ఖాళీ భూమి క‌నిపిస్తే.. ఆ వైసీపీ ఎమ్మెల్యే తీరిది

ఏపీలో చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై స‌ర్వత్రా విమ‌ర్శలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌దేళ్ల పాటు ఎన్నో క‌ష్టన‌ష్టాల కోర్చి ఎమ్మెల్యేలు అయిన వారు చాలా [more]

Update: 2020-11-28 11:00 GMT

ఏపీలో చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై స‌ర్వత్రా విమ‌ర్శలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌దేళ్ల పాటు ఎన్నో క‌ష్టన‌ష్టాల కోర్చి ఎమ్మెల్యేలు అయిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో చాలా మందికి మంత్రి ప‌ద‌వులు, ఇత‌ర‌త్రా ప‌ద‌వులు రాలేదు. అటు ఆదాయం కూడా లేదు.. సీనియ‌ర్లుగా తాము అడిగిన ప‌నుల‌కు సీఎం నుంచి స్పంద‌న కూడా ఉండ‌డం లేదు. దీంతో చాలా మంది సంపాద‌న‌కు అక్రమ మార్గాలు ఎంచుకున్నారు. ఈ లిస్టులో చాలా మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనే వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు త‌మ తీరు త‌మ‌దే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఎక్కడిక‌క్కడ భూక‌బ్జాలు.. దందాలు సాగిస్తున్నార‌నే విమ‌ర్శలు జోరందుకున్నాయి.

వరసగా పార్టీలు మారి…..

ముఖ్యంగా క‌డ‌ప‌లో కీల‌క‌మైన ఓ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ద‌రు ఎమ్మెల్యే, ఆయ‌న బంధువుల‌ దూకుడు మ‌రింత‌గా ఉంద‌ని సొంత వైసీపీ నేత‌లే గ‌గ్గోలు పెడుతున్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే తాలూకు మ‌నుషులు, ఆయ‌న బంధువులు.. సొంత సోద‌రులు కూడా చిన్న స్థలం క‌నిపిస్తే పాపం.. అన్నట్టుగా భూక‌బ్జాల‌కు ఒడిగ‌డుతున్నారనే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా పార్టీలు మారి మ‌రీ గెలిచిన ఎమ్మెల్యే గ‌త చంద్రబాబు హ‌యాంలోనూ చక్రం తిప్పార‌ని.. అందిన కాడికి దండుకున్నార‌నే ప్రచారం ఉంది.

బాబు పక్కన పెట్టడంతో….

ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు ఆయ‌న‌ను ప‌క్కన పెట్టార‌నే టాక్ వినిపించింది. అయినా.. ఆయ‌న మార‌లేదు. స‌రిక‌దా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్ సునామీలో విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న బుద్ధి ఇక్కడ కూడా మార‌లేద‌ని నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు గుస‌గుస‌లాడుతున్నారు. ఆయ‌న వ్యవ‌హార శైలిపై రోజుకో ర‌కంగా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న అనుచ‌రులు, సోద‌రులు.. ఖాళీ భూములు క‌నిపిస్తే చాల‌న్నట్టుగా క‌బ్జాలకు పాల్పడుతున్నార‌ని అంటున్నారు స్థానికులు. మొత్తం మూడు మండ‌లాల్లో వీరు ఆక్రమ‌ణ‌లు, దౌర్జన్యాలు.. క‌బ్జాలు పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు.

రాత్రికి రాత్రే….

ఒక మండ‌లంలో ఒక ర‌కంగా.. మ‌రో మండ‌లంలో మ‌రో ర‌కంగా ఇలా మొత్తం మూడు మండ‌లాల్లోనూ వారురెచ్చిపోతున్నార‌ని చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాల మ‌ధ్యలో సాధార‌ణ ప్రజ‌ల భూములు ఉన్నా కూడా వాళ్లను బెదిరించి మ‌రీ భూములు క‌బ్జా చేసేస్తున్నారు. గిరిజ‌నులు, ఎస్సీల భూముల‌తో పాటు చివ‌ర‌కు జ‌ర్నలిస్టుల‌కు ఇచ్చిన భూముల‌ను కూడా అనేక కార‌ణాల‌తో స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవ‌హారంలో స‌ద‌రు ఎమ్మెల్యే సోద‌రుడిదే కీల‌క పాత్ర అని చెపుతున్నారు. భూములు అన్నీ రాత్రికి రాత్రే ఆన్‌లైన్ విక్రయాలు జరిగిపోతున్నాయి.

నిబంధనలను పక్కన పెట్టి…..

ఈ క్రమంలో నిబంధ‌న‌లు ఉన్నా.. పేద‌లు త‌మ భూముల‌కు ప‌ట్టాలున్నాయ‌ని మొర పెడుతున్నా ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు. అధికారులు సైతం.. వీరి ఆగ‌డాల‌కు దాసోహం అంటున్నార‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకునే నాధుడు ఎవ‌రని ఇక్కడి ప్రజ‌లు గ‌గ్గోలు పెడుతుండ‌డం, సాహసం చేసి ఈ క‌బ్జాల‌ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పడం చూస్తే.. ఏరేంజ్‌లో ఇక్కడ భూక‌బ్జాలు సాగుతున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News