ఇక జగన్ అడ్డా.. ఇక ఇదే..!

రెండు నెలల్లో ఎన్నికలు జరుగనుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వలసల రాజకీయం మొదలైంది. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీలోకి మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ [more]

;

Update: 2019-02-27 01:30 GMT

రెండు నెలల్లో ఎన్నికలు జరుగనుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వలసల రాజకీయం మొదలైంది. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీలోకి మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ చేరిపోయారు. ఇక, రేపోమాపో మరో మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరిక ఖాయమైంది. వీరితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి. వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక, ఇవాళటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ చేరికలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల లండన్ పర్యటన నుంచి జగన్ తిరిగి రావడంతో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు కూడా వేగం పుంజుకోనున్నాయి.

విమర్శలకు ఇక చెక్…

వారం క్రితం వరకు రోజుకొక నేత చొప్పున టీడీపీ, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుని జగన్ జోరు చూపించారు. సరైన అభ్యర్థులు లేని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ నుంచి బలమైన వారిని చేర్చుకుని వారిని ఎన్నికల్లో నిలబెట్టేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఇందు భాగంగానే పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. కాగా, జగన్ విదేశీ పర్యటనతో చేరికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. నిన్న జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళటి నుంచి మళ్లీ చేరకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పలువురు నేతలను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరిపాయి. జగన్ సమక్షంలో వారిని పార్టీలో చేర్పించనున్నారు. ఇక, హైదరాబాద్ లో కూర్చొని జగన్ రాజకీయాలు చేస్తున్నారు అని టీడీపీ చేస్తున్న విమర్శలకు కూడా జగన్ చెక్ పెట్టనున్నారు. ఇవాళ అమరావతిలో నిర్మించుకున్న నూతన ఇంట్లోకి ఆయన గృహప్రవేశం చేయనున్నారు. పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.

కొత్త కార్యాలయంలో చేరికలు…

కొత్త కార్యాలయంలో మొదటి రోజు నుంచే చేరికలు ఉండనున్నాయి. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇవాళ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. రేపు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక, జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న ఎంపీ తోట నరసింహంతోనూ వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. జగ్గంపేట టిక్కెట్ హామీ లభిస్తే ఆయన కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీలో ఇంతకాలం నిబద్ధతగా ఉన్న గౌరు దంపతులు పార్టీ వీడితే మాత్రం వైసీపీకి నష్టం కలిగించే అవకాశం ఉంది.

Tags:    

Similar News