంలో వివాదాలు లేవు. మ‌రో ఇద్దరు మ‌హిళా ఎమ్మెల్యేలుగా ఉన్న చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, తాడికొండ ఎమ్మెల్యే వుండ‌వ‌ల్లి శ్రీదేవి ఇద్దరూ త‌ర‌చూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నారు.

ఎవరితోనూ పడకపోవడంతో….

పైగా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే బ‌ల‌మైన వ‌ర్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వీరిద్దరు అస‌మ్మతుల‌ను చ‌ల్లార్చుకునే ప్రయ‌త్నాలు కూడా చేయ‌డం లేదు. ర‌జ‌నీకి సొంత పార్టీ నేత‌తో పాటు ఎంపీ లావుతోనూ ప‌డ‌దు. ఇటు శ్రీదేవికి మాజీ మంత్రి డొక్కాతోనూ, బాప‌ట్ల ఎంపీ సురేష్‌తోనూ ప‌డ‌డం లేదు. ఈ క్రమంలోనే వీరిపై వ్యతిరేక‌త రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక పొన్నూరు ఎమ్మెల్యే కిలారో రోశ‌య్యపై అటు కేడ‌ర్‌లో వ్యతిరేక‌త‌తో పాటు అనేకానేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి తీవ్రంగా ఉంద‌న్న వార్తల‌తో ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వ‌స్తుంద‌ని జిల్లా రాజ‌కీయాల్లో ప్రచారం జ‌రుగుతోంది.

కొన్ని సామాజిక వర్గాలకు…

తెనాలి ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ దూకుడు రాజ‌కీయాలు, దుందుడుకు వ్యాఖ్యల‌తో కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు దూరం కావ‌డం, భూసేక‌ర‌ణ‌, ఇసుక ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఎక్కువుగా వ‌స్తున్నాయి. జ‌గ‌న్ గాలిలో గెల‌వ‌డ‌మే కాని మాజీ మంత్రి ఆల‌పాటి రాజాను ఎదుర్కొనే రాజ‌కీయ వ్యూహాలే ఆయ‌న ద‌గ్గర లేవ‌ని సొంత పార్టీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక గురజాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి సైతం తీవ్రమైన వ్యతిరేక‌త‌తో పాటు ప‌లు అవినీతి, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. కాసు మ‌హేష్‌రెడ్డిపై ఇక్కడ సామాన్య జ‌నాల్లోనే తీవ్రమైన వ్యతిరేక‌త క‌నిపిస్తోంది.

వీరంతా నియోజకవర్గాల్లో….

ఇక మిగిలిన వారిలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే నంబూరు శంక‌ర‌రావు సైలెంట్‌గా త‌మ ప‌నులు తాము చేసుకుంటున్నారు. శంక‌ర‌రావుపై పెద్దగా ఆరోప‌ణ‌లు లేక‌పోయినా వినుకొండ‌లో టీడీపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవి. ఆంజ‌నేయులు ఉండ‌డంతో హ‌డావిడి ఎక్కువుగా క‌నిపిస్తోంది. అయితే జీవీని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే బ్రహ్మానాయుడు మ‌రింత‌గా క‌ష్టప‌డాలి. పైగా ఎంపీ లావు మాజీ ఎమ్మెల్యే మ‌క్కెన‌కు స‌పోర్ట్ చేయ‌డం కూడా బ్రహ్మానాయుడును ఇబ్బంది పెడుతోంది. ఇక వేమూరులో మేరుగ నాగార్జున జ‌స్ట్ ఓకే అనిపిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచి పార్టీని వీడిన‌ ప‌శ్చిమ ఎమ్మెల్యే గిరి కూడా సింగిల్ టైం ఎమ్మెల్యేయే అన్న చ‌ర్చలు న‌గ‌రంలో న‌డుస్తున్నాయి.

Tags:    

Similar News