పక్కా ప్లాన్ తో….. వైఎస్ జగన్..!

గత ఎన్నికల్లో విజయం పక్కా అనుకున్న సమయంలో ప్రతిపక్షానికి పరిమితమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి మాత్రం గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. కచ్చితంగా తమదే [more]

Update: 2019-05-10 03:30 GMT

గత ఎన్నికల్లో విజయం పక్కా అనుకున్న సమయంలో ప్రతిపక్షానికి పరిమితమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి మాత్రం గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. కచ్చితంగా తమదే ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. అయితే, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఎన్నికలు జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకూ సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు మాత్రం యాక్టీవ్ అవుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఆయన పూర్తిగా పార్టీ నాయకులతోనే ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 19వ తేదీ నుంచి ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు జగన్ ఎలా వ్యవహరించాలో పక్కా ప్లాన్ చేసుకున్నారంట. ఈ నెల 19వ తేదీన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్న జగన్ వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

ఎమ్మెల్యే అభ్యర్థులు చేజారకుండా

గెలుపుపై ఎంత ధీమాగా ఉన్నా గత ఎన్నికల అనుభవంతో లోలోన వైసీపీ నేతలకు కూడా భయం ఉంది. 19వ తేదీన అన్ని దశల ఎన్నికలు ముగియనుండటంతో ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. పార్టీ ముఖ్యనేతలను ఆ రోజు జగన్ అందుబాటులో ఉండాలని సూచించారట. ఎగ్జిట్ పోల్స్ బట్టి ఫలితాలపై ఒక అంచనాకు రానున్నారు. అదే రోజే పార్టీ ముఖ్యనేతలకు ఎమ్మెల్యే అభ్యర్థుల బాధ్యతలను అప్పగించనున్నారు. గత అసెంబ్లీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ లాక్కున్నందున మరోసారి ఆ పార్టీ అటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. ఒకవేళ వైసీపీ మ్యాజిక్ ఫిగర్ కు ఒకటిరెండు సీట్లు అటూఇటుగా ఉండే ఏదైనా జరగవచ్చని, పవన్ కళ్యాణ్ కచ్చితంగా టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలను వారి వైపు లాక్కునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక్కో జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల బాధ్యత ఒక్కో ముఖ్యనేతపై జగన్ పెట్టనున్నారు. ఈ నేతలు ఆ జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ పార్టీకి అందుబాటులో ఉండేలా చూడాలి. 22న జగన్ అమరావతికి చేరుకుంటారని, 23న ఫలితాల రోజు కూడా ఆయన అక్కడే పార్టీ కార్యాలయంలో ఉంటారు.

పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ

గత ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ లో విఫలమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఈ అంశంలో కొంత సక్సెస్ అయ్యింది. ముందు నుంచే బూత్ కమిటీ కార్యకర్తలకు పోల్ మేనేజ్ మెంట్, ఎన్నికల రోజు వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ శిక్షణ ఇప్పించింది. ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పించింది. ఇక, ఇప్పుడు కౌంటింగ్ పై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఇందుకుగానూ పార్టీ కౌంటింగ్ ఏంజెంట్లకు శిక్షణ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీన తమ కౌంటింగ్ ఏజెంట్లను వెంటబెట్టుకొని ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయవాడ రావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సూచించారు. ఆ రోజు విజయవాడలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ శిక్షణ ఇవ్వనుందట. కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించనున్నారు. మొత్తంగా ఈసారి విజయంపై ధీమాగా ఉన్న వైసీపీ ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News